breaking news
Raj Shamani
-
ఆ రాత్రి పంపిన సందేశం.. రూ.కోటి సంపాదనకు మార్గం!
జీవితాన్ని మార్చడానికి కొన్నిసార్లు పెద్ద పెట్టుబడి, డిగ్రీ లేదా భారీ పరిచయాలు అవసరం ఉండకపోవచ్చు. సరైన సమయంలో వేసే ఒక్క అడుగు కూడా కెరీర్‌కు కొత్త దారిని చూపించొచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది యువ రచయిత, ఫ్రీలాన్సర్ ఆదిత్య బన్సాల్ కథ. 17 ఏళ్ల వయసులో పోడ్కాస్టర్, ఎంట్రాప్రెన్యూర్ రాజ్ షమానీకి ఓ అర్ధరాత్రి పంపిన డీఎం (సందేశం).. తన కెరీర్‌ను మలుపుతిప్పిందని బన్సాల్ తాజాగా వెల్లడించారు. ఆ అవకాశంతో మొదలైన ప్రయాణంలో 22 ఏళ్ల వయసుకే రూ.1 కోటి సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు.జేఈఈ ప్రిపరేషన్ నుంచి ఆన్లైన్ కంటెంట్ వైపు..2021లో బన్సాల్ జేఈఈకి సిద్ధమవుతున్నారు. పరీక్ష అక్టోబర్‌కు వాయిదా పడిన సమయంలో యూట్యూబ్‌లో స్వయంవృద్ధి, ఆదాయ మార్గాలకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే రాజ్ షమానీ వీడియోలను కూడా ఫాలో అయ్యేవారు. అప్పటికే డబ్బు సంపాదించేందుకు గ్రాఫిక్ డిజైన్, వెబ్సైట్ డెవలప్మెంట్ వంటి మార్గాలను ప్రయత్నించినా అవి సఫలం కాలేదని బన్సాల్ చెప్పారు.అప్పటికి తన ముందున్న సాధారణ మార్గం జేఈఈ రాయడం.. ఇంజినీరింగ్ చదవడం.. ఆ తర్వాత ఉద్యోగం చేయడమేనని ఆయన గుర్తుచేసుకున్నారు. కానీ ఆ దారిలో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే ఊహించగలిగానని, అది తనకు నచ్చలేదని తెలిపారు.రాత్రి పంపిన డీఎం..ఒకరోజు షమానీ ఆదాయ మార్గాలపై చేసిన వీడియోను చూసిన బన్సాల్.. అందులోని ఆలోచనలను ట్విట్టర్ (ప్రస్తుతం ‘ఎక్స్’) థ్రెడ్‌గా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గూగుల్ డాక్లో గంటల తరబడి పనిచేసి, ఎలాంటి ఉద్యోగం లేదా డబ్బు ఆశించకుండా ఆ థ్రెడ్‌ను షమానీకి నేరుగా పంపించారు.రాత్రి 10:41 గంటలకు పంపిన ఆ డీఎంకు తెల్లవారుజామున 3:53 గంటలకు సమాధానం వచ్చింది. థ్రెడ్‌ను ముందుగా పోస్ట్ చేసి స్పందన ఎలా వస్తుందో చూస్తానని, మంచి ఫలితం వస్తే తన ట్విట్టర్ థ్రెడ్‌ల కోసం బన్సాల్‌ను నియమించుకుంటానని షమానీ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.17 ఏళ్లకే తొలి పెయిడ్ వర్క్..బన్సాల్ పంపిన థ్రెడ్‌కు సుమారు 1,200 లైక్స్ వచ్చాయి. తాను అప్పటికి పెద్దగా అనుభవం లేని రచయితనని, ఆ థ్రెడ్ తన అత్యుత్తమ రచన కూడా కాదని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ షమానీ అతనిలోని సామర్థ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చారు.ఆ తర్వాత బన్సాల్ షమానీ కోసం సుమారు 5–6 ట్విట్టర్ థ్రెడ్లు రాశారు. అప్పటికి తనకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో అమెజాన్ గిఫ్ట్ కార్డుల రూపంలో చెల్లింపులు అందుకున్నట్లు తెలిపారు. అయితే ఈ అనుభవంలో తనకు లభించిన అసలు విలువ డబ్బు కాదని బన్సాల్ చెప్పారు. కంటెంట్ కోసం అవసరమైన సమాచారం, సోర్సులు, మెటీరియల్‌ను షమానీ అందించడంతో పాటు తనను టీమ్‌లో ఒకరిగా చూసేవారని గుర్తుచేసుకున్నారు.ఒక్క టెస్టిమోనియల్తో మరో అవకాశం..తర్వాత షమానీకి పూర్తి స్థాయి టీమ్ అవసరం కావడంతో ఈ పని ఆగిపోయింది. అయితే వెళ్లే ముందు బన్సాల్‌కు ఆయన ఇచ్చిన టెస్టిమోనియల్ మరో కీలక అవకాశానికి దారితీసింది. అదే సిఫార్సుతో తన తొలి రిటైనర్ క్లయింట్‌ను సంపాదించుకున్నట్లు బన్సాల్ తెలిపారు.అక్కడి నుంచి ఫ్రీలాన్స్ రచయితగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు 45 మందికి పైగా ఫౌండర్లతో పనిచేశానని, 22 ఏళ్ల వయసులో రూ.1 కోటి సంపాదనను దాటానని ఆయన పేర్కొన్నారు. మధ్యలో క్లయింట్లు లేకపోయినా, ఆదాయం లేని దశలు ఎదురైనా.. 17 ఏళ్ల వయసులో లభించిన తొలి అవకాశం తనపై నమ్మకాన్ని పెంచిందని చెప్పారు.‘‘ఆ డీఎం ఇప్పటికీ నా బెస్ట్.. ’’తన కెరీర్లో ఆ ఒక్క అవకాశానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెబుతూ బన్సాల్ షమానీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆ డీఎం ఇప్పటికీ నేను రాసిన అత్యుత్తమ విషయం’’ అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!
