చెన్నై: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ, ఆర్థిక యుద్ధానికి తమిళనాడు వేదిక కాబోతోంది. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 11.19 శాతం రికార్డు వృద్ధితో దూసుకుపోతున్న రాష్ట్రం రేపు (ఏప్రిల్ 23న) ఓటింగ్ కు సిద్ధమైంది. అయితే అందరి దృష్టి పాత రాజకీయ దిగ్గజాలపైనే కాకుండా, కేవలం రెండేళ్ల క్రితం ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని స్థాపించి 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న సినీ నటుడు విజయ్ పై పడింది. 2030 నాటికి $1 ట్రిలియన్(రూ. లక్ష కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రానికి ఈ సరికొత్త రాజకీయ సమీకరణం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
బలమైన ఆర్థిక శక్తిగా తమిళనాడు
2024-25 ఆర్థిక సర్వే ప్రకారం, తమిళనాడు జీఎస్‌డీపీ ఏకంగా 11.19 శాతానికి చేరుకుని, ప్రధాన భారతీయ రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. ముఖ్యంగా తయారీ రంగం జాతీయ సగటు (4.5%) కంటే మూడు రెట్లు ఎక్కువగా 14.74 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశ జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే ఉన్న ఈ రాష్ట్రం జాతీయ జీడీపీకి 9.4 శాతం తోడ్పాటు అందించడం విశేషం. తలసరి ఆదాయం రూ. 3.62 లక్షలకు చేరింది. హ్యుందాయ్, ఫాక్స్‌కాన్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇక్కడ భారీగా విస్తరిస్తున్నాయి. హోసూర్‌లో రోల్స్ రాయిస్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ ప్రారంభించడం దీనికి నిదర్శనం. 2024-25లో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, లెదర్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం.. సరుకుల ఎగుమతుల ద్వారా $52.07 బిలియన్లు(రూ. 4.35 లక్షల కోట్లు) రాబట్టింది.
‘టీవీకే’ ప్రభంజనమా? పెట్టుబడులపై ప్రభావమా?
ఎలాంటి పరిపాలనా అనుభవం లేని విజయ్ పార్టీ మే 4న వెలువడే ఫలితాల్లో సృష్టించబోయే ప్రభావాన్ని మార్కెట్ శక్తులు గమనిస్తున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు పారిశ్రామిక అనుకూల విధానాలతో స్థిరమైన పాలన అందించాయి. దీనివల్లే 2019 అక్టోబర్ నుండి 2025 జూన్ నాటికి $17.29 బిలియన్ల (రూ. 1,53,394 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ఇక్కడికి వచ్చాయి. అయితే విజయ్ పార్టీ ఓట్లను చీల్చి, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తితే, అది కూటమి రాజకీయాల అనిశ్చితికి దారితీస్తుంది. ఒకవేళ విజయ్ గణనీయమైన సీట్లు సాధించి ‘కింగ్ మేకర్’ అయితే, భూసేకరణ లేదా పారిశ్రామిక విధానాలపై వారికున్న అనుభవలేమి కారణంగా, హోసూర్‌లో కొత్తగా రూ. 2,000 కోట్ల ప్లాంట్‌ను ఆమోదించడానికి కార్పొరేట్ సంస్థలు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది.
ఉచిత పథకాలు వర్సెస్ సుస్థిర వృద్ధి
ఎన్నికల హడావిడిలో అసలు చర్చించాల్సిన ప్రధానాంశం ఆర్థిక సుస్థిరత. రాష్ట్ర సామాజిక రంగ వ్యయం 2021-22లో రూ. 1.13 లక్షల కోట్ల నుంచి 2025-26 నాటికి రూ. 1.57 లక్షల కోట్లకు పెరిగింది. రేపటి పోలింగ్ కోసం అన్ని పార్టీలు మరిన్ని ఉచితాలను అందిస్తామని వాగ్దానం చేశాయి. ఈ నేపధ్యంలో ఏదో ఒక దశలో రూ. 36 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ వీటన్నింటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. సంక్షేమాన్ని పంచుతూనే 2030 నాటి ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని ఎలా సాధిస్తారన్నదే తదుపరి ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్ రెడ్’!


