Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్‌ రెడ్‌’! | Earth Day 2026 Facts, History, Theme Activities | Sakshi
Sakshi News home page

Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్‌ రెడ్‌’!

Apr 22 2026 7:58 AM | Updated on Apr 22 2026 8:27 AM

Earth Day 2026 Facts, History, Theme Activities

‘మనమంతా పేలడానికి సిద్ధంగా ఉన్న పర్యావరణ టైమ్ బాంబ్ మీద కూర్చున్నాం’.. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు పలకలు, అంతుచిక్కని ప్రకృతి వైపరీత్యాలు.. ఇవన్నీ భూమి మనకు పంపుతున్న ఆఖరి హెచ్చరికలు. ఈ విపత్తు నుంచి మన గ్రహాన్ని కాపాడుకునేందుకు మనకు మిగిలి ఉన్న సమయం చాలా తక్కువని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎర్త్ డే’ ప్రాముఖ్యతను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత.

‘సమితి’ తీవ్ర హెచ్చరికలివే..
ఈరోజు ఏప్రిల్ 22, 2026.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే నేడు ధరిత్రీ దినోత్సవం (ఎర్త్ డే) జరుపుకుంటున్నాం. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, భయపెడుతున్న గ్లోబల్ వార్మింగ్ పరిణామాల నేపథ్యంలో మానవాళికి ఐక్యరాజ్యసమితి ‘కోడ్ రెడ్’ హెచ్చరికలు జారీ చేసింది. దీని అర్థం తక్షణమే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను.. అంటే భూ వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులను  తగ్గించాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో పర్యావరణం కోలుకోలేని స్థితికి చేరుకుంటుందని సమితి హెచ్చరించింది.

మన చేతుల్లోనే పరిష్కారం
ఇలాంటి విపత్కర సమయంలో, ఈ భూమిని కాపాడుకునే అపారమైన శక్తి మనందరి చేతుల్లోనే ఉందనే  వాస్తవాన్ని ఈ ఎర్త్ డే మనకు గుర్తుచేస్తోంది. 1970లో ఒక చిన్న పర్యావరణ నిరసనగా  మొదలైన ఈ కార్యక్రమం, నేడు ప్రపంచవ్యాప్తంగా  కోట్ల మందికి పైగా ప్రజలను ఏకం చేసే ఒక మహా ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ తీవ్ర సంక్షోభం నుంచి మన గ్రహాన్ని రక్షించుకోవడానికి మనం ఆచరించాల్సిన మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పర్యావరణ పోరాటం
1970ల నాటి రోజుల్లో స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్ యాక్ట్), నీరు (క్లీన్ వాటర్ యాక్ట్) కోసం ఎలాంటి చట్టాలు, పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలు ఏవీ లేవు. అయితే 1962లో రాచెల్ కార్సన్ రచించిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకం రసాయనాల వల్ల జరిగే అనర్థాలను తెలియజేసింది. 1969లో కుయహోగా నదిలో చమురు లీకై చెలరేగిన మంటలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ పరిణామాలతో పర్యావరణవేత్త, నాటి అమెరికా సెనేటర్ గేలార్డ్ నెల్సన్ వియత్నాం యుద్ధ వ్యతిరేక నిరసనల స్ఫూర్తితో ఏప్రిల్ 22, 1970న తొలి ‘ఎర్త్ డే’కు శ్రీకారం చుట్టారు.

ఒక మహా ఉద్యమంలా మారిందిలా..
ఆ ఒక్క రోజే దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు (నాటి జనాభాలో 10%) స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చరిత్ర సృష్టించారు. నాటి ఆ సంచలన స్పందన నేడు 192 దేశాల్లో, 1,50,000 కు పైగా భాగస్వామ్య సంస్థలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమంగా మారింది. అయితే, ప్రస్తుత పరిస్థితులు మరింత విషమంగా ఉన్నాయని,  ప్రపంచ పర్యావరణ సంస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని 60 ఏళ్లుగా చింపాంజీలపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జేన్ గూడాల్ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

2026 థీమ్: ‘మన శక్తి, మన గ్రహం’
ఈ ఏడాది 2026 ఎర్త్ డే అధికారిక థీమ్ (ఇతివృత్తం) - ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ (మన శక్తి, మన గ్రహం). ఈ నినాదం ఒక స్పష్టమైన, అత్యంత శక్తివంతమైన వాస్తవాన్ని తెలియజేస్తోంది. పర్యావరణంలో ఆశించిన మార్పు కేవలం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై మాత్రమే ఆధారపడి లేదు.. అది సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో తీసుకునే చర్యల ద్వారానే సాధ్యమవుతుందని ఈ థీమ్ నొక్కి చెబుతోంది. సమిష్టి కృషిని ఈ క్యాంపెయిన్ ప్రోత్సహిస్తోంది. పాఠశాలలు, వ్యాపార సంస్థలు, కమ్యూనిటీలు, ప్రతి  పౌరుడు తాము నివసిస్తున్న పరిసరాల పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆచరణాత్మకమైన అడుగులు వేయాలని ఈ 2026 ఎర్త్ డే థీమ్ ప్రపంచానికి పిలుపునిస్తోంది.

ధరిత్రిని కాపాడే బాధ్యత అందరిదీ..
భూమిని రక్షించే ఈ మహా  కార్యక్రమంలో సామాన్యులు సైతం పాలుపంచుకోవడం చాలా సులభం. EARTHDAY.ORG అధికారిక వెబ్‌సైట్ ద్వారా  ఎవరైనా వాలంటీర్‌గా తమపేరు నమోదు చేసుకోవచ్చు లేదా మీ స్వంతంగా ఒక ఎర్త్ డే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కూడా ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక అద్భుతమైన ‘ఎర్త్ డే టూల్‌కిట్’ను రూపొందించింది. ఇందులో  ఏదైనా కమ్యూనిటీలో లేదా ఇంటి వద్దే సులభంగా చేయగలిగే ఎన్నో కార్యకలాపాలు ఉన్నాయి. అలాగే ‘ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్’ సూచనల ప్రకారం పరాగసంపర్కం చేసే తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షించేలా పూల మొక్కలు పెంచడం, ఇంటి తోటల్లో హానికరమైన రసాయన పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయడం, నీటి వినియోగాన్ని పొదుపుగా నిర్వహించడం వంటి 10 రకాల చిన్నపాటి రోజువారీ మార్పుల ద్వారా కూడా  ఈ పర్యావరణ యజ్ఞంలో భాగస్వములు కావచ్చు.

ఇది కూడా చదవండి: 51 క్వింటాళ్ల పూలతో కేదార్‌నాథ్ ముస్తాబు

Advertisement
 
Advertisement
Advertisement