డాక్టర్ కె. (డాక్టర్ అలోక్ కనోజియా) హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన మానసిక వైద్య నిపుణులు. నేటి డిజిటల్ తరానికి మానసికంగా అండగా నిలవడానికి ‘హెల్దీ గేమర్’ సంస్థను స్థాపించారు. సాధనేచ్ఛ వెనుక ఉన్న సైకాలజీని, మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మన మెదడు స్పందించే తీరును విశ్లేషించారు.విరిగిన ఇంజిన్‌తో విజయం!‘‘ఇలాంటివి నేను తరచు చూస్తుంటాను. చాలామందికి విజయం అనేది ఒక ‘కోపింగ్ మెకానిజం’ (ఒక బాధ నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం). నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు లేదా ‘నేను దేనికీ పనికిరాను’ అని నీకు అనిపించినప్పుడు, అది నిజం కాదని ప్రపంచానికి; లేదా నీకు నువ్వు నిరూపించుకోవటం కోసం వారానికి 100 గంటలు కష్టపడతావు. అంటే నీ మనసు లోని ఒక ‘విరిగిన’ (లోపమున్న) భాగాన్నే నువ్వు ఇంధనంగా వాడుకుంటావు. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే... నువ్వు అనుకున్న శిఖరాన్ని చేరుకున్న తర్వాత కూడా, నిన్ను అక్కడి వరకు నడిపించిన ఆ ఇంజిన్‌ను ఆపేయాలని నీకు తెలియదు. నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా, నువ్వు ఇంకా పరుగెడుతూనే ఉంటావు!పాజిటివ్‌గా ఉండటం కష్టం‘‘మనం ఎప్పుడూ ‘పాజిటివ్’గా ఉండాలి అనే మాట వింటుంటాం. నిజానికి ఎల్లవేళలా పాజిటివ్‌గా ఉండ లేం. మనలో పంతం పని చేస్తూ ఉంటుంది. వాస్తవానికి పంతం కూడా ఒక అద్భుతమైన ఇంధనమే. ‘నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు’ అని ఎవరైనా అన్నప్పుడు, నీకు వచ్చే కోపం వల్ల కలిగే పట్టుదల కేవలం పాజిటివ్‌గా ఉండటం వల్ల రాదు. అయినా, నీలోని ‘నెగెటివ్ కోణాన్ని’ పూర్తి పాజిటివిటీతో తొలగించాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా ఆ కోణాన్ని అర్థం చేసుకోవాలి. పంతంతో గెలవడంలో తప్పు లేదు కానీ, సమస్య ఎక్కడ వస్తుందంటే... ఆ గెలుపు అనే పందెం ముగిసిన తర్వాత కూడా, నువ్వు వేరే దానివైపు దృష్టి మరల్చకపోతే నీలోని అదే పంతం నీ ప్రత్యర్థులను కాకుండా నిన్నే దహించడం మొదలుపెడుతుంది.‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!‘‘మీరు ఒక భారీ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నప్పుడు, కొన్నిసార్లు బాధితుల మనో భావాలను పట్టించుకోకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు కొంచెం స్వార్థంగా లేదా కుటిలంగా (మాకియవెలి యన్) ఉండాల్సి రావచ్చు. తక్కువ కాలంలో విజయం సాధించడానికి ప్రపంచం ఇలాంటి ‘చీకటి లక్షణాలకే’ ప్రాధాన్యం ఇస్తుంది. మీరు మీలోని దయను లేదా సానుభూతిని పక్కన పెట్టగలిగితే, మీరు చాలా వేగంగా ఎదగగలరు. కానీ దీనికి ఒక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మీరు చివరకు విజేతగా నిలుస్తారు కానీ పూర్తిగా ఒంటరి అయిపోతారు. ఒక కఠినమైన వ్యాపార వేత్తగా మారడానికి మీరు ఏ ‘స్విచ్’ని అయితే ఆఫ్ చేశారో, అదే స్విచ్ మీ కుటుంబంతో ప్రేమను లేదా అనుబంధాన్ని పొందకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది.డిజిటల్ పోషకాహార లోపం ‘‘సోషల్ మీడియా వ్యసనాన్ని నేను ‘డిజిటల్ పోషకాహార లోపం’ అంటాను. ఇది ఎలా ఉంటుందంటే... చాక్లెట్ రుచి ఉన్న ‘చెక్కపొట్టు’ను తినడం లాంటిది. అది తింటున్నప్పుడు మీ నాలుకకు రుచిగా ఉండి, సంతోషంగా అనిపించవచ్చు. కానీ మీ శరీరానికి కావలసిన పోషకాలు అందక శరీరం కృశించి పోతుంటుంది. మీరు రోజుకు ఎనిమిది గంటలు ఆన్లైన్లో ఇతరులతో గడిపినా కూడా, మీ మనసు లోతుల్లో ఎక్కడో తెలియని ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. ఎందుకంటే, మీ పక్కన నిజంగా ఎవరూ లేరనే విషయం మీ నాడీ వ్యవస్థకు తెలుసు. మనం ఎక్కువ మందిని చేరు కోవడానికి ప్రాధాన్యత ఇచ్చాం కానీ, బంధాలలోని లోతును కోల్పోయాం.- ఎడిటోరియల్ టీమ్


