breaking news
Engineering experts
-
కమీషన్ల ‘టవర్’!
సాక్షి, అమరావతి: అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు ఎంఈపీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్), హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఫైర్ అలారమ్ తదితరాల పనులకు ఏకంగా రూ.2,183.84 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవడంపై ఇంజినీరింగ్ నిపుణులు నివ్వెరపోతున్నారు. కేవలం ఐదు టవర్లలో అంతర్గత పనులకే ఈ స్థాయిలో వ్యయం చేస్తుండటంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు టవర్లను బీ+జీ+39.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తు 47 మీటర్ల వెడల్పు, 47 మీ. పొడవుతో 2,209 చ.మీ. నిర్మిత ప్రాంతంతో నిర్మిస్తున్నారు. మొత్తం ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4.85 లక్షల చదరపు మీటర్లు.. అంటే 52,20,496 చ.అడుగులు. అంటే.. ఎంఈపీ, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు లాంటి పనులకే చదరపు అడుగుకు రూ.4,183.20 చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పనులకు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి టెండర్లు పిలిచారని.. ఎక్కువ కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు అప్పగించి.. భారీ ఎత్తున దోచుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో జాయింట్ వెంచర్లలు పాల్గొనటానికి అర్హత లేదని ఏజీఐసీఎల్ పెట్టిన నిబంధన టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఆ పనుల విలువలో 50 శాతం వరకు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు వెసులుబాటు కల్పిస్తూ పెట్టిన నిబంధన మూడు ప్యాకేజీలుగా..రాజధాని ప్రాంతంలో నేలపాడు వద్ద శాశ్వత సచివాలయాన్ని 900 మీ. పొడవు, 139 మీ. వెడల్పుతో 32 ఎకరాల విస్తీర్ణంలో పాలవాగుకు ఉత్తరాన 2 టవర్లు, దక్షిణాన మూడు టవర్లుతో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఐదు టవర్లకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్‌వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్ పనులు చేపట్టేందుకు మూడు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) టెండర్లు పిలిచింది. 1, 2 టవర్లకు రూ.737.76 కోట్లు (రూ.134.68 కోట్లు అదనంగా సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రీయింబర్స్).. 2, 3 టవర్లకు రూ.679.19 కోట్లు (రూ.123.92 కోట్లు పన్నుల రూపంలో అదనంగా రీయింబర్స్).. జీఏడీ టవర్‌కు రూ.429.83 కోట్లు (రూ.78.46 కోట్లు పన్నుల రూపంలో అదనంగా రీయింబర్స్) అంచనా వ్యయంతో 18 నెలల్లో పనులు పూర్తి చేసి.. మరో రెండేళ్లపాటు నిర్వహించాలనే షరతుతో టెండర్లు పిలిచింది. ఈ బిడ్ల దాఖలు తుది గడువు సెప్టెంబరు 9. అదే రోజు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. ఫైనాన్స్ బిడ్‌ను 16న తెరిచి... సెప్టెంబరు 25లోగా టెండర్ ఖరారు చేసి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించేలా షెడ్యూలు ప్రకటించారు.ఐకానిక్ ‘దోపిడీ’..బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో కట్టినా.. నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని స్పష్టం చేస్తున్నారు. కానీ, శాశ్వత సచివాలయం టవర్లకు హై సైడ్ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లంబింగ్ పనులకే చదరపు అడుగుకు రూ.4,183.20 చొప్పున వ్యయం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అంచనా వ్యయం భారీగా పెంచేస్తుండటంపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అవి సాధారణ భవనాలు కాదు.. ఐకానిక్ టవర్లు అంటూ చంద్రబాబు సర్కార్ సమర్థించుకోవడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమేనని ఇంజినీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, హంగులతో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో హై సైడ్ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లంబింగ్ పనులకు చదరపు అడుగుకు రూ.2,000 నుంచి రూ.2,500లకు మించి వ్యయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన చదరపు అడుగుకు సగటున రూ.1,500 చొప్పున అంచనా వ్యయాన్ని