breaking news
Career change
-
కెరీర్ ఛేంజ్.. ఆలోచించి అడుగేయండి!
ఒక కొలువు/వృత్తిలో కొనసాగుతున్నవారు అవసరాన్ని బట్టి మధ్యలో మరో రంగంలోకి మారాలని యోచిస్తుంటారు. అంటే కెరీర్‌ను మార్చుకోవాలని కోరుకుంటారు. ఆ రంగంపై వ్యక్తిగత ఆసక్తి, అందులో అవకాశాలు, ఆదాయం అధికంగా ఉండడం వంటివి కెరీర్ ఛేంజ్ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. కెరీర్‌ను మార్చుకోబోయే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. కెరీర్ ఛేంజ్‌పై నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. వాటిని తెలుసుకుంటే జాగ్రత్తగా అడుగు ముందుకేయొచ్చు. పరిశోధించాలి ఇష్టంలేని రంగంలో ఎవరూ ఎక్కువ కాలం కొనసాగలేరు. భావోద్వేగాలకు లొంగిపోయి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మారాలనుకుంటున్న ఉద్యోగం/వృత్తి గురించి ముందుగానే క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఇందుకు తగిన పరిశోధన సాగించాలి. కొత్త కొలువు మీ అభిరుచి, ఆసక్తులకు తగినదో కాదో గుర్తించాలి. అందులోని సాదకబాధకాలను గమనించాలి. ఇప్పటికే సదరు కొలువు/రంగంలో స్థిరపడినవారిని సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి. కారణమేంటి? మరో రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు అనగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కారణాలు తెలుసుకోవాలని వారు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మీరిచ్చే సమాధానంలో స్పష్టత, నిజాయతీ ఉండాలి. డబ్బుదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేకపోయినా మీరు చెప్పే కారణం దానికంటే ముఖ్యమైనదై ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో సానుకూలమైన కారణం అవసరం. ఆర్థిక స్థితిపై అంచనా మీ నిర్ణయం జీవితాన్ని మార్చేసేది అయినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని, ఇతర విషయాలను అంచనా వేసుకోవాలి. భవిష్యత్తును, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీ నిర్ణయానికి కారణాలు తర్కానికి నిలిచేవిగా ఉండాలి. వాస్తవిక దృక్పథం అవసరం. స్కిల్స్ పెంచుకోవాలి కొత్త రంగంలోకి వెళ్తున్నారంటే అందులో రాణించడానికి తగిన నైపుణ్యాలు కావాలి. కాబట్టి స్కిల్స్ తప్పనిసరిగా పెంచుకోండి. అవసరమైతే స్వల్పకాలిక కోర్సులో చేరి సర్టిఫికేషన్ పూర్తి చేయొచ్చు. సీనియర్ల సలహాలు తీసుకోండి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కూడా ఉపయోగపడతాయి. నిదానమే ప్రధానం కెరీర్ ఛేంజ్ విషయంలో ముఖ్యమైన అంశం.. ప్రస్తుతం చేస్తున్న కొలువును ఎప్పుడు వదులుకోవాలి? కొత్త కొలువులో ఎప్పుడు చేరాలి? అతివేగం అస్సలు పనికిరాదు. నిజంగా వెంటనే మారాల్సిన అవసరం ఉందా? అనేది సమీక్షించుకోవాలి. ఉద్యోగం నుంచి వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటే వెంటనే వెళ్లిపోవచ్చు. వ్యాపారానికి గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్ అనేవి ఉండవు. కానీ, ఉద్యోగం చేస్తూ ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి సమయం, సందర్భం చూసుకోవాలి. ఆచితూచి అడుగేయాలి. -
కెరీర్‌ను మార్చుకుంటున్నారా?
జాబ్ స్కిల్స్: మీకు ప్రస్తుతం చేస్తున్న పని నచ్చడం లేదా? దాని పట్ల అయిష్టత, అనాసక్తి ఏర్పడ్డాయా? మీకున్న నైపుణ్యాలకు అది తగిన రంగం కాదని భావిస్తున్నారా? మార్పును కోరుకుంటున్నారా? మీ తెలివితేటలకు, అభిరుచికి, ఆసక్తికి తగిన కెరీర్‌ను ఎంచుకోవాలని యోచిస్తున్నారా? అయితే ఈ విషయంలో అడుగు ముందుకేసే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. కెరీర్‌ను మార్చుకోవడం అంత తేలిక కాదు. ఇందులో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి. అన్నింటినీ భరించేందుకు సిద్ధపడేవారే కెరీర్‌ను మార్చుకోవచ్చు. మీ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు సమర్థించకపోవచ్చు. పరిచయం లేని కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నారంటే ఎవరికైనా భయాందోళనలు, సందేహాలు ఉండడం సహజమే. ముందుగా కుటుంబ సభ్యులను ఒప్పించాలి. అన్నింటికంటే ముఖ్యం మీపై మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. ఇటీవలి కాలంలో బహుళ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు కెరీర్‌ను మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త రంగంలో తమ ప్రతిభను ప్రదర్శించి, అందరి మెప్పు పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న పనిపట్ల బోర్ ఫీలవుతున్నవారు కూడా కెరీర్ మార్పుపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అవుతుండగా.. మరికొందరు బోల్తాపడుతున్నారు. కెరీర్ మార్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కొత్త రంగంలో విజయవంతంగా దూసుకుపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిజాయతీగా సమీక్షించుకోండి కెరీర్‌ను మార్చుకోవాలనుకునేవారు మొదట చేయాల్సిన పని.. ప్రశాంతంగా కూర్చొని నిజాయతీగా తమను తాము సమీక్షించుకోవడం. ఇలాంటి పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలి. తమను తాము అనేక కోణాల్లో ప్రశ్నించుకోవాలి. కొత్త కెరీర్ దీర్ఘకాలంలో తనకు ఏ విధంగా లాభదాయకమో బేరీజు వేసుకోవాలి. ఆర్థికంగా, మానసికంగా సంతృప్తి కలుగుతుందా? లేదా? నిజంగా తనలో నైపుణ్యాలు ఉన్నాయా? అనేది తేల్చుకోవాలి. సానుకూలమైన సమాధానాలు వస్తేనే అడుగు ముందుకేయాలి. కొందరు క్షణికావేశంతో, భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకొని, నష్టపోతుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుందా? సంపాదన, పొదుపు అనేవి ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. ప్రస్తుతం వస్తున్న వేతనం కంటే కొత్త కెరీర్లో ఎక్కువ వేతనం లభిస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కొత్త రంగంలో అడుగుపెడుతు న్నారంటే అర్థం.. అక్కడ కింది స్థాయి నుంచి మీ జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రారంభంలో వేతనాలు తక్కువే ఉంటాయి. ఇప్పటి స్థిరమైన జీవితం ఇలాగే కొనసాగాలంటే కనీసం ఆరు నెలల వేతనం మీ దగ్గరుండాలి. లేకపోతే మాత్రం బతుకు పోరాటం తప్పదు. ఒకవైపు చేతిలో డబ్బు లేకపోవడం, మరోవైపు కొత్త ఉద్యోగం/వృత్తి.. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సపోర్ట్ నెట్వర్క్ అవసరమే మంచి సలహాలు, సూచనలు ఇచ్చే నెట్వర్క్ ఉండాలి. కెరీర్ ఛేంజర్స్కు ఈ అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. కెరీర్ మారాలనే నిర్ణయాన్ని మీరొక్కరే తీసుకోకండి. సపోర్ట్ నెట్‌వర్క్‌ను ఏర్పరచుకోండి. నలుగురు అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. మీరు ఎంచుకున్న రంగంలోని నిపుణులను సంప్రదించండి. ఆ రంగంలోని అంతర్గత సమాచారాన్ని, అందులోని లాభనష్టాలను వారు మీకు తెలియజేస్తారు. దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకోవచ్చు. విద్య నేర్చుకోవాల్సిందే అప్పటిదాకా పరిచయం లేని కొత్త రంగంలోకి వెళ్తున్నారంటే దానికి సంబంధించిన చదువు, తగిన శిక్షణ ఉంటేనే సక్సెస్ అవుతారు. కాబట్టి దానిపై స్వల్పకాలిక కోర్సులతో అవగాహన పెంచుకోవాలి. శిక్షణ పొందాలి. ఆ రంగానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి. ప్రస్తుత పోటీప్రపంచంలో ఏ రంగంలోనైనా రాణించాలంటే చదువు, శిక్షణ, నైపుణ్యాలు అవసరమే. మార్పు... ఒక్కరోజులో అసాధ్యం కొత్త కెరీర్లోకి దూకగానే అద్భుతాలు జరగాలని కోరుకోవొద్దు. మార్పు అనేది ఒక్క రోజులోనే జరగడం అసంభవం. అక్కడ నిలదొక్కుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. ఒక్కోసారి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఇంతటి సుదీర్ఘ కాలం ఎదురుచూడాలంటే నిరాశ కలగొచ్చు. కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఓపిక, సహనంతో నిరీక్షించాలి. కొత్త కెరీర్లో మీ సత్తా చూపండి.