రైతు బతుకులో ‘సోలార్‌’ చీకట్లు | TDP Leaders violated farmers lands and rights | Sakshi
Sakshi News home page

రైతు బతుకులో ‘సోలార్‌’ చీకట్లు

Aug 9 2026 5:15 AM | Updated on Aug 9 2026 5:17 AM

TDP Leaders violated farmers lands and rights

శ్రీసత్యసాయి జిల్లా జౌకుల గ్రామంలో రైతులు సాగు చేస్తున్న భూములు

మొత్తం మీద 16,000 ఎకరాలపై ‘పచ్చ’ కన్ను

ముఖ్యనేత కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం 

ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై రైతుల హక్కులకు ఎసరు

పరిహారం లేకుండానే పనులకు ప్రయత్నం 

ముఖ్యనేత డైరెక్షన్‌లో భూములు ఇవ్వాల్సిందేనంటూ రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి 

‘ధర్నాలు చేసినా.. ప్రాణాలు పోయినా పనులు ఆగవు’ అంటూ వ్యాఖ్యలు 

కంపెనీతో కందికుంట రూ.25 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నారంటూ ఆరోపణలు 

తరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అన్యాయమని రైతుల ఆవేదన 

తామెలా బతకాలంటూ కన్నీళ్లు.. రోడ్డున పడేయొద్దంటూ వేడుకోలు 

శ్రీసత్యసాయి జిల్లా జౌకుల రైతుల కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు

మూడు తరాల నుంచి ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ఈ భూమిపై ఇప్పటికే రూ.7 లక్షల పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడేమో సోలార్‌ వాళ్లు నయా పైసా ఇవ్వకుండా భూములు కాజేయాలని చూస్తున్నారు. మాకు మా భూమి కావాలి. సోలార్‌ వద్దే వద్దు. ఉన్న భూమి పోతే మేమెలా బతకాలి? ఊరొదిలి వెళ్లిపోవాలా? 
– వేడిగింజల అనసూయమ్మ

సాక్షి, పుట్టపర్తి: రైతుల పొలాల్లో వెలుగులు నింపాల్సిన సోలార్‌ ప్రాజెక్టు.. అదే అన్నదాతల బతుకుల్లో చీకట్లు నింపుతోంది. పచ్చని పంట పొలాలపై సోలార్‌ పలకలు పరచేందుకు.. ఏళ్ల తరబడి ఆ భూములనే నమ్ముకుని జీవిస్తున్న రైతులను పక్కకు నెట్టేస్తున్నారు.  మొత్తం మీద 16,000  ఎకరాలపై కన్నేయగా ముందుగా 600 ఎకరాలను  ప్రైవేటు కంపెనీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది.  రైతుల ప్రయోజనాల కంటే కంపెనీ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని జౌకుల గ్రామంలో పరిస్థితి ఇది. 16వేల ఎకరాలలో ఈ సోలార్‌ ప్రాజెక్టు వస్తోందని చెబుతున్నారు. అందులోభాగంగా తొలిదశలో జౌకుల గ్రామంలో పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి ఆ భూముల్లో సాగుచేసుకుంటున్న రైతులకు పైసా పరిహారమివ్వకుండా భూముల నుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారు. అదేమంటే అధికారమదంతో బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దల దన్నుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ ఓ ప్రైవేటు కంపెనీతో  రూ.25 కోట్లకు అగ్రిమెంట్‌ చేసుకుని అడ్వాన్సుకూడా తీసేసుకున్నారని వినిపిస్తోంది. కదిరి ఆర్డీఓ, పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్‌ చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు. సోలార్‌ ప్లాంటు వల్ల రైతులకు ఎదురవుతున్న కష్టనష్టాల గురించి తెలుసుకునేందుకు నంబులపూలకుంట మండలంలోని జౌకుల గ్రామాన్ని ‘సాక్షి’ బృందం విజిట్‌ చేయగా.. పలు విషయాలు వెల్లడయ్యాయి.

ముందుగా 600 ఎకరాలపై..
జౌకుల గ్రామ పరిసరాల్లోని భూములపై ఇప్పుడు సోలార్‌ ప్రాజెక్టు నీడ పడింది. ఈ ప్రాంతంలో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఓ ప్రైవేటు కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సర్వే నంబరు 179 పరిధిలోని సుమారు 600 ఎకరాల్లో తొలి దశ పనులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ భూములను తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు.  పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఒక్కసారిగా భూముల నుంచి దూరం చేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. భూమిని సాగు చేసింది రైతు.. దానిపైనే కుటుంబాన్ని పోషించుకున్నది రైతు.. చివరకు భూమి పోతున్నప్పుడు పరిహారం మాత్రం శూన్యమా? అని నిలదీస్తున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా జౌకులలో జేసీబీ యంత్రాలతో చేస్తున్న పనులు 

ప్రభుత్వ పెద్దల దన్నుతో..
ప్రభుత్వ పెద్దల దన్నుతో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ విపరీతంగా వ్యవహరిస్తున్నారని, తనను ఎవరూ అడ్డుకోలేరనే రీతిలో చెలరేగిపోతున్నారని రైతులు చెబుతున్నారు. తాము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నప్పటికీ ‘ప్రాజెక్టు ఆగదు.. భూములు ఇవ్వాల్సిందే’ అన్న తరహాలో ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జౌకులలో ఎకరా రూ.6లక్షల వరకు పలుకుతోంది. 600 ఎకరాలు రూ. 36 కోట్లు. కానీ  రైతుల నుంచి భూములు ఇప్పించే విషయంలో సోలార్‌ కంపెనీకి హామీ ఇచ్చి రూ.25 కోట్ల మేర ఎమ్మెల్యే ఒప్పందం కుదుర్చుకున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోటి వరకు అడ్వాన్స్‌గా ముట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ‘రైతులు ధర్నాలు చేసినా.. ఆందోళనలు చేపట్టినా.. ప్రాణాలు అర్పించినా.. ఉరి వేసుకుని చచ్చిపోయినా అనుకున్న మేరకు కార్యక్రమాలు కొనసాగుతాయి’ అని ఇటీవల నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు రైతులు చెబుతున్నారు. తమ సమస్యలు వినాల్సిన ప్రజాప్రతినిధి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకంటే సోలార్‌ ప్రాజెక్టే ముఖ్యమా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.20 లక్షల పెట్టుబడి అయింది 
సోలార్‌ పేరుతో బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. పనులు చేసేందుకు యంత్రాలు వస్తున్నాయి. మొత్తం 10 ఎకరాలలో బోరు బావులు తవ్వించి, డ్రిప్‌ ఏర్పాటు చేసుకుని మామిడి చెట్లు నాటి పదేళ్లయింది. దాదాపు రూ.20 లక్షల పెట్టుబడి అయింది.. సోలార్‌ వద్దు.. మా భూమి మాకు కావాలి. పంటలు సాగు చేసుకుని బతుక్కుంటాం.       
– రమణ

స్క్రూటినీ అయ్యింది.. బుక్‌ ఇవ్వలేదు 
మాకు 3.5 ఎకరాల భూమి ఉంది. అందులో 2.5 ఎకరాలకు స్క్రూటినీ కూడా పూర్తయింది. ఈ భూమి లాగేసుకుంటే ఊరొదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి. మండల స్థాయి నుంచి కలెక్టరేట్‌ కార్యాలయం వరకు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పోయింది. సోలార్‌ వద్దు. భూమిలో పంట వేసుకుంటాం.                               
 – బాబా ఫకృద్దీన్‌

గొర్రెలు ఎలా మేపుకోవాలి? 
సోలార్‌ పలకలు ఏర్పాటు చేస్తే గొర్రెలు ఎలా మేపాలి? ఊర్లో చాలా గుంపుల గొర్రెలు ఉన్నాయి. అందరికీ నష్టమే. నా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. నాకు 9 ఎకరాల భూమి ఉంది. అది కూడా సోలార్‌కు లాగేయాలని చూస్తున్నారు. సోలార్‌ వస్తే బయట ప్రాంతాలకు వెళ్లేందుకు దారి కూడా ఉండదు.                           
 – మస్తాన్‌ వలి

30 ఏళ్లుగా సాగులో ఉన్నాం 
మేం 30 ఏళ్ల నుంచి సాగులో ఉన్నాం. ఇప్పటి వరకు పది బోర్లు వేయించగా, మూడు చోట్ల నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.5 లక్షల పెట్టుబడి అయ్యింది. బలవంతపు భూమి లాక్కోవాలనుకుంటే ఊరుకునేది లేదు. డబ్బులన్నీ భూమిపై పెట్టాం. భూమి పోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి.     
– ఆర్‌.నగేశ్‌

ఆత్మహత్యలే గతి 
మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. నిమ్మ సాగు చేస్తున్నాం. ఈ భూమి కూడా లాగేసుకుంటే ఆత్మహత్యలే గతి. రైతులకు పరిహారం చెల్లించకుండా సోలార్‌కు భూములు లాక్కోవాలని చూస్తే ఊరంతా ఖాళీ అవుతుంది.    
 – ఖాదర్‌ వలి

జీవాలకు గ్రాసమూ ఇబ్బందే.. 
మా గ్రామానికి ఈ భూములే జీవనాధారం. కొందరు పంటలు వేసుకుంటారు. ఇంకొందరు పశువులు, గొర్రెలు మేపుతుంటారు. సోలార్‌ ఏర్పాటు చేస్తే చిన్న జీవాలకు గ్రాసం ఇబ్బంది అవుతుంది. వేరే ఆధారం లేదు. ఊరొదిలి వలస వెళ్లాల్సిందే. సోలార్‌ను మా ఊరికి రానివ్వం.    
– వల్లెపు భారతి

మా భూమి ఇచ్చేది లేదు..
మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. శెనక్కా­య, వంకాయ, టమాట పంటలు వేస్తుంటాం. అప్పు చేసి బోరు బావి తవ్వించా. నీళ్లు పడ్డాయి. సోలార్‌కు ఇచ్చే పరిస్థితి లేదు.  
    – వేమల రామచంద్ర  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement