ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’! | Special Story On Iran Hits US F 35 Fighter Jet | Sakshi
Sakshi News home page

ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’!

Mar 20 2026 5:40 PM | Updated on Mar 20 2026 6:53 PM

Special Story On Iran Hits US F 35 Fighter Jet
  • ఎఫ్-35కు 350 క్షిపణితో ఢీకొట్టిన ఇరాన్
  • రాడార్ అక్కర్లేదు... పరారుణ సెన్సర్ చాలు 
  • ‘వేడి’ ఆధారంగా ఫైటర్ జెట్ల ట్రాకింగ్ 
  • స్టెల్త్ సాంకేతికత… తూతూమంత్రమే!

ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించిన జగదేకవీరుడు... ఇంటి ముందు మురుగు కాల్వలో పడి దిక్కుమాలిన చావు చచ్చినట్టుంది... ప్రస్తుతం ఎఫ్-35 యుద్ధవిమానం దుస్థితి! ఎఫ్-35ల చరిత్రలో ఇదే ఘోరాతి ఘోరం. ఇంత ఘోరం మునుపెన్నడూ లేదు. ఈ వార్త విన్నాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట మాట వచ్చి ఉండదు. ఎఫ్-35... అమెరికా అమ్ములపొదిలోని అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధవిమానం. శత్రు రాడార్లకు సైతం చిక్కదు-దొరకదని అమెరికా ఘనంగా చెప్పే ఈ ‘స్టెల్త్’ ఫైటర్ జెట్ ఒక్కోదాని ధర వేరియంట్ ఆధారంగా రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది.

యుద్ధవిమానాల పోరాట చరిత్రలో దీని సరిసాటి మరో విమానం నేటి వరకు లేదని చెబుతారు. ఎఫ్-35ను చూసుకుని అమెరికాకు మహా గర్వం. అమెరికా నుంచి ఎఫ్-35 విమానాలను కొనుగోలు చేసిన ఇతర దేశాలు కూడా రక్షణ పరంగా ఎంతో భరోసాతో కనిపిస్తాయి. నిజమే గానీ... అదంతా నిన్నటిదాకా మాత్రమే. ఇరాన్ వైమానిక బలగాలను వెంటాడి, వేటాడి నిర్వీర్యం చేసినట్టు ట్రంప్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ అదే దుర్బల ఇరాన్ రక్షణ దళాలు కొట్టిన ఉండేలు దెబ్బకు ‘ఎఫ్-35 లైట్నింగ్ 2’ అంతటి గండభేరుండం సైతం గతీదారి లేక పశ్చిమాసియాలోని ఓ స్థావరంలో అత్యవసరంగా కిందికి దిగాల్సొచ్చింది. పైలట్ క్షేమనేనని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అమెరికా ప్రకటించింది. 

కాదు కాదు... తమ ప్రతాపానికి ఎఫ్-35 యుద్ధవిమానం కూలిపోయిందనేది ఇరాన్ వాదన. ప్రపంచంలో ఎఫ్-35ను దెబ్బకొట్టిన తొలి దేశం తామేనని ఇరాన్ ప్రకటించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా క్షీణదశలో, పతనావస్థలో ఉన్న ఇరాన్ వైమానిక దళం అత్యంత అధునాతన ఎఫ్-35ను పిట్టను కొట్టినట్టు ఎలా కొట్టగలిగింది? ఇప్పుడిదే అందరిలో మెదులుతున్న సందేహం. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పనైపోయిందని భావించి అతి ధీమాతో సదరు ఎఫ్-35 ఫైటర్ జెట్ మధ్య ఇరాన్ మీదుగా ఎగురుతుండగా ఈ నెల 19న ఆ ఘటన చోటుచేసుకుంది. 

దీనిపై అమెరికా నుంచి ప్రకటన వెలువడేలోపే... పుండు మీద కారం చల్లినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) వెంటనే ప్రతిస్పందించింది. ఎఫ్-35ను తాము ఎలా ట్రాక్ చేసింది, ఎలా అడ్డుకున్నదీ తెలిపే ఫుటేజిని ప్రదర్శించింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 15 దేశాలు ఎఫ్-35 యుద్ధ విమానానికి చెందిన పలు వేరియంట్లను వినియోగిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్వేతసౌధ సందర్శన సందర్భంగా... వీటిని మన దేశానికి కూడా విక్రయిస్తామని ట్రంప్ ప్రతిపాదించారు. దానిపై భారత్ ఇంతవరకు సుముఖత తెలుపలేదు.