పెంచేశారని.. రూ.783 కోట్ల మేర దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనాలో షెన్జెన్లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసాడ్ కొటేషన్లో పేర్కొన్న ధరను పరిగణనలోకి తీసుకుని.. గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ లాంటి పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892లుగా బీవోసీఈ ఖరారు చేసింది. ఐదు టవర్లలోనూ అన్ని రకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కకట్టింది. ఈ లెక్కన ఆ పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్ల వ్యయంతో ఏజీఐసీఎల్ ఇటీవల టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చదరపు మీటరు ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్) ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో రూ.553.51 కోట్ల దోపిడీకి ముఖ్యనేత స్కెచ్ వేశారని నిపుణులు పేర్కొంటున్నారు.జాయింట్ వెంచర్లకు అర్హత లేదట.. 50 శాతం సబ్ కాంట్రాక్టుకు ఇచ్చుకోవచ్చట..సచివాలయం టవర్లకు ఎంఈపీ, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ఫైర్ అలారమ్–ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల పనుల టెండర్ల బిడ్లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్ పెట్టిన నిబంధనలు చూసి ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లు (ఒకటి కంటే ఎక్కువ సంస్థలు కలిపి జట్టుగా ఏర్పడటం) బిడ్లు దాఖలు చేయడానికి అర్హత లేదని నిబంధన పెట్టింది. కానీ.. టెండర్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజనీర్ అనుమతితో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనలను విధించడం వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక. సీఆర్డీఏ కొటేషన్లు ఆహ్వానించిన సంస్థల్లో ఎవరు ఎక్కువ కమీషన్ ఇస్తే వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి విచిత్రమైన నిబంధనలు పెట్టారంటూ ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. జాయింట్ వెంచర్లకు టెండర్లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అధిక సంస్థలు పోటీ పడితే.. అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్ చేస్తూ బిడ్లు దాఖలు అవుతాయి. అదే జరిగితే తమకు అధికంగా కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచి్చన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.చ.అడుగు వ్యయం రూ.4,350.42తో మొదలై.. ఏకంగా రూ.20,439.58..» శాశ్వత సచివాలయం ఐదు టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ నాడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. » ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. » ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్‌వీఏసీ (వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. » టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్‌కు అప్పగించారు. » అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. » ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. » మొత్తమ్మీద సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. అంటే.. నిర్మాణ వ్యయం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. » రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దుబారా చేస్తూ.. దోపిడీ చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారంటూ ఇంజినీర్లు, ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. -
దోపిడీకి నిలువుటద్దం!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఏకంగా రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం విస్తుగొలుపుతోంది. కేవలం ఐదు బిల్డింగ్‌ల అద్దాల కోసం ఇంత భారీగా ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పెద్దలు దండుకునేందుకేనని స్పష్టమవుతోంది. తొలుత అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లు కాగా, దానిని ఏకంగా రూ.2,455.22 కోట్లకు పెంచడం వెనుక ముఖ్య నేత కమీషన్ల బాగోతమేనని ఇంజనీరింగ్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంచనా వ్యయంలోనే రూ.553.51 కోట్లు కొట్టేసే స్కెచ్ కనిపిస్తుండగా, మొత్తం వ్యయంలో నుంచి ఇంకెంత నొక్కేస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు అందించిన సమాచారం ఆధారంగా జీఎస్టీ వంటి అన్ని పన్నులతో కలిపి అద్దాలు అమర్చే పనులకు చదరపు మీటరుకు రూ.80,892గా ధరను బీవోసీఈ (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్) ఖరారు చేసింది. ఐదు టవర్లకు 2,35,092.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్దాలు బిగించాలి.ఈ లెక్కన వాటి అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లే. కానీ.. ఆ పనులకు రూ.2,455.22 కోట్ల వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి, పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి ముఖ్య నేత ఎత్తు వేశారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 15 నెలల్లో పూర్తి చేయాలని షరతు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయా గ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులకు ఏజీఐసీఎల్ ద్వారా మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచింది.ఈ పనులకు జీఏడీ టవర్‌కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 1, 2 టవర్లకు రూ.1073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచనా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు ఈనెల 26 తుది గడువు. అదే రోజున సాంకేతిక బిడ్, ఆ తర్వాత ఆరి్థక బిడ్‌ను తెరిచి.. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనుంది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 15 నెలల్లో వాటిని పూర్తి చేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్ షరతు విధించింది. ఎస్ఎస్ఆర్ బుట్టదాఖలు ళీ శాశ్వత సచివాలయం ఐదు టవర్లను డయాగ్రిడ్ వి«ధానంలో నిర్మిస్తున్నారు. ఈ టవర్లకు నలువైపులా అద్దాలు అమర్చుతారు. అందులో భాగంగా టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్ (అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్–గ్లేజ్డ్ అద్దాలను అమర్చడం).. క్రౌన్, అట్రియం (భవ నాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్–రూఫ్ సెంట్రల్ అట్రియమ్)..కానోపి, స్కైలైట్ (ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్–రాడ్ స్టీల్ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కై లైట్లు).. పీవీ ప్యానెల్స్ (భవనం వెలుపల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్యూ (ఎత్తైన టవర్ల గ్లాస్‌ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్–మౌంటెడ్ టెలిస్కోపిక్ క్రేన్ సిస్టమ్స్ ఏర్పాటు) పనులు చేయాలి. ⇒ ఈ పనులకు అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటిదాకా ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు)ను ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పనులకు ఎస్‌ఎస్‌ఆర్‌ను ఖరారు చేయడంలో భాగంగా సీఆర్డీఏ.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న సంస్థల నుంచి కొటేషన్లు ఆహా్వనించింది. ముంబైకి చెందిన ఆల్మెక్ ఫెసాడ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన టీమ్ వర్క్ గ్లా్లస్ అండ్ అల్యూమినియమ్, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సీఆర్డీఏకు కొటేషన్లు ఇచ్చాయి. ⇒ అందులో ఆల్మెక్ ఫెసాడ్ సంస్థ తక్కువ ధరకు కోట్ చేసినట్లు సీఆర్డీఏ పేర్కొంది. శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనాలో షెన్జెన్లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసాడ్ కొటేషన్లో పేర్కొన్న ధరను పరిగణలోకి తీసుకుని.. గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ వంటి పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది. ⇒ ఐదు టవర్లలోనూ అన్ని రకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కకట్టింది. పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్ల వ్యయంతో ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చ.మీ. ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. చదరపు అడుగు రూ.20,439.58 ⇒ టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్‌కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల పనులను రూ.1,057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన నిర్మాణ వ్యయం ఇప్పటికే చ.అ. రూ. 20,439.58కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదంటున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ వ్యయం తగ్గుతుందని చెబుతున్నారు. అయినా శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లకు నో.. సబ్ కాంట్రాక్టుకు 50 శాతం ఇచ్చుకోవచ్చట!⇒ సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో బిడ్లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్ పెట్టిన నిబంధనలు చూసి ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లు బిడ్లు దాఖలుకు అర్హతలేదని నిబంధన పెట్టింది. ⇒ కానీ.. టెండర్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజినీర్ అనుమతితో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనల వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక. ఎవరు ఎక్కువ కమీషన్ ఇస్తే, వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి నిబంధనలు పెట్టారంటూ నిపుణులు ఆరోపిస్తున్నారు. ⇒ జాయింట్ వెంచర్లకు టెండర్లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అధిక సంస్థలు పోటీపడితే.. అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్ చేస్తూ బిడ్లు దాఖలవుతాయి. అదే జరిగితే తమకు అధికంగా కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారంటున్నారు. -
నిపుణుల కమిటీతో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో గత ఐదేళ్లలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సమావేశమయ్యారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ), రహదారులు, భవనాల శాఖ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణ కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్ 14న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ జరిపి, 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి నిర్దేశించారు. జలవనరుల శాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్(సీటీఈ) కన్వీనర్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో రిటైర్డు సీఈ అబ్దుల్ బషీర్, రిటైర్డు ఈఎన్సీ ఎల్.నారాయణరెడ్డి, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు పి.సూర్యప్రకాశ్, రిటైర్డు ఈఎన్సీ సుబ్బరాయశర్మ(రహదారులు, భవనాల శాఖ), రిటైర్డు ఈఎన్సీ ఎఫ్‌సీఎస్ పీటర్(రహదారులు, భవనాలశాఖ), ఏపీ జెన్కో రిటైర్డ్ డైరెక్టర్ ఆదిశేషు, సీడీవో రిటైర్డు సీఈ ఐఎస్ఎన్ రాజును సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. విచారణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో అదే రోజున సమావేశమైంది. నిర్దేశిత గడువులోగా విచారణను పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీ మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించి అంచనాలపై అధ్యయం చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్టు నిపుణుల కమిటీ సభ్యుడు సూర్యప్రకాశ్ సమావేశం అనంతరం తెలిపారు. 15 రోజుల్లో మళ్లీ కమిటీతో సీఎం జగన్ సమావేశం కానున్నారని చెప్పారు. వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ పనుల లోపాలను పరిశీలించనున్నట్టు వెల్లడించారు. -
డ్రాగన్... మనకూ మచ్చిక అవుతుంది
తెలుగునాట పుట్టి పెరిగి.. విదేశీల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న ఇంజినీరింగ్ నిపుణులు రెండు చేతులా సంపాదిస్తుంటారు. ఎంత సంపాదిస్తున్నా కొందరి మదిలో ఏదో తెలియని వెలితి..! స్వదేశానికి తిరిగొచ్చేసి నేలతల్లిని ముద్దాడుతున్న వారు ఇటీవల అక్కడక్కడా తారసపడుతున్నారు. వీళ్లు నవతరం వ్యవసాయదారులు. కొత్త ఆలోచనలతో సగర్వంగా వ్యవసాయ వృత్తిని చేపడుతున్నారు. ఈ క్రమంలో సేంద్రియ పద్ధతుల్లో కొత్త పంటల సాగుతోపాటు ఆధునిక మార్కెటింగ్ వ్యూహాలతో అధిక నికరాదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ కోవకే చెందిన యువ సాఫ్ట్వేర్ రైతు తాళ్లూరి విజయ్ శ్రీరాం. డ్రాగన్ ఫ్రూట్, లిచీ, ఆపిల్ బెర్ వంటి కొత్త పంటలను గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించని విశాఖ జిల్లా లంబసింగిలో సాగు చేసి చక్కని దిగుబడి పొందుతున్నారు. అయితే, అధిక ఉష్ణోగ్రతలుండే మైదాన ప్రాంతాల్లోనూ డ్రాగన్ ఫ్రూట్‌ను ఒకటి, రెండు చోట్ల ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. దిగుబడి ఎలా ఉండేదీ వచ్చే ఏడాది నాటికి తెలుస్తుంది. అయితే, కొత్త పంట ఏదైనా సరే.. ముందు కొన్ని మొక్కలను తమ పొలంలో పెంచి చూసి.. దిగుబడి, మార్కెట్ బాగుంటేనే ముందుకెళ్లడం మేలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాళ్లూరి విజయ్ శ్రీరాం గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టారు. మద్రాస్‌లో బీటెక్, జర్మనీలో ఎమ్మెస్ చేసి.. జర్మనీ, ఇంగ్లండ్, సింగపూర్ తదితర దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. తండ్రి చనిపోవడంతో స్వదేశానికి తిరిగొచ్చి సాఫ్ట్వేర్ రంగాన్ని పూర్తిగా వదిలిపెట్టకుండానే.. కొంత సమయాన్ని వ్యవసాయానికి కేటాయిస్తున్నారు. విశాఖ జిల్లా చల్లని కొండ ప్రదేశం లంబసింగిలో కొంత భూమిని కౌలుకు తీసుకున్నారు. సాధారణ పంటలు, తోటలకు బదులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉన్న విదేశీ జాతులైన డ్రాగన్ ఫ్రూట్, లిచీ, ఆపిల్ బెర్ తదితర కొత్త పంటలను పండించడం ప్రారంభించారు. చింతపల్లిలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. చంద్రశేఖరరావు తోడ్పాటుతో బాలారిష్టాలను అధిగమించి ముందడుగు వేస్తున్నారు. రెండేళ్ల క్రితం రెండెకరాల్లో ప్రయోగాత్మకంగా నాటిన డ్రాగన్ ఫ్రూట్ పంట ఇటీవల సంతృప్తికరమైన దిగుబడినిస్తున్నదని శ్రీరాం ‘సాక్షి’కి తెలిపారు. ఈ పూర్వరంగంలో డా. చంద్రశేఖరరావు కథనం ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ సాగు విశేషాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం... ‘‘డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాక్టస్ కుటుంబానికి చెందినదే. దీని శాస్త్రీయ నామం ఏడౌఛ్ఛిట్ఛఠట ఠఛ్చ్టీఠట. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న ఎర్రనేలలు, ఇసుక నేలలు అనుకూలం. ఇసుక, నల్లరేగడి కలిసిన ఇసుక నేలలైనా అనుకూలమే. గాలిలో తేమ తక్కువగా ఉండే ప్రాంతాలు, ఎండ ఎక్కువ గంటలుండే ప్రాంతాలు దీని సాగుకు ఉత్తమం. గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు అనుకూలం కాదు. ఉష్ణోగ్రతలు 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో చల్లగా ఉండే ప్రాంతాల్లో నాణ్యమైన డ్రాగన్ ఫ్రూట్స్ పండించవచ్చని అనుభవాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి తగుమాత్రంగా నీరు అవసరం. అయితే, నీరు నిలబడే నేలలు దీని సాగుకు అనుకూలం కాదు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క సేంద్రియ వ్యవసాయానికి బాగా అనువైనది. కంపోస్టు, వేప చెక్క అడపా దడపా వేస్తూ ఉంటే బాగా పెరుగుతుంది. జీవామృతం, పంచగవ్య అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. పొడి వాతావరణం దీనికి నప్పుతుంది. తేమ అధికంగా ఉన్న వాతావరణంలో పండే డ్రాగన్ ఫ్రూట్‌కు పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్లో 3 రకాలున్నాయి. 1. పండు, గుజ్జు కూడా ఎరుపుగా ఉండే రకం. 2. పండు పసుపు పచ్చగా.. గుజ్జు తెల్లగా ఉండే రకం. ఇది ఎగుమతి అనుకూలమైనది. 3. పండు ఎర్రగా.. గుజ్జు తెల్లగా ఉండే రకం. ఇది చాలా తియ్యగా ఉంటుంది. అనుకూల వాతావరణంలో పండు 420 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్క తీగలాగా పది, పన్నెండు అడుగుల పొడవు పెరుగుతుంది. 6-7 అడుగుల ఎత్తయిన రాతి స్తంభం లేదా కాంక్రీట్ పోల్‌ను పాతి.. దానికి నాలుగు వైపులా మొక్కలు నాటుకోవాలి. ఎకరానికి 500 స్తంభాలను 9ఁ9 అడుగుల దూరంలో పాతాలి. నాలుగు వైపులా నాలుగు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటాలి. వాటిని పురికొసతో స్తంభానికి కట్టేయాలి. కాండానికి వచ్చే పిలకలను తీసేసి.. ఎత్తుగా పెరిగేలా చూడాలి. స్తంభం పై భాగంలో వాడేసిన స్కూటర్ టైరును దూర్చాలి. ఎత్తుగా ఎదిగిన తర్వాత స్తంభం పైన అమర్చిన పాత టైరులో నుంచి కాండాన్ని దూర్చి కిందికి వేలాడదీయాలి. గత 18 నెలలుగా మా పరిశీలనలో డ్రాగన్ ఫ్రూట్ పంటకు చీడపీడలేవీ రాలేదు. దీని పూలు అర్ధరాత్రి పూస్తాయి. తెల్లారి రాలిపోతాయి. రెండు నెలలకు కాయలు పక్వానికి వస్తాయి. కాయలు చాలా వరకు ఒకేసారి పక్వానికొస్తాయి. పండు కోసిన తర్వాత మామూలుగా వారం వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో 4 వారాల వరకు ఉంచొచ్చు. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి, బి, బి2, బి3, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ తదితర పోషకాలుంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆస్మా రోగులకు, కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపకరిస్తుంది. కేన్సర్ రాకుండా చూస్తుంది. ప్రస్తుతం మన మార్కెట్లో దొరికే డ్రాగన్ ఫ్రూట్స్ విదేశాల నుంచి దిగుమతైనవే. స్థానిక మార్కెట్‌తోపాటు విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలున్న పంట ఇది.. లంబసింగిలో ఈ పంట బాగా పండుతుండడం స్థానిక గిరిజనులకు వరం లాంటిది. వచ్చే ఏడాది కొందరు గిరిజనులతో సాగు చేయిద్దామనుకుంటున్నాం. ఐటీడీఏ భారీ స్థాయిలో డ్రాగన్‌ఫ్రూట్ సేంద్రియ సాగు చేపడితే గిరిజనులకు మేలు జరుగుతుంది..’’ అని డా. చంద్రశేఖర్‌రావు (73826 33657) ‘సాక్షి’కి తెలిపారు. సముద్ర తీరానికి దూరంగా ఉండి, 30 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో ఈ పంటను సాగు చెయ్యొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో షేడ్ నెట్ కింద సాగు చెయ్యొచ్చని, లేదా నీడ కోసం అవిశ మొక్కలను సాగు చేయొచ్చంటున్నారు. అయితే పండు బరువు 270 గ్రాములకన్నా పెరగడం లేదంటున్నారు. కొత్త పంట ఏదైనా రైతులు మొదట ప్రయోగాత్మకంగా కొద్ది మొక్కలను ఒకటి రెండేళ్లు సాగు చేసి, మార్కెట్‌ను పరిశీలించుకొని తమంతట తాము ఒక అభిప్రాయానికి రావడం మంచిది. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (ఇన్పుట్స్ : రాజు, చింతపల్లి రూరల్) మేడపైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు! లక్ష్మీకాంత్ నూకల బెంగళూరు నివాసి. వృత్తి రీత్యా వ్యాపారి. సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు తన ఇంటిపైన పండించుకోవడం ఆయనకు చాలా ఇష్టమైన పని. లక్ష్మీకాంత్ కిచెన్ గార్డెన్లో ఇటీవలి సంచలనం. చూడముచ్చటైన, తియ్యని డ్రాగన్ ఫ్రూట్స్!. విదేశాల నుంచి దిగుమతైన ఖరీదైన డ్రాగన్ ఫ్రూట్ తెలుసు. దానికి దీటుగా సొంత గార్డెన్‌లోనే ఈ మధుర ఫలాన్ని సాగు చేయడం గొప్ప ఆనందాన్నిచ్చిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. సక్సెస్ఫుల్ సిటీ ఫార్మర్ లక్ష్మీకాంత్ డ్రాగన్ ఫ్రూట్ అనుభూతులు ‘ఇంటిపంట’ పాఠకుల కోసం ఆయన మాటల్లోనే.. మా ఇంటి పైనే కిచెన్ గార్డెన్ పెంచుతున్నా. ఇది హాబీగా మొదలై.. పాషన్‌గా మారింది. రెండేళ్ల క్రితం నర్సరీ నుంచి తెచ్చా. డ్రాగన్ ఫ్రూట్ మొక్కను మేడపైన ప్లాస్టిక్ కుండీలో నాటాను. మొదటి సారి ఒకటే పండు కాసింది. రెండోసారి రెండు పండ్లు కాసింది. ముచ్చటగా మూడో విడత.. ఉన్నట్టుండి ఆగస్టు 1న రాత్రి 11.30 గంటలకు పడుకోబోయే ముందు మేడ మీదకు వెళ్లాను. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు బోలెడన్ని పూలు విచ్చుకొని కనువిందు చేశాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్న నేను ఎగిరి గంతేశాను. ఈ మొక్క రాత్రి పూటే పూస్తుంది. తెల్లారికల్లా పూలు రాలిపోతాయి. ఈ లోగా పరాగసంపర్కం జరిగితేనే పండ్లు వస్తాయి. పూలను చేతితో సున్నితంగా తాకాను. సెప్టెంబర్ 10న పండ్లు పక్వానికొచ్చి చక్కటి గులాబీ రంగులోకి మారాయి. 8 పండ్లు కోశాను. ఇంకా 4-5 చిన్న కాయలున్నాయి. పెద్ద పండు 400 గ్రాముల వరకు బరువుంది. కోస్తే లోపల గుజ్జు తెల్లగా ఉంది. రుచి అమోఘంగా ఉంది. మా ఇంటిల్లపాదికీ చాలా సంతోషం కలిగింది. ఈ మొక్కకు రెండేళ్లుగా ఎటువంటి చీడపీడలూ రాలేదు. దీన్ని పెంచడం సులభం. అప్పుడప్పుడు సేంద్రియ ఎరువు కొంచెం వేశాను. చాలా తక్కువ నీరు సరిపోతాయి. నెలకో, మూడు వారాలకో ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతున్నది. కాక్టస్ కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆంధ్ర, తెలంగాణ వంటి ప్రాంతాల్లో కూడా బాగానే పండుతుంది. మీ గార్డెన్‌లోనూ డ్రాగన్ ఫ్రూట్‌ను పెంచండి. సందేహాలుంటే నన్ను (ఆంగ్లంలో) అడగండి : 077951 04610.


