యుద్ధ విరమణ మార్గాలేమిటి? | US and Israel vs Iran war has entered its fourth week | Sakshi
Sakshi News home page

యుద్ధ విరమణ మార్గాలేమిటి?

Mar 21 2026 3:26 AM | Updated on Mar 21 2026 3:26 AM

US and Israel vs Iran war has entered its fourth week

యూఎస్, ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధం నాలుగవ వారంలోకి ప్రవేశించింది. అయినా ముగింపు సూచనలు కన బడటం లేదు సరికదా మరింత తీవ్రతర మవుతున్నది. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పైన, చమురు మార్కెట్ల పైన స్పష్టంగా కనపడుతున్నది. భారత దేశం కూడా ఈ జియో పొలిటికల్‌ చరంగంలో చిక్కుకున్నది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్ఫైన్స్, సింగపూర్, పాకిస్తాన్‌ వంటి దేశాలలోని సగటు పౌరులకు యుద్ధ సెగ తగులు తున్నది. సుమారుగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్‌ జలసంధి దాదాపుగా మూతపడింది.

యుద్ధాలను ప్రారంభించటం దేశాధినేతల చేతిలో ఉంటుంది కానీ ముగింపు మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదని ప్రస్తుత సంక్షోభం సూచిస్తున్నది. ప్రారంభం నుండి కూడా యుద్ధ ‘అంతిమ లక్ష్యం’ ఏమిటనే దానిపై యూఎస్‌–ఇజ్రాయెల్‌ విధానంలో గందరగోళం కన్పడుతున్నది. ఇరాక్, అఫ్గాన్‌ యుద్ధాల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని అంతమొందించి యూఎస్‌ఏ సులువుగా అక్కడి ప్రభుత్వాలను పడ గొట్టింది. ఇరాక్‌ అనుభవాల నేపథ్యంలో ఇరాన్‌ తన నాయకత్వాన్ని పూర్తిగా వికేంద్రీకరించినట్లు స్పష్టమవుతున్నది.

ఇరాన్‌ వ్యూహం
అమెరికా–ఇజ్రాయెల్‌లు ఇరాన్‌ను తమ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఈ ముప్పు తప్పాలంటే మూడు లక్ష్యాలను నిర్దే శించుకున్నాయి: 1. ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. 2. ఇరాన్‌ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం. 3. ఇరాన్‌లో అధికారం మతతత్వ శక్తుల నుండి బాధ్యతా యుతమైన వర్గాలకు బదలాయింపు. ఈ మూడు లక్ష్యాలు కేవలం గగనతల యుద్ధం ద్వారా సాధించాలనుకోవటం అత్యాశ. వెని జులాలో మాదిరిగా అధ్యక్షుడిని తప్పించటంతో ప్రభుత్వం మారు తుందని ట్రంప్‌ భావించినట్లయితే అది హాస్యాస్పదం. 

మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ ఒక బలమైన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ బలమైన సాయుధ సంపత్తిని ఏర్పరచుకున్నది. రష్యా–చైనాలతో వ్యూహాత్మక సంబంధాలనుపెంపొందించుకున్నది. 2025 జూన్‌లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటానికి సమగ్ర ప్రణాళికతో సున్నద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తున్నది. అందుకే ప్రస్తుత యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్‌ నేరుగా గల్ఫ్‌ దేశాలను ఈ యుద్ధం లోనికి లాగింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. మధ్యప్రాచ్యంలో సంక్షోభానికి, పాలస్తీనా సంక్షోభానికి ముఖ్య కారణం యూఏఈ, సౌదీ, ఖతర్‌ వంటి దేశాలు యూఎస్‌ఏ కొమ్ముకాయటమేనని ఇరాన్‌ మొదటినుండీ వాదిస్తున్నది. 

యూఎస్‌ఏ మధ్యవర్తిత్వంతో అరబ్‌ దేశాలు 2020లో ఇజ్రా యెల్‌తో సంబంధాలు మెరుగు పరచుకోవటానికి ఒప్పందాలు (అబ్రహాం ఒప్పందాలు) చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈ, బహ్రెయిన్‌లు ఇజ్రాయెల్‌తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతర్‌ గత దశాబ్ద కాలంగా తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడకుండా పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, పర్యాటక రంగం, బ్యాంకింగ్‌–ఫైనాన్స్‌ రంగాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తు న్నాయి. 

యూఎస్‌ఏ – ఐరోపా ఆర్థిక వ్యవస్థలతో తమ ఆర్థిక వ్యవ స్థలను అనుసంధానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనా (గాజా), ఇజ్రాయెల్‌ విషయాలలో కొంత మెతక లేదా పాశ్చాత్య సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ హమాస్‌ (గాజా), హెజ్బొల్లా (లెబనాన్‌), హౌతీ (యెమెన్‌) వంటి రాడికల్‌ ఇస్లామిక్‌ సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌తో బాటుగా, లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. దీంతో సౌదీ యువరాజు యూఎస్‌ఏ ఒత్తిడిని తట్టుకుని అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికీ నిరాకరించాడు.

పోరాడితే పోయేదేమీ లేదు!
ఇరాన్‌ – ఖతర్‌లలో విస్తరించిన దక్షిణ పార్స్‌ సహజ వాయువు నిల్వల క్షేత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది. ఈ క్షేత్రం మీద దాడి ద్వారా ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని  క్లిష్ట దశలోనికి నెట్టివేసినట్లే. ఇప్పటి వరకూ యుద్ధంలో ఇరాన్‌ కొత్తగా ఆర్థికంగా నష్టపోయిందేమీ లేదు. ఇరాన్‌ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలు, అమెరికా లక్ష్యాలను దెబ్బతీస్తున్నది. అమెరికా – ఇజ్రా యెల్‌ ఈ చౌక డ్రోన్లను, క్షిపణులను పేల్చి వేయటానికి అత్యంత ఖరీ దైన పేట్రియాట్, థాడ్‌ క్షిపణులను వాడాల్సి వస్తున్నది. ఈ రకంగా యూఎస్‌–ఇజ్రాయెల్‌లకు ఇది ఖరీదైన యుద్ధంగా పరిణమించింది.

అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగటం ఇరాన్‌కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలోనే యూఎస్‌ మొదటగా ఇరాన్‌ చమురు ఎగుమతి కూడలి అయిన ఖర్గ్‌ దీవిపైనా, ఇజ్రాయెల్‌... ఇరాన్‌ ప్రధాన సహజ వాయువు క్షేత్రమైన దక్షిణ పార్స్‌ నిల్వలపైనా దాడి చేశాయి. ఆర్థికంగా ఇరాన్‌ను దిగ్బంధించటానికి ఈ ఎత్తుగడ. దీనికి ప్రతిగా ఇరాన్‌ గల్ఫ్‌ దేశాల ఆయువుపట్టులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. 

ఈ వ్యూహంలో భాగంగానే ఖతార్‌ ప్రధాన ఎల్‌ఎన్‌జీ కేంద్రం ‘రస్‌ లఫాన్‌’పై దాడికి దిగింది. దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్‌ ఎగుమతికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికా– ఇజ్రాయెల్‌ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగిక్రమంగా ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగా మారుతున్నది. 

రష్యాకు ఉపయుక్తం
నిశితంగా పరిశీలిస్తే, యూఎస్‌–ఇజ్రాయెల్‌లకు ఈ యుద్ధాన్ని ముగించటానికి మార్గాలు చాలా తక్కువ. అవి కూడా క్లిష్టమైనవి. ఇరాన్‌ తనంత తానుగా బేషరతుగా లొంగిపోయి యుద్ధాన్ని విర మించే అవకాశాలు మృగ్యం. అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించి, ఇరాన్‌ పాక్షికంగా శుద్ధి చేసిన యురేనియంను మెరుపు దాడిలో చేజిక్కించుకొని, ఆ సాకుతో యుద్ధ విరమణ చేయటం ఒక ప్రత్యామ్నాయం. కుర్ద్‌ తిరుగుబాటు దారులను ప్రోత్సహించి వారి ద్వారా ఇరాన్‌ ప్రభుత్వాన్ని కూలదోయటం మరొక మార్గం. టర్కీ లేదా ఇరాక్‌ భూతల మార్గాల ద్వారా అమెరికా–ఇజ్రాయెల్‌ సైనిక బలగాలు ఇరాన్‌లో ప్రవేశించి ప్రభుత్వాన్ని కూలదోయటం అతిసంక్లిష్టమయిన ప్రత్యామ్నాయం. 

ఈ ప్రత్యామ్నాయాలన్నింటిలో పెద్ద సంఖ్యలో యూఎస్‌/ఇజ్రాయెల్‌ సైనికులు చనిపోయే అవకాశా లున్నాయి. ఇవి వాటికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఈ యుద్ధం ఒక రకంగా రష్యాకు ఉపయుక్తంగా మారినట్లుగా కన్పిస్తున్నది. రష్యా చమురు గ్యాస్‌కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో రష్యా నుండి చమురు కొనుగోళ్ల ఆంక్షలను అమెరికా సడలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్‌ యుద్ధంనుండి యూఎస్‌ఏ–ఐరోపా దృష్టి మరలటం కూడా రష్యాకు కలి సొస్తుంది. మధ్య ప్రాచ్యం, గల్ఫ్‌ దేశాలలో రష్యా ప్రాపకం మరింతగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

జియో పొలిటికల్‌ కోణంలో పరిశీలిస్తే, అమెరికా ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో ఈ యుద్ధాన్ని ఒక భాగంగా పరిగణించవచ్చు. మధ్య ఆసియాలో ఇరాన్‌–ఇరాక్‌ సహజప్రాంతీయ శక్తులు. వీటిని బలహీనపరచటానికి యూఎస్‌ఏ మొదటి నుండి సౌదీ అరేబియా, యూఏఈలను బలోపేతం చేస్తున్నది. ఇదివరకు గల్ఫ్‌ యుద్ధంలో భాగంగా ఇరాక్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగా కూడా ఇరాక్‌లో అణ్వాయుధాలు (వెపన్స్‌ ఆఫ్‌ మాస్‌ డిస్ట్రక్షన్‌) ఉన్నాయని నింద మోపింది. 

ఏ రకమైన అణ్వా యుధాలు లేవని చివరకు ఒప్పుకొన్నది. ప్రభుత్వాల మార్పిడి, ముందస్తు దాడులు వంటి సిద్ధాంతాలను యూఎస్‌ఏ తన జియో పొలిటికల్‌ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నది. ఇరాన్‌పై యుద్ధాన్ని కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.

-వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల బోధకులు
-గురజాల శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement