ఆ రాత్రి పంపిన సందేశం.. రూ.కోటి సంపాదనకు మార్గం! | Late-Night DM Made Rs 1 Crore Raj Shamani changed life | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి పంపిన సందేశం.. రూ.కోటి సంపాదనకు మార్గం!

Sep 4 2026 3:55 PM | Updated on Sep 4 2026 4:17 PM

Late-Night DM Made Rs 1 Crore Raj Shamani changed life

జీవితాన్ని మార్చడానికి కొన్నిసార్లు పెద్ద పెట్టుబడి, డిగ్రీ లేదా భారీ పరిచయాలు అవసరం ఉండకపోవచ్చు. సరైన సమయంలో వేసే ఒక్క అడుగు కూడా కెరీర్‌కు కొత్త దారిని చూపించొచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది యువ రచయిత, ఫ్రీలాన్సర్‌ ఆదిత్య బన్సాల్‌ కథ. 17 ఏళ్ల వయసులో పోడ్‌కాస్టర్‌, ఎంట్రాప్రెన్యూర్‌ రాజ్‌ షమానీకి ఓ అర్ధరాత్రి పంపిన డీఎం (సందేశం).. తన కెరీర్‌ను మలుపుతిప్పిందని బన్సాల్‌ తాజాగా వెల్లడించారు. ఆ అవకాశంతో మొదలైన ప్రయాణంలో 22 ఏళ్ల వయసుకే రూ.1 కోటి సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు.

జేఈఈ ప్రిపరేషన్‌ నుంచి ఆన్‌లైన్‌ కంటెంట్‌ వైపు..

2021లో బన్సాల్‌ జేఈఈకి సిద్ధమవుతున్నారు. పరీక్ష అక్టోబర్‌కు వాయిదా పడిన సమయంలో యూట్యూబ్‌లో స్వయంవృద్ధి, ఆదాయ మార్గాలకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే రాజ్‌ షమానీ వీడియోలను కూడా ఫాలో అయ్యేవారు. అప్పటికే డబ్బు సంపాదించేందుకు గ్రాఫిక్‌ డిజైన్‌, వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌ వంటి మార్గాలను ప్రయత్నించినా అవి సఫలం కాలేదని బన్సాల్‌ చెప్పారు.

అప్పటికి తన ముందున్న సాధారణ మార్గం జేఈఈ రాయడం.. ఇంజినీరింగ్‌ చదవడం.. ఆ తర్వాత ఉద్యోగం చేయడమేనని ఆయన గుర్తుచేసుకున్నారు. కానీ ఆ దారిలో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే ఊహించగలిగానని, అది తనకు నచ్చలేదని తెలిపారు.

రాత్రి పంపిన డీఎం..

ఒకరోజు షమానీ ఆదాయ మార్గాలపై చేసిన వీడియోను చూసిన బన్సాల్‌.. అందులోని ఆలోచనలను ట్విట్టర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్‌’) థ్రెడ్‌గా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గూగుల్‌ డాక్‌లో గంటల తరబడి పనిచేసి, ఎలాంటి ఉద్యోగం లేదా డబ్బు ఆశించకుండా ఆ థ్రెడ్‌ను షమానీకి నేరుగా పంపించారు.

రాత్రి 10:41 గంటలకు పంపిన ఆ డీఎంకు తెల్లవారుజామున 3:53 గంటలకు సమాధానం వచ్చింది. థ్రెడ్‌ను ముందుగా పోస్ట్‌ చేసి స్పందన ఎలా వస్తుందో చూస్తానని, మంచి ఫలితం వస్తే తన ట్విట్టర్‌ థ్రెడ్‌ల కోసం బన్సాల్‌ను నియమించుకుంటానని షమానీ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

17 ఏళ్లకే తొలి పెయిడ్‌ వర్క్‌..

బన్సాల్‌ పంపిన థ్రెడ్‌కు సుమారు 1,200 లైక్స్‌ వచ్చాయి. తాను అప్పటికి పెద్దగా అనుభవం లేని రచయితనని, ఆ థ్రెడ్‌ తన అత్యుత్తమ రచన కూడా కాదని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ షమానీ అతనిలోని సామర్థ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చారు.

ఆ తర్వాత బన్సాల్‌ షమానీ కోసం సుమారు 5–6 ట్విట్టర్‌ థ్రెడ్‌లు రాశారు. అప్పటికి తనకు బ్యాంక్‌ అకౌంట్‌ లేకపోవడంతో అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డుల రూపంలో చెల్లింపులు అందుకున్నట్లు తెలిపారు. అయితే ఈ అనుభవంలో తనకు లభించిన అసలు విలువ డబ్బు కాదని బన్సాల్‌ చెప్పారు. కంటెంట్‌ కోసం అవసరమైన సమాచారం, సోర్సులు, మెటీరియల్‌ను షమానీ అందించడంతో పాటు తనను టీమ్‌లో ఒకరిగా చూసేవారని గుర్తుచేసుకున్నారు.

ఒక్క టెస్టిమోనియల్‌తో మరో అవకాశం..

తర్వాత షమానీకి పూర్తి స్థాయి టీమ్‌ అవసరం కావడంతో ఈ పని ఆగిపోయింది. అయితే వెళ్లే ముందు బన్సాల్‌కు ఆయన ఇచ్చిన టెస్టిమోనియల్‌ మరో కీలక అవకాశానికి దారితీసింది. అదే సిఫార్సుతో తన తొలి రిటైనర్‌ క్లయింట్‌ను సంపాదించుకున్నట్లు బన్సాల్‌ తెలిపారు.

అక్కడి నుంచి ఫ్రీలాన్స్‌ రచయితగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు 45 మందికి పైగా ఫౌండర్లతో పనిచేశానని, 22 ఏళ్ల వయసులో రూ.1 కోటి సంపాదనను దాటానని ఆయన పేర్కొన్నారు. మధ్యలో క్లయింట్లు లేకపోయినా, ఆదాయం లేని దశలు ఎదురైనా.. 17 ఏళ్ల వయసులో లభించిన తొలి అవకాశం తనపై నమ్మకాన్ని పెంచిందని చెప్పారు.

‘‘ఆ డీఎం ఇప్పటికీ నా బెస్ట్‌.. ’’

తన కెరీర్‌లో ఆ ఒక్క అవకాశానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెబుతూ బన్సాల్‌ షమానీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆ డీఎం ఇప్పటికీ నేను రాసిన అత్యుత్తమ విషయం’’ అంటూ ఆయన చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement