కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రివాల్వరీ రీటా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమెన్ సెంట్రిక్ కథతో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.
ప్రస్తుతం చెన్నైలో రివాల్వర్ రీటా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ వినియోగంపై కీర్తి సురేశ్ మాట్లాడారు. ఏఐతో సోషల్ మీడియాలో వస్తోన్న ఫోటోలపై ఆందోళన వ్యక్తం చేశారు. తన ఏఐ మార్ఫింగ్ ఫోటోలను చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో ఏఐ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది ఒక వరమే కానీ..ఒక రకంగా శాపం కూడా. మానవులు సాంకేతికతను కనుగొన్నారు. కానీ ఇక్కడ మనం నియంత్రణ కోల్పోతున్నాం. సోషల్ మీడియాలో అసహ్యకరమైన దుస్తుల్లో నా చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంటా. నేను ఎప్పుడైనా నిజంగానే ఇలాంటివీ ధరించానా అని షాకవుతుంటా. ఇటీవల నేను సినిమా పూజ కోసం ధరించిన దుస్తులను వేరే కోణంలోకి మార్చి చూపించారు. అది చూసిన క్షణం నేను షాకయ్యా. ఆ తర్వాత నేను అలా పోజు ఇవ్వలేదని గ్రహించా. ఇలాంటివి చూసినప్పుడు చిరాకు తెప్పిస్తుంది. అంతేకాదు బాధగా కూడా అనిపిస్తుంది" అని పంచుకుంది.
ఈ సమస్య కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాదని.. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు గురైన ఎవరినైనా ప్రభావితం చేస్తుందని కీర్తి సురేష్ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఏఐ వినియోగం పెరిగాక పలువురు సెలబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి ఆండ్రియా జెరెమియా కూడా ఏఐతో సంబంధం ఉన్న నష్టాల గురించి ప్రస్తావించారు, ఈ సాంకేతికత వినోద రంగానికి సవాల్‌గా మారిందన్నారు. కేవలం నటులకే కాదు ప్రజలకు కూడా ఏఐ సమస్యగా మారుతోందని.. ఏఐ మన కోసం పనిచేయాలి.. మరోలా కాదన్నారు.


