కాంగ్రెస్ పార్టీలో సెక్యులర్ భావాలతో తిరుగులేని నాయకుడిగా ఉన్న బారిస్టర్ మహమ్మద్ అలీ జిన్నా ప్రాముఖ్యత... మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ప్రవేశంతో అనూహ్యంగా తగ్గింది. తర్వాత రాజకీయాలు వదులుకుని ఆయన లండన్‌కెళ్లి వకాలతు మొదలెట్టారు. కానీ, ముస్లిం లీగ్ నాయకులు ఆయన్ని తిరిగి ఇండియాకు రప్పించారు. యునైటెడ్ ప్రావిన్స్‌లో ముస్లిం లీగ్ – కాంగ్రెస్ కలిసి బ్రిటిష్ రాజ్‌ను ఎదుర్కోవటానికి జిన్నా చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు.
1936లో బాంబేలో జరిగిన సదస్సులో ముస్లిం లీగ్ పార్టీ పగ్గాలు జిన్నా కైవసం చేసుకున్నారు. 1937 ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించటంతో, భవిష్యత్తులో అధికారం చేజిక్కించుకోవటం దుర్లభం అని భావించిన లీగ్ ప్రాథమిక చర్యగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీల ముస్లిం నాయకులను క్రమంగా లీగ్ లోకి చేర్చుకుంది. ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కేవలం ముస్లిం లీగ్ ద్వారానే సాధ్యమని ప్రచారం చేశారు జిన్నా. అప్పటివరకూ ముస్లిం ధనిక, జమీందారులకే పరిమితమైన లీగ్‌లోకి నిమ్నవర్గం ముస్లింలను సైతం చేర్చి, ఇరవై లక్షల సభ్యులతో జాతీయ నాయకుడిగా, ముస్లింల ‘మసీహా’ అయ్యారాయన.
కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ, ముస్లిం మెంబర్‌షిప్ డ్రైవ్ ఆరంభించారు కానీ హిందువుల కోసమే కాంగ్రెస్ అనే అభిప్రాయం ప్రబలంగా ఉండటంతో అనుకూల స్పందన రాలేదు. దేశ రాజకీయంలో రిలిజి యస్ పోలరైజేషన్ మొదటి సారి అలా జరిగిందన్నమాట. ఇక లీగ్ నాయకులు, ముస్లింలకు అధికార ప్రాతినిధ్యం కోసం బ్రిటిష్ పాలకులతో చేసిన ప్రయత్నం కొలిక్కి వచ్చే తరుణంలో, దేశ విభజనకు ఊతమిస్తూ మార్చి 1940లో లాహోర్‌లో ముస్లిం లీగ్ సదస్సు నిర్వహించారు. ఇదే అదనుగా, ఇండియన్ ముస్లింలకు ‘సెపరేట్ హోమ్ ల్యాండ్’ అజెండాను నాటకీయంగా తెరపైకి తెచ్చారు జిన్నా. 1940 మార్చి 22–24 మధ్య జరిగిన సదస్సులో, భారత ఉపఖండంలో ‘ముస్లిం జోన్స్’ గుర్తించి వేర్పాటు చేసే తీర్మానాన్ని మార్చి 23 నాటి సమావేశంలో చేశారు.
ఈ లాహోర్ రిజొల్యూషన్ వార్తను మరుసటి ఉదయం వార్తా పత్రికలు ‘పాకిస్తాన్ రిజొల్యూషన్’ శీర్షికతో ప్రచురించాయి. అలా మార్చి 23 ‘పాకిస్తాన్ డే’గా రూపు దిద్దుకుంది. ఈ సదస్సుకు ప్రతీకగా తర్వాత లాహోర్‌లో ‘మినార్–ఎ–పాకిస్తాన్’ నిర్మించు కున్నారు. 1947లో దేశ విభజన జరిగి పాక్ ఏర్పడ్డాక, ఇండియన్ ముస్లింలకు ప్రత్యేక హోమ్ ల్యాండ్ అని ప్రగల్భాలు పలికిన ముస్లిం లీగ్... రెండు నెలలకే అదే ఇండియన్ ముస్లింలను నిషేధిస్తూ సరిహద్దులు మూసి వేయడం గమ నార్హం. (జస్వంత్ సింగ్ ‘జిన్నా: ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్ ’ ఆధారంగా)
– జిల్లా గోవర్ధన్ ‘ విశ్రాంత పీఎఫ్ కమిషనర్, ముంబై