స్టెల్త్ ఆధునికతకు నాటు దెబ్బ!
శత్రు దేశాల రాడార్లు పసిగట్టకుండా ప్రయాణించడానికంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసినవే స్టెల్త్ విమానాలు. ఎఫ్-35 స్టెల్త్ యుద్ధవిమానాన్ని ఇరాన్ ఎలా ఢీకొట్టిందనే అంశంపై రక్షణ రంగ నిపుణుడు సందీప్ ఉన్నితన్ స్పందించారు. ‘స్టెల్త్ సాంకేతికత’ను ఆ పేరుతో పిలవటమే సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాడారుకు స్టెల్త్ విమానం అస్సలు కనిపించదని కంపెనీ బ్రోచర్లు చెబుతాయి గానీ... ఆ విమానాన్ని గుర్తించడానికి ఇతర మార్గాలున్నాయని, గురువారం ఎఫ్-35 విషయంలో అదే జరిగిందని సందీప్ చెప్పారు. ఎఫ్-35 లక్ష్యంగా ఇరాన్ ఏ క్షిపణులు ప్రయోగించిందో కచ్చితంగా తెలియనప్పటికీ... అది ప్రత్యేకించి ‘358 విమాన విధ్వంసక క్షిపణి’ గానీ లేదా ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి గానీ అయివుండొచ్చని అభిప్రాయపడ్డారు. 

‘358 క్షిపణి’ని ‘ఎస్ఏ-67’గా కూడా వ్యవహరిస్తారు. ఇది పరారుణ సెన్సర్ అమర్చిన ఓ మిసైల్. తక్కువ ఎత్తులో నిదానంగా ప్రయాణించే డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్లను ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే ఎఫ్-35 నిదానంగా ప్రయాణించే జెట్ కాదు. ఇరాన్ గతంలో అమెరికన్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని ‘358 క్షిపణి’ని ప్రయోగించింది. యెమెన్ హౌతీలకు కూడా ఇరాన్ ఈ క్షిపణులను సరఫరా చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన గత నెల 28 నుంచి ఇప్పటివరకు అమెరికా డజనుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయింది. ‘358 క్షిపణి’లోని పరారుణ సెన్సర్... ఎఫ్-35 జెట్ వెలువరించే వేడిని గుర్తించి ఉంటుందని, తద్వారా దాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటుందని సందీప్ ఉన్నితన్ విశ్లేషించారు. 

రాడార్ కంటపడకపోయినా పరారుణ వర్ణపటం (ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్) రీత్యా ఎఫ్-35 తప్పించుకోలేదని అన్నారు. ఎఫ్-35 అనేది ఒకేఒక ఇంజిన్ ఉండే జెట్. ఎగిరేటప్పుడు అది అమిత వేడిని వెలువరిస్తుంది. రాడార్ వాడకుండానే ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ) వ్యవస్థ సాయంతో వేడిని గుర్తించి దాని ఆధారంగా విమానాన్ని ట్రాక్ చేయవచ్చని వివరించారు. గురువారం బహుశా అదే జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. 20 రోజుల పోరాటం తర్వాత తాము ఇరాన్ వైమానిక బలగాల వెన్ను విరిచినట్టు అమెరికా, ఇజ్రాయెల్ చాటుకుంటున్నాయి. ఆ ప్రాతిపదికనే అమెరికా తమ బి-1, బి-2 బాంబర్లను మోహరించింది. ‘స్టెల్త్’ సామర్థ్యం లేని ఈ బాంబర్లను శత్రు దేశపు గగనతలంపై సంపూర్ణ ఆధిక్యం లభించినట్టు తెలిశాక మాత్రమే అమెరికా సహజంగా మోహరిస్తుంది. ఎఫ్-35ను సైతం దెబ్బ కొట్టగలిగాయంటే ఇరాన్ వైమానిక బలగాలు క్రియాశీలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. 
- జమ్ముల శ్రీకాంత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement