అమెరికాకు పాకిస్థాన్‌ పెను సవాల్‌! | Pakistan developing nuclear missile intercontinental nuclear ballistic missiles | Sakshi
Sakshi News home page

అమెరికాకు పాకిస్థాన్‌ పెను సవాల్‌!

Mar 20 2026 1:32 PM | Updated on Mar 20 2026 1:43 PM

Pakistan developing nuclear missile intercontinental nuclear ballistic missiles

వాషింగ్టన్‌: ప్రపంచంలోని పలు దేశాలు అమెరికాకు సవాలు విసురుతున్నాయి. ఇరాన్‌ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందనే అనుమానంతో అమెరికా ఆ దేశంపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు పాకిస్థాన్‌ కూడా అదే తరహా అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ తన ఆత్మరక్షణ కోసం పెద్ద ఎత్తున క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం పలు అగ్రదేశాల నుంచి ఆర్థిక సహాయం పొందుతోందని సమాచారం. తయారీ పూర్తయిన తర్వాత ఆయా దేశాలకు క్షిపణులు, ఇతర అణ్వాయుధాలను అందజేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.

యూఎస్‌ నిఘా సంస్థల ప్రకారం, పాకిస్థాన్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న షాహిన్-3 క్షిపణి 2750 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. అయితే ఇది ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి కాదు. ఖండాంతర క్షిపణులు కనీసం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరగలగాలి. అణు నిరోధక శక్తిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు సమాచారం. అమెరికా నుంచి పాకిస్థాన్‌ దూరం సుమారు 12,000 కిలోమీటర్లు. అంతటి దూరాన్ని ఛేదించే క్షిపణులను పాకిస్థాన్‌ అభివృద్ధి చేస్తోందనే విషయం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది.

యాన్యువల్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌ - 2026 నివేదికలో అమెరికా, ప్రపంచంలోని పలు దేశాలు అణ్వాయుధాలను తయారు చేస్తున్నాయని పేర్కొంది. అందులో పాకిస్థాన్‌, రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటి దేశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌ అణ్వాయుధ కార్యక్రమం అంతకంతకూ విస్తరిస్తోందని హైలైట్‌ చేసింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement