‘నంబర్‌ 1’ ఎప్పటికీ ఒంటరే! | Raj Shamani Podcast with Psychiatrist Dr K | Sakshi
Sakshi News home page

పంతం తీరినా ఆగని పరుగు!

Mar 20 2026 12:07 PM | Updated on Mar 20 2026 12:22 PM

Raj Shamani Podcast with Psychiatrist Dr K

రాజ్‌ శమానీ, డాక్టర్‌ అలోక్‌ కనోజియా (Photo: Raj Shamani Youtube)

వ్యూ పాయింట్‌:

పాడ్‌కాస్ట్‌: ఫిగరింగ్‌ అవుట్‌

అతిథి: డాక్టర్‌ కె., ప్రముఖ సైకియాట్రిస్ట్‌

హోస్ట్‌: రాజ్‌ శమానీ, పాడ్‌కాస్టర్‌

డాక్టర్‌ కె. (డాక్టర్‌ అలోక్‌ కనోజియా) హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన మానసిక వైద్య నిపుణులు. నేటి డిజిటల్‌ తరానికి మానసికంగా అండగా నిలవడానికి ‘హెల్దీ గేమర్‌’ సంస్థను స్థాపించారు. సాధనేచ్ఛ వెనుక ఉన్న సైకాలజీని, మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మన మెదడు స్పందించే తీరును విశ్లేషించారు.

విరిగిన ఇంజిన్‌తో విజయం!
‘‘ఇలాంటివి నేను తరచు చూస్తుంటాను. చాలామందికి విజయం అనేది ఒక ‘కోపింగ్‌ మెకానిజం’ (ఒక బాధ నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం). నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు లేదా ‘నేను దేనికీ పనికిరాను’ అని నీకు అనిపించినప్పుడు, అది నిజం కాదని ప్రపంచానికి; లేదా నీకు నువ్వు నిరూపించుకోవటం కోసం వారానికి 100 గంటలు కష్టపడతావు. అంటే నీ మనసు లోని ఒక ‘విరిగిన’ (లోపమున్న) భాగాన్నే నువ్వు ఇంధనంగా వాడుకుంటావు. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే... నువ్వు అనుకున్న శిఖరాన్ని చేరుకున్న తర్వాత కూడా, నిన్ను అక్కడి వరకు నడిపించిన ఆ ఇంజిన్‌ను ఆపేయాలని నీకు తెలియదు. నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా, నువ్వు ఇంకా పరుగెడుతూనే ఉంటావు!

పాజిటివ్‌గా ఉండటం కష్టం
‘‘మనం ఎప్పుడూ ‘పాజిటివ్‌’గా ఉండాలి అనే మాట వింటుంటాం. నిజానికి ఎల్లవేళలా పాజిటివ్‌గా ఉండ లేం. మనలో పంతం పని చేస్తూ ఉంటుంది. వాస్తవానికి పంతం కూడా ఒక అద్భుతమైన ఇంధనమే. ‘నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు’ అని ఎవరైనా అన్నప్పుడు, నీకు వచ్చే కోపం వల్ల కలిగే పట్టుదల కేవలం పాజిటివ్‌గా ఉండటం వల్ల రాదు. అయినా, నీలోని ‘నెగెటివ్‌ కోణాన్ని’ పూర్తి పాజిటివిటీతో తొలగించాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా ఆ కోణాన్ని అర్థం చేసుకోవాలి. పంతంతో గెలవడంలో తప్పు లేదు కానీ, సమస్య ఎక్కడ వస్తుందంటే... ఆ గెలుపు అనే పందెం ముగిసిన తర్వాత కూడా, నువ్వు వేరే దానివైపు దృష్టి మరల్చకపోతే నీలోని అదే పంతం నీ ప్రత్యర్థులను కాకుండా నిన్నే దహించడం మొదలుపెడుతుంది.

‘నంబర్‌ 1’ ఎప్పటికీ ఒంటరే!
‘‘మీరు ఒక భారీ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నప్పుడు, కొన్నిసార్లు బాధితుల మనో భావాలను పట్టించుకోకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు కొంచెం స్వార్థంగా లేదా కుటిలంగా (మాకియవెలి యన్‌) ఉండాల్సి రావచ్చు. తక్కువ కాలంలో విజయం సాధించడానికి ప్రపంచం ఇలాంటి ‘చీకటి లక్షణాలకే’ ప్రాధాన్యం ఇస్తుంది. మీరు మీలోని దయను లేదా సానుభూతిని పక్కన పెట్టగలిగితే, మీరు చాలా వేగంగా ఎదగగలరు. కానీ దీనికి ఒక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మీరు చివరకు విజేతగా నిలుస్తారు కానీ పూర్తిగా ఒంటరి అయిపోతారు. ఒక కఠినమైన వ్యాపార వేత్తగా మారడానికి మీరు ఏ ‘స్విచ్‌’ని అయితే ఆఫ్‌ చేశారో, అదే స్విచ్‌ మీ కుటుంబంతో ప్రేమను లేదా అనుబంధాన్ని పొందకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది.

డిజిటల్‌ పోషకాహార లోపం 
‘‘సోషల్‌ మీడియా వ్యసనాన్ని నేను ‘డిజిటల్‌ పోషకాహార లోపం’ అంటాను. ఇది ఎలా ఉంటుందంటే... చాక్లెట్‌ రుచి ఉన్న ‘చెక్కపొట్టు’ను తినడం లాంటిది. అది తింటున్నప్పుడు మీ నాలుకకు రుచిగా ఉండి, సంతోషంగా అనిపించవచ్చు. కానీ మీ శరీరానికి కావలసిన పోషకాలు అందక శరీరం కృశించి పోతుంటుంది. మీరు రోజుకు ఎనిమిది గంటలు ఆన్‌లైన్‌లో ఇతరులతో గడిపినా కూడా, మీ మనసు లోతుల్లో ఎక్కడో తెలియని ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. ఎందుకంటే, మీ పక్కన నిజంగా ఎవరూ లేరనే విషయం మీ నాడీ వ్యవస్థకు తెలుసు. మనం ఎక్కువ మందిని చేరు కోవడానికి ప్రాధాన్యత ఇచ్చాం కానీ, బంధాలలోని లోతును కోల్పోయాం.
- ఎడిటోరియల్‌ టీమ్‌ 

 

Advertisement
 
Advertisement
Advertisement