‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్‌ రోగికి ఏఐ షాక్‌! | AI Chatbots Push Unsafe Cancer Treatments | Sakshi
Sakshi News home page

‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్‌ రోగికి ఏఐ షాక్‌!

Apr 22 2026 11:12 AM | Updated on Apr 22 2026 11:23 AM

AI Chatbots Push Unsafe Cancer Treatments

లండన్‌: ఆధునిక కాలంలో ఏ చిన్న అనారోగ్య సందేహానికైనా ఇంటర్నెట్‌ను అశ్రయించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు దీనికి తోడు కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే అత్యంత సున్నితమైన క్యాన్సర్ చికిత్స విషయంలో ఈ ఏఐ సాధనాలు ఇస్తున్న సలహాలు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. కీమోథెరపీ లాంటి శాస్త్రీయ చికిత్సలకు బదులుగా ఎటువంటి ఆధారాల్లేని ప్రత్యామ్నాయాలను సూచిస్తూ, ఇవి రోగులను ప్రాణాపాయంలోనికి నెడుతున్నాయి.

సగం సమాధానాలు పచ్చి అబద్ధాలే
లుండ్‌క్విస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ‘బీఎంజే ఓపెన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం అనేక  విషయాలను బయటపెట్టింది. పరిశోధకులు చాట్‌జీపీటీ, జెమిని, మెటా ఏఐ, డీప్‌పీక్‌, గ్రోక్‌ వంటి ప్రముఖ చాట్‌బాట్లను పరీక్షించారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల గురించి అడిగినప్పుడు ఇవి ఇచ్చే సమాధానాల్లో దాదాపు 50 శాతం తప్పుల తడకగా ఉన్నాయని తేలింది. ఇందులో 19.6 శాతం సమాచారం పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉండగా, 30 శాతం సమాధానాల్లో సరైన స్పష్టత లేదు. ముఖ్యంగా పరీక్షించిన అన్ని మోడళ్లలో ‘గ్రోక్‌’ పనితీరు అత్యంత పేలవంగా ఉందని వెల్లడైంది.

ప్రాణాలు తీస్తున్న ఉచిత సలహాలు
కీమోథెరపీకి ప్రత్యామ్నాయాలు ఏమిటని అడిగినప్పుడు, ఈ బాట్లు ముందుగా చిన్నపాటి హెచ్చరికలు చేసినప్పటికీ.. ఆ వెంటనే ఆక్యుపంక్చర్, మూలికా వైద్యం, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ‘క్యాన్సర్ డైట్’లను సూచించాయి. అసలు సంప్రదాయ వైద్య చికిత్సలనే వ్యతిరేకించే ‘గెర్సన్ థెరపీ’ వంటి వాటిని కూడా ఈ ఏఐలు ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత నిరూపితమైన కీమోథెరపీతో ఇలాంటి ప్రామాణికత లేని చికిత్సలకు ఈ చాట్‌బాట్లు సమానమైన ప్రాధాన్యత ఇస్తుండటంతో  రోగులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

ఏఐ డాక్టర్ కాదు.. అప్రమత్త తప్పనిసరి
ఏఐ ఇచ్చే ఈ తప్పుడు సమాచారం వల్ల రోగులు ప్రాణాలను నిలబెట్టే కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలను వాయిదా వేసుకోవడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చాట్‌బాట్లు రోగుల ఆయుర్దాయం గురించి అవాస్తవ అంచనాలను ఇస్తూ, వారిలో లేనిపోని ఆందోళనను నింపుతున్నాయి. ఏఐ అనేది కేవలం ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి మాత్రమేనని, కచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం ఎల్లప్పుడూ అర్హత కలిగిన ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్య నిపుణులు)ను మాత్రమే సంప్రదించాలని నిపుణులుహెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘తలొంచం.. తరిమికొడతాం’: ‘పహల్గామ్‌’పై ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement