న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో జరిగిన నరమేథానికి ఏడాది గడిచింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఆ మారణకాండ దేశ ప్రజల మనసులను ఇంకా తొలిచివేస్తూనే ఉంది. ఆ చీకటి రోజును స్మరించుకుంటూ, ఉగ్రవాదం ముందు భారత్ ఎన్నటికీ తలొంచబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నేరస్తులకు శిక్ష ఖాయమంటూ, తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని భారత సైన్యం ఉగ్రమూకలకు మరోమారు హెచ్చరికలు జారీ చేసింది.
కన్నీటి నివాళి.. చెరగని జ్ఞాపకం
ఏప్రిల్ 22, 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది పర్యాటకులతో పాటు స్థానిక పోనీ హ్యాండ్లర్ ఆదిల్ షాలకు దేశం ఘనంగా నివాళులర్పించింది. ‘ఆ అమాయకులను ఎన్నటికీ మరువం. ఉగ్రవాదం ముందు దేశం ఎన్నటికీ తలొగ్గదు’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా లిడ్డర్ నది ఒడ్డున నల్లరాతితో నిర్మించిన స్మారక స్థూపం ఆ 26 మంది మృతుల పేర్లతో వారి విషాద స్మృతికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు.
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
As a nation, we stand united in grief and resolve. India will never bow to…— Narendra Modi (@narendramodi) April 22, 2026
ఆపరేషన్ సింధూర్.. ఉగ్రస్థావరాలపై ఉక్కుపాదం
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. మే 7, 2025న పీవోకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సైన్యం విరుచుకుపడింది. లష్కరే తొయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది భారీ లాంచ్‌ప్యాడ్‌లను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య డ్రోన్ దాడులు, షెల్లింగ్ లాంటి ఘటనలతో నాలుగు రోజుల పాటు భీకర పోరు జరిగి, చివరకు మే 10న మిలిటరీ డైరెక్టర్ జనరల్స్ చర్చలతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
ఆపరేషన్ మహాదేవ్.. ముష్కరుల వేట
‘భారత్‌పై జరిగే దాడులకు ప్రతికారం కచ్చితంగా తీర్చుకుంటాం, న్యాయం జరిగి తీరుతుంది’ అని సైన్యం తేల్చిచెప్పింది. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరిట 93 రోజుల పాటు అలుపెరగని వేట కొనసాగించింది. జూలై 28న ఎలైట్ పారా (స్పెషల్ ఫోర్సెస్) కమాండోలు అత్యంత దట్టమైన అటవీ ప్రాంతంలో 10 గంటల పాటు సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అత్యంత రహస్యంగా దాడులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బైసరన్ లోయ దాడికి కారణమైన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది.
ఇది కూడా చదవండి: TN Election: విజయ్ పొలిటికల్ థ్రిల్లర్.. ఇన్వెస్టర్లలో గుబులు!


