శివశక్తి తత్వం | Sakshi Guest Column On Ugadi Sri Parabhava Nama Samvatsaram | Sakshi
Sakshi News home page

శివశక్తి తత్వం

Mar 19 2026 2:19 AM | Updated on Mar 19 2026 2:19 AM

Sakshi Guest Column On Ugadi Sri Parabhava Nama Samvatsaram

సందర్భం

భారతీయ కాలగణనలో షష్టిపూర్తి పద్ధతిలో అరవై సంవత్సరాలు ఒక చక్రంగా తిరుగుతుంటాయి. ఈ అరవై నామ సంవత్సరాలకు ఒక్కొక్క దానికి ఒక్కో వైశిష్ట్యం, గూఢార్థం ఉన్నాయి. అయితే, ‘పరాభవ’ నామ సంవత్సరం గురించి వినగానే సామాన్య ప్రజల్లో ఆందోళన కలగడం సహజం. లోకరీత్యా ‘పరాభవం’ అంటే ఓటమి, భంగపాటు లేదా అవమానం అని అర్థం ఉండటమే దీనికి ప్రధాన కారణం. కానీ శాస్త్ర ప్రమాణాల ప్రకారం... ముఖ్యంగా సంస్కృత మూలాలను పరిశీలిస్తే, ఈ పేరు వెనుక అత్యంత ఉదాత్త మైన ఆధ్యాత్మిక పరమార్థం దాగి ఉంది. 

పరతత్వం
ఈ నామాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ‘పరా’, ‘భవ’ అనే రెండు పదాలను విడివిడిగా చూడాలి. ‘లలితా సహస్ర నామ’ స్తోత్రంలో అమ్మవారిని ‘పరా’ అనిసంబో ధిస్తారు. యోగశాస్త్రం ప్రకారం వాక్కు నాలుగు దశలలో ఉద్భవిస్తుంది. అవి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇందులో ‘పరా’ వాక్కు అత్యున్నతమైనది. ఇది నాభి మూలంలో, అంటే మూలాధార చక్రంలో నిశ్శబ్దంగా ఉండే ఆదిశక్తి స్వరూపం. ‘పరా’ అంటే శ్రేష్ఠమైనది, పర బ్రహ్మ విద్యకు మూలమైనది, సకల శక్తులకు ఆధారం అని అర్థం. లోకంలో మనం వాడే ‘పరాభవం’ అనే పదం బాహ్యమైన వైఖరి స్థాయికి సంబంధించినది. కానీ ఈ సంవత్సరం పేరులోని ‘పరా’ అనేది ఆ పరతత్వాన్ని సూచిస్తుంది. 

‘భవ’ అంటే శివ స్వరూపం. ఈశ్వరుడి అష్ట మూర్తులలో ‘భవుడు’ ఒకరు. సృష్టి కార్యానికి మూలమైనవాడు ఆ పరమేశ్వరుడు. అలాగే ‘భవ’ అంటే ప్రాప్తి, పుట్టుక లేదా మంగ ళకర మైన స్థితి అని కూడా సంస్కృత నిఘంటువులు చెబు తున్నాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ‘పరాభవ’ అంటే ‘అత్యున్నతమైన శివతత్వం కలగడం’ లేదా ‘పరాశక్తి ద్వారా శివ సాయుజ్యం సిద్ధించడం’ అని అర్థం వస్తుంది. 

సంస్కృతంలో పరా అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ప్రధాన అర్థాలు: శ్రేష్ఠమైనది, అత్యున్నతమైనది; పరబ్రహ్మ స్వరూపం; పరాశక్తి (దేవి పరమ శక్తి); పరా వాక్‌ – వేదాల్లో చెప్పిన నాలుగు వాక్కులలో అత్యున్నత స్థాయి; అత్యంత దివ్యమైన జ్ఞానం (పరా విద్య). లలిత సహస్ర నామంలో దేవిని ‘పరా’, ‘పరాశక్తి’, ‘పర బ్రహ్మ స్వరూపిణి’ అని పేర్కొంటారు. అంటే పరా అనే పదానికి పరమమైన దైవశక్తి అని అర్థం చెప్పుకోవచ్చు. 

అజ్ఞానానికి పరాభవం
నిజానికి ఈ సంవత్సరం మనలోని అజ్ఞానానికి పరాభవం (ఓటమి) జరిగి, జ్ఞానోదయం కలిగే  సమయంగా భావించాలి. అరిషడ్వర్గాలను జయించి, పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందగోరే సాధకులకు ఈ ఏడాది అత్యంత శుభప్రదమైనది. ఇది శివ–శక్తుల ఐక్యతను, శక్తి–జ్ఞాన సమన్వయాన్ని సూచిస్తుంది. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం/ న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి... శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టికి సమర్థుడవుతాడు. అలా కాకపోతే, ఆ దేవుడు కదలడానికి కూడా శక్తిహీనుడు అని అర్థం. బాహ్య ప్రపంచంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, అంతరంగంలో పరాశక్తిని ధ్యానించేవారికి ఈ కాలం వరప్రసాదం వంటిది.  

తెలుగు పంచాంగంలో ఉన్న 60 సంవత్సరాల చక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ పేర్లు తప్పనిసరిగా శుభం లేదా అశుభం సూచించవు. అవి కేవలం కాల చక్రాన్ని సూచించేవి మాత్రమే. దుర్ముఖి, ఖర, వికారి, విరోధి వంటివి వినడానికి ప్రతికూలంగా ఉన్నా, అవి కాల సూచికలు మాత్రమే. కాబట్టి, ‘పరాభవ’ అనే పేరు విని భయపడవలసిన అవసరం లేదు. పేరులోని అక్షరాల వెనుక ఉన్న తత్వాన్ని గ్రహించినప్పుడు భయం పోయి భక్తి, విశ్వాసం కలుగుతాయి. ఈ ఉగాదిని కేవలం కాలాంతర మార్పుగా కాకుండా, మనలోని పరబ్రహ్మ తత్వాన్ని మేల్కొలిపే ఒక నూతన అధ్యాయంగా ఆహ్వానిద్దాం. ఈ పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో అత్యున్నతమైన శుభాలను ప్రసాదించాలని కోరుకుందాం!

పి. విజయబాబు
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement