ఇన్ బాక్స్
విమానయాన రంగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఒక దేశ గగనతలంలో ప్రయాణించే ప్రతి విమానాన్నీ సమన్వయం చేయడం వారి బాధ్యత. ఒక్క చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదిగా గుర్తించాలి. అయినా విమానయాన సంస్థలు వీరికి తగిన వేతనాలు, పని గంటల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని అనేక ఉద్యమాలు వచ్చాయి. అందులో 2026 మార్చి 7న ఇటలీ రాజధాని రోమ్‌లో 1,500 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నిర్వహించిన సమ్మె ఒకటి. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ సమ్మె ఇటలీ విమానయాన వ్యవస్థపై గణనీయమైన ప్రభావం కలిగించింది. ముఖ్యంగా రోమ్‌లోని ‘ఫ్యూమిచినో’ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ఈ సమ్మెతో స్తంభించాయి.
ఇటలీ గగనతలం యూరప్‌లో ప్రధాన మార్గాలలో ఒకటి. యూరప్ నుండి ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా వైపు వెళ్లే అనేక విమానాలు ఇటలీ గగనతలాన్ని దాటుతాయి. అందువల్ల రోమ్‌లో జరిగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమ్మె కేవలం స్థానిక సమస్యగా కాకుండా అంతర్జాతీయ విమాన రవాణాపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఉద్యోగులు తమ పని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
గత దశాబ్దంలో ప్రపంచ విమానయాన రంగం వేగంగా విస్తరించింది. అంతర్జాతీయ పర్యాటకం, వ్యాపార ప్రయాణాలు పెరగడంతో విమానాల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ పెరుగుదలతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఖ్య తగినంతగా పెరగలేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. దీంతో ఒక్కో కంట్రోలర్‌పై పని ఒత్తిడి పెరిగింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రంగంలో శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఇటలీలో కొన్ని కంట్రోల్ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల్లో కొత్త నియామకాలు లేవు. ఈ సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు అదనపు షిఫ్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!
మరోపక్క ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు తగినంతగా పెరగడం లేదు. ఈ సమ్మెను యూరప్‌లో పెరుగుతున్న కార్మిక ఉద్యమాలలో భాగంగా చూడాలి. 2025 చివరి నుండి 2026 ప్రారంభం వరకు యూరప్‌లో రైల్వేలు, విమానయాన, ప్రజా రవాణా వంటి రంగాలలో కార్మిక అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో ఇదే సమయంలో రవాణా కార్మిక సమ్మెలు జరగడం గమనార్హం. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరగడం వంటి అంశాలు ఈ ఉద్యమాలకు కారణమయ్యాయి.
– యాటల సోమన్న
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు


