దోపిడీకి నిలువుటద్దం! | Rs 2455 Crore Bill for Glass Facades on Five Buildings in Amaravati | Sakshi
Sakshi News home page

దోపిడీకి నిలువుటద్దం!

Aug 9 2026 5:15 AM | Updated on Aug 9 2026 5:15 AM

Rs 2455 Crore Bill for Glass Facades on Five Buildings in Amaravati

అమరావతిలో కేవలం 5 బిల్డింగ్‌లకు అద్దాల ఏర్పాటుకు రూ.2,455.22 కోట్లు

5 టవర్లకు 2,35,092.75 మీటర్ల మేర అద్దాలు బిగించే పనుల వ్యయం తొలుత రూ.1,901.71 కోట్లే

కానీ రూ.2,455.22 కోట్లకు పెంచి టెండర్లు పిలిచిన ఏజీఐసీఎల్‌ 

అంటే.. అంచనా వ్యయంలోనే  రూ.553.51 కోట్లు కొట్టేసే స్కెచ్‌.. మొత్తం మీద ఎంత నొక్కేస్తారోనని సర్వత్రా చర్చ

జీఏడీ టవర్‌కు రూ.442.06 కోట్లు.. 1, 2 టవర్లకు రూ.909.88 కోట్లు.. 3, 4 టవర్లకు రూ.725.45 కోట్ల అంచనాతో వేర్వేరుగా టెండర్లు 

అంచనా వ్యయం లెక్కకు స్టాండర్ట్‌ షెడ్యూల్డ్‌ రేట్లు మదింపు చేయని సర్కార్‌ 

ఆ పనులకు మూడు సంస్థల నుంచి కొటేషన్‌లు తీసుకున్న సీఆర్‌డీఏ 

ముంబైకి చెందిన ఆల్మెక్‌ ఫెసాడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొటేషన్‌ ఆధారంగా ఎస్‌ఎస్‌ఆర్‌ రూపకల్పనకు బీవోసీఈకి ప్రతిపాదన 

చైనాలో షెన్‌జెన్‌లో మర్చంట్స్‌ బ్యాంక్‌ హెడ్‌ క్వార్టర్స్‌ భవనాల డిజైనర్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్సే

ఈ రెండు సంస్థల పని ఆధారంగా అద్దాల పనులకు ఎస్‌ఎస్‌ఆర్‌ బీవోసీఈ తయారీ 

జీఎస్టీతో కలిపి చదరపు మీటరుకు రూ.80,892 ఖరారు 

అయితే దీనికి అదనంగా పెంచి టెండర్లు

టెండర్లలో జాయింట్‌ వెంచర్లు పాల్గొనేందుకు అర్హత లేదంటూ నిబంధన 

అధిక మొత్తంలో కమీషన్‌ ఇచ్చే సంస్థకు పనులు అప్పగించేందుకే ఈ నిబంధన  

భారీగా కమీషన్‌ లక్ష్యంగా ముఖ్యనేత ఎత్తుగడ

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఏకంగా రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం విస్తుగొలుపుతోంది. కేవలం ఐదు బిల్డింగ్‌ల అద్దాల కోసం ఇంత భారీగా ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పెద్దలు దండుకునేందుకేనని స్పష్టమవుతోంది. తొలుత అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లు కాగా, దానిని ఏకంగా రూ.2,455.22 కోట్లకు పెంచడం వెనుక ముఖ్య నేత కమీషన్ల బాగోతమేనని ఇంజనీరింగ్‌ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంచనా వ్యయంలోనే రూ.553.51 కోట్లు కొట్టేసే స్కెచ్‌ కనిపిస్తుండగా, మొత్తం వ్యయంలో నుంచి ఇంకెంత నొక్కేస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు అందించిన సమాచారం ఆధారంగా జీఎస్టీ వంటి అన్ని పన్నులతో కలిపి అద్దాలు అమర్చే పనులకు చదరపు మీటరుకు రూ.80,892గా ధరను బీవోసీఈ (బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌) ఖరారు చేసింది. ఐదు టవర్లకు 2,35,092.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్దాలు బిగించాలి.

ఈ లెక్కన వాటి అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లే. కానీ.. ఆ పనులకు రూ.2,455.22 కోట్ల వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి, పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి ముఖ్య నేత ఎత్తు వేశారని ఇంజినీరింగ్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు. 

 

15 నెలల్లో పూర్తి చేయాలని షరతు 
అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయా గ్రిడ్‌ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్‌ క్లాడింగ్, స్కైలైట్‌), ఫొటో వోల్టాయిక్‌ సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు, బి­ల్డింగ్‌ మెయింటెనెన్స్‌ యూనిట్‌ (బీఎంయూ)లు ఏర్పా­టు చేసే పనులకు ఏజీఐసీఎల్‌ ద్వారా మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచింది.

ఈ పనులకు జీఏడీ టవర్‌కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్‌).. 1, 2 టవర్లకు రూ.1073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్‌).. 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచనా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్‌) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్‌ల దాఖలుకు ఈనెల 26 తుది గడువు. అదే రోజున సాంకేతిక బిడ్, ఆ తర్వాత ఆరి్థక బిడ్‌ను తెరిచి.. తక్కువ ధరకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనుంది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 15 నెలల్లో వాటిని పూర్తి చేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్‌ షరతు విధించింది.   

ఎస్‌ఎస్‌ఆర్‌ బుట్టదాఖలు  
ళీ శాశ్వత సచివాలయం ఐదు టవర్లను డయాగ్రిడ్‌ వి«ధానంలో నిర్మిస్తున్నారు. ఈ టవర్లకు నలువైపులా అద్దాలు అమర్చుతారు. అందులో భాగంగా టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్‌ (అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్‌–గ్లేజ్డ్‌ అద్దాలను అమర్చడం).. క్రౌన్, అట్రియం (భవ నాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్‌–రూఫ్‌ సెంట్రల్‌ అట్రియమ్‌)..కానోపి, స్కైలైట్‌ (ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్‌–రాడ్‌ స్టీల్‌ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కై లైట్లు).. పీవీ ప్యానెల్స్‌ (భవనం వెలుపల సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పర్యావరణ అ­ను­కూల ఐజీబీసీ ప్లాటినమ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్‌యూ (ఎత్తైన టవర్ల గ్లాస్‌ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్‌–మౌంటెడ్‌ టెలిస్కోపిక్‌ క్రేన్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు) పనులు చేయాలి.  

ఈ పనులకు అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటిదాకా ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్లు)ను ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పనులకు ఎస్‌ఎస్‌ఆర్‌ను ఖరారు చేయడంలో భాగంగా సీఆర్‌డీఏ.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న సంస్థల నుంచి కొటేషన్లు ఆహా్వనించింది. ముంబైకి చెందిన ఆల్మెక్‌ ఫెసాడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన టీమ్‌ వర్క్‌ గ్లా్లస్‌ అండ్‌ అల్యూమినియమ్, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు సీఆర్‌డీఏకు కొటేషన్‌లు ఇచ్చాయి.  

అందులో ఆల్మెక్‌ ఫెసాడ్‌ సంస్థ తక్కువ ధరకు కోట్‌ చేసినట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్‌లు రూపొందించిన ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థే.. చైనాలో షెన్‌జెన్‌లోని మర్చంట్స్‌ బ్యాంక్‌ హెడ్‌ క్వార్టర్స్‌ భవనాలను డిజైన్‌ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్‌ ఫెసాడ్‌ కొటేషన్‌లో పేర్కొన్న ధరను పరిగణలోకి తీసుకుని.. గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ వంటి పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది.  

⇒  ఐదు టవర్లలోనూ అన్ని రకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కకట్టింది. పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్ల వ్యయంతో ఏజీఐసీఎల్‌ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చ.మీ. ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది.  
చదరపు అడుగు రూ.20,439.58 

⇒  టవర్ల డిజైన్‌ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్‌ పార్టనర్స్‌–హాఫీజ్‌ కాంట్రాక్టర్, జెనిసిస్‌ ప్లానర్స్‌కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఇక అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల పనులను రూ.1,057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన నిర్మాణ వ్యయం ఇప్పటికే చ.అ. రూ. 20,439.58కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. 

⇒  బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలు, ఇటాలియన్‌ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదంటున్నారు. డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ వ్యయం తగ్గుతుందని చెబుతున్నారు. అయినా శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

జాయింట్‌ వెంచర్లకు నో.. సబ్‌ కాంట్రాక్టుకు 50 శాతం ఇచ్చుకోవచ్చట!
⇒  సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో బిడ్‌లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్‌ పెట్టిన నిబంధనలు చూసి ఇంజినీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్‌ వెంచర్లు బిడ్‌లు దాఖలుకు అర్హతలేదని నిబంధన పెట్టింది. 
⇒  కానీ.. టెండర్‌లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ అనుమతితో 50 శాతం పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనల వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక. ఎవరు ఎక్కువ కమీషన్‌ ఇస్తే, వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి నిబంధనలు పెట్టారంటూ నిపుణులు ఆరోపిస్తున్నారు.  

⇒  జాయింట్‌ వెంచర్‌లకు టెండర్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే.. ఆ పనులు చేసే అనుభ­వం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి జట్టు­గా ఏర్పడి బిడ్‌లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అధిక సంస్థలు పోటీపడితే.. అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్‌ చేస్తూ బిడ్‌లు దాఖలవుతాయి. అదే జరిగితే తమకు అధికంగా కమీషన్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement