దారి తప్పుతున్న ఉపగ్రహాలు | Sakshi Guest Column On Satellites | Sakshi
Sakshi News home page

దారి తప్పుతున్న ఉపగ్రహాలు

Mar 23 2026 12:07 AM | Updated on Mar 23 2026 12:07 AM

Sakshi Guest Column On Satellites

విశ్లేషణ

నావిగేషన్‌ సిస్టం ఇపుడు సుపరిచితమైన పదబంధమే. దారి ఎవరినీ అడుగన వసరం లేకుండా మ్యాప్‌ చూసుకుంటూ గమ్యస్థానం చేరేందుకు ఉపగ్రహాలు మార్గదర్శనం చేస్తాయి. నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్ట్సలేషన్‌ (నావిక్‌) పేరుతో భారత్‌ కూడా ఒక ఉపగ్రహ నావిగేషన్‌ సిస్టంను అభివృద్ధి చేసుకుంది. అది ఇపుడు అంతరిక్షంలో కొన ఊపిరితో ఉంది. శాస్త్ర–సాంకేతిక మంత్రిత్వ శాఖ రెండేళ్ళ క్రితమే దీనిపై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రపంచ ఉపగ్రహ నావిగేషన్‌లో భారత్‌ స్వావలంబనకు అదొక తార్కాణంగా నిలిచిందని పేర్కొంది. కానీ మన నావిగేషన్‌ ఉపగ్రహాల స్థితిగతుల గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి పొడసూపుతున్న సమాచారం చూస్తూంటే, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనే నానుడి ’నావిక్‌’కు సరిగ్గా అతికినట్లుగా కనిపిస్తోంది. 

ఆటమిక్‌ క్లాక్‌ల పనితీరు?
కార్గిల్‌ యుద్ధం (1999) నేపథ్యంలో ఒక భారతీయ నావిగేషన్‌ సిస్టంను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం తలెత్తింది. అమెరికా నిర్వహిస్తున్న జీపీఎస్‌ నావిగేషన్‌ సిస్టం నుంచి అందుబాటులోనున్న సంకేతాలు అప్పట్లో కార్యాచరణకు సంబంధించి కొన్ని సవాళ్ళకు కారణమయ్యాయి. దాని కనుగుణంగానే ‘ఇస్రో’ ‘నావిక్‌’ డిజైన్, అభివృద్ధిని పూర్తి చేసింది. అది 2016 నుంచి పని చేయడం మొద లెట్టింది. ఎతై ్తన ప్రాంతాలలో గ్లోబల్‌ సిస్టంల నుంచి సిగ్నల్స్‌ ఒక్కోసారి అందుబాటులోకి రావు కనుక, ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉపయోగపడే విధంగా ‘నావిక్‌’కు డిజైన్‌ చేశారు.

నావిగేషన్‌ ఉపగ్రహానికి ‘ఆటమిక్‌ క్లాక్‌’ గుండెకాయ లాంటిది. సెకనులో బిలియన్‌ వంతు లోపల కూడా అది సరైన స్థితిని చూప గలదు. ఈ రూబీడియం ఆటమిక్‌ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్స్‌ (ఆర్‌.ఏ. ఎఫ్‌.ఎస్‌.) క్లాక్‌లను ఒక స్విస్‌ తయారీ సంస్థ నుంచి ‘ఇస్రో’ సమీకరించింది. కానీ, వాటిలో కొన్ని సరిగ్గా పనిచేయలేదు. మొదటి క్లాక్‌ 2018లో విఫలమైంది. మిగిలిన క్లాక్‌లలో లోపాలను సరిదిద్దుతారనీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. అయినా, లోపాలు కొనసాగుతూనే వచ్చాయి. దాంతో దాదాపు ఐదు ఉపగ్రహాలు ఉపయోగపడనివిగా తయారయ్యాయి. యూరో పియన్‌ స్పేస్‌ ఏజెన్సీ కూడా దాని గెలీలియో ఉపగ్రహ కాన్ట్సలే షన్‌లో అవే రకమైన లోపాలు తలెత్తినట్లు వెల్లడించడం ఒక్కటే ప్రభుత్వానికి కాస్త ఊరటనిచ్చింది. ఆ ఏజెన్సీ కూడా స్విట్జర్లాండ్‌ సరఫరా చేసిన ఆటమిక్‌ క్లాక్‌లనే ఉపయోగించుకుంది. 

ఇక లాభం లేదనుకున్న ‘ఇస్రో’, అహ్మదాబాద్‌ లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌లో సొంతంగా రూబీడియం ఆటమిక్‌ క్లాక్‌లను తయారు చేయడం మొదలు పెట్టింది. వాటిని 2023 మే నెలలో ప్రయోగించిన ఎన్వీఎస్‌–01 ఉపగ్రహంలో ఉపయోగించారు. వాటి పనితీరుపై ‘ఇస్రో’ ఎలాంటి డేటాను పంచుకోలేదు కనుక, సవ్యంగానే పనిచేస్తున్నాయని భావించడం తప్ప చేయగలిగింది లేదు. 

స్మార్ట్‌ఫోన్లలో నావిక్‌ తక్కువే!
అంతరిక్ష విభాగం కుంటుపడినా, అవసరమైన గ్రౌండ్‌ విభాగాలను అభివృద్ధి చేయడం ‘ఇస్రో’ కొనసాగించింది. నావిగే షన్‌ సేవలను ఉపయోగకరమైనవిగా తీర్చిదిద్దేందుకు సర్వే గ్రేడ్‌ రిసీవర్లు, కాంపాక్ట్, లో–కాస్ట్‌ రిసీవర్‌ మాడ్యూళ్ళతో సహా పొత్తు కుదిరే హార్డ్‌వేర్‌ అవసరం. ‘నావిక్‌’ ఆధారిత స్మార్ట్‌ ఫోన్లు సరేసరి. నావిక్‌ ఆధారిత ట్రాకింగ్‌ సాధనాలను అమర్చుకున్న రైళ్ళు ఏ సమయంలో ఎక్కడున్నాయో పరీక్షించి చూసుకున్నారు. చేపల వేటకు వెళ్ళే మర పడవల గమనాన్ని కూడా ‘నావిక్‌’ ఆధారిత ట్రాన్స్‌పాండర్లతో గమనించారు. వివిధ రకాల మోటారు వాహనా లను కూడా ఈ పరీక్షలకు ఉపయోగించుకున్నారు. అయినా, అటు కమర్షియల్‌గా కానీ, ఇటు ప్రజోపయోగంలోకానీ ‘నావిక్‌’ విని యోగం తక్కువ స్థాయిలోనే ఉంది. 

భారతీయ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్లో ప్రస్తుతం దాదాపు 20 మేజర్‌ బ్రాండ్లు, 700 రకాల ఫోన్లు ఉన్నాయి. వివిధ తయారీ సంస్థల నుంచి వస్తున్న 60కి పైగా స్మార్ట్‌ ఫోన్‌ మోడళ్ళు ‘నావిక్‌’ విని యోగానికి అనువైనవని గత ఏడాది డిసెంబర్‌లో పార్లమెంట్‌కు తెలిపారు. ‘నావిక్‌’ ఆధారిత ఫోన్లను ఉపయోగిస్తున్న వారి మొత్తం సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ రెండింటిలోనూ మార్పులు చేస్తేనే భారతీయ నావిగేషన్‌ సిస్టంకు వీలైన హ్యాండ్‌సెట్లు అందుబాటులోకి వస్తాయి. 

కొన్ని చిప్‌ సెట్ల తయారీ సంస్థలు‘నావిక్‌’కు అనువైన ప్రాసెసర్లను మన దేశానికి పంపుతున్నాయి. కానీ, చాలా ఫోన్లలో ‘నావిక్‌’ సిగ్నల్స్‌ కనిపించడం లేదనీ, హార్డ్‌వేర్‌ పరంగా మద్దతు ఉన్నా, తక్కువ–స్థాయి డ్రైవర్లు సిగ్నల్స్‌ను ఫిల్టర్‌ చేస్తున్నాయనీ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్, పుణేలోని విశ్వకర్మ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భారతీయ స్మార్ట్‌ ఫోన్‌ వాడకందారులు ‘నావిక్‌’ను వినియోగించేటట్లు చేయడానికి చేయ వలసింది ఇంకా చాలా ఉందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. 

సాధ్యమయ్యే లక్ష్యాలేనా?
మొదటి తరం నావిగేషన్‌ ఉపగ్రహాల పనితీరులో అటు అంత రిక్షంలోనూ, ఇటు క్షేత్ర స్థాయిలోనూ అదే పనిగా సమస్యలు తలె త్తుతూండటంతో ‘ఇస్రో’ రెండవ తరం శ్రేణి ఉపగ్రహాల తయారీకి నడుం బిగించింది. ఈ శ్రేణిలోని మొదటి ఉపగ్రహం విజయవంతమైంది. కానీ, 2025 జనవరిలో ప్రయోగించిన ఎన్వీఎస్‌–02 ఉప గ్రహం నిర్దేశించిన కక్ష్యను చేరుకోలేకపోయింది. గత సంవత్సరాంతంలో ఎన్వీఎస్‌–03 ప్రయోగించే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం 2025 ఆగస్టులో ప్రకటించింది. తదుపరి ఆరు నెలల్లో ఎన్వీఎస్‌–04, ఎన్వీఎస్‌–05 ప్రయోగాలు కూడా ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత కొద్ది నెలలు గడిచాక, 2026 లాంచ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు కానీ, వాటిలో ఎన్వీఎస్‌–శ్రేణి ఉపగ్రహాల ఊసు లేదు. 

స్పేస్‌ టెక్నాలజీకి సంబంధించిన కీలక విభాగాల్లో ‘ఇస్రో’ కొన్ని దశాబ్దాలుగా స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తోంది. అయితే, ప్రభుత్వ వినియోగానికి అంకితమైనవాటిని మినహాయిస్తే, ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడే స్పేస్‌ టెక్నాలజీని అందించడంలో ‘ఇస్రో’ పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. కమ్యూనికేషన్లు, బ్రాడ్‌ కాస్టింగ్, రిమోట్‌ సెన్సింగ్, భూ పరిశీలనకు వివిధ విజయవంతమైన భారతీయ ఉపగ్రహాలు ఉన్నప్పటికీ, కమర్షియల్‌ వాడకందారులు ఇప్పటికీ విదేశీ ఉపగ్రహాలపైనే ఎక్కువగా ఆధార పడుతున్నారు. దూర శ్రవణ విద్యకు అంకితమైన ఎడ్యుశాట్‌ టెక్నికల్‌గా సఫలమైనప్పటికీ, ప్రోగ్రమాటిక్‌ వైఫల్యాన్ని చవిచూసింది. నెట్‌వర్క్‌ కనెక్టివిటీ, కంటెంట్‌ జనరేషన్‌లో వెలితులు, బలమైన మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ కొరవడటం దానికి కారణాలని ఆ ప్రోగ్రామ్‌ ఆడిట్‌ నివేదికలో వెల్లడైంది. ఇపుడు నావిగేషన్‌ సేవల ప్రహసనాన్ని చూస్తున్నాం. ‘ఇస్రో’ లోతైన ఆత్మపరిశీలన చేసుకోక తప్పదు. 

2022 కల్లా మానవ సహిత అంతరిక్ష నౌకను ప్రయోగించాలని ప్రధాని 2018లో ఒక అవాస్తవిక లక్ష్యాన్ని ‘ఇస్రో’ ముందుంచారు. ఈ ప్రయోగానికి ఇంకా ఒకటి రెండేళ్ళు పట్టేటట్లు ఉంది. అంతలోనే ప్రధాని, భారత్‌కు 2035 కల్లా సొంత అంతరిక్ష కేంద్రం ఉండాలనీ, 2040 కల్లా చంద్రునిపైకి మనం వ్యోమగామిని పంపగలగాలనీ ఆశావహమైన కార్యక్రమాలను ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ‘ఇస్రో’పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇటీవలి వైఫల్యాల నేపథ్యంలో అంతరిక్ష రంగానికి సంబంధించి తన ప్రాధాన్యాలను ప్రభుత్వం సవరించు కోవాల్సి ఉంది.

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Advertisement
 
Advertisement
Advertisement