‘పాంచ్‌ మినార్‌’ మూవీ రివ్యూ | Paanch Minar Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Paanch Minar Review: ‘పాంచ్‌ మినార్‌’ మూవీ రివ్యూ

Nov 20 2025 2:45 PM | Updated on Nov 20 2025 3:28 PM

Paanch Minar Movie Review And Rating In Telugu

టైటిల్‌: పాంచ్‌ మినార్‌
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు
నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ LLP
సమర్పణ: గోవింద రాజు
రచన & దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: ఆదిత్య జవ్వాది
విడుదల తేది: నవంబర్‌ 21, 2025

రాజ్‌ తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా ఏళ్లు అవుతుంది.  ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి కానీ.. కొన్ని అయితే రిలీజ్‌ అయిన విషయం తెలిసేలోపే థియేటర్స్‌ నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ యంగ్‌ హీరో. కాస్త గ్యాప్‌ తీసుకొని ఈ సారి క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పాంచ్‌ మినార్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో అయినా రాజ్‌ తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
కృష్ణచైతన్య అలియాస్‌ కిట్టు(రాజ్‌ తరుణ్‌) ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. ప్రియురాలు ఖ్యాతి(రాశి సింగ్‌) ఒత్తిడి చేయడంతో సాఫ్ట్‌వేర్‌ జాబులో జాయిన్‌ అయ్యానని అబద్దం చెప్పి.. క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో తనకు చెవుడు ఉన్నట్లుగా నటిస్తాడు. ఓ రోజు ఇద్దరు కిరాయి హంతకులు కిట్టు క్యాబ్‌ని బుక్‌ చేసుకొని.. అతని ముందే గ్యాంగ్‌స్టర్‌ చోటు(రవి వర్మ)ని హత్య చేస్తారు. ఈ హత్య చేసినందుకు మూర్తి(అజయ్‌ ఘోష్‌) వారికి రూ. 5 కోట్లు ఆఫర్‌ చేస్తాడు. ఆ డబ్బుని తీసుకునేందుకు వెళ్తున్న క్రమంలో హంతకులు పోలీసులకు చిక్కుతారు. చెవిటి వాడిలా నటించిన కిట్టు.. హంతకులకు తెలియకుండా ఆ డబ్బుని కొట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈజీగా వచ్చిన డబ్బు.. కిట్టుకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? తనను చంపేందుకు కుట్ర పన్నిన హంతకులు, సీఐ (నితిన్‌ ప్రసన్న)ల నుంచి కిట్టు ఎలా తప్పించుకున్నాడు? చివరకు రూ. 5 కోట్లు ఎవరికి దక్కాయి? ఈ కథకు ‘పాంచ్‌ మినార్‌’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
ఇదొక మంచి క్రైమ్‌ కామెడీ సినిమా.ఉద్యోగం సాధించాలనే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం. కొత్త కథ అని చెప్పలేం కానీ.. జానర్‌కు తగ్గట్లు ప్రతి సందర్భంలో నుంచి థ్రిల్‌.. వినోదాన్ని పుట్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ కడుముల. ఒకవైపు నవ్వులు పూయిస్తూనే..మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. హీరో పాత్ర ప్రాబ్లమ్స్‌లో నలిగిపోతున్న ప్రతిసారి ప్రేక్షకులు నవ్వుతారు. 

చోటు తండ్రి మరణించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ..ఉద్యోగం కోసం ఆయన పడే పాట్లు.. అన్నీ నవ్వులు పూయిస్తాయి. చోటు హత్య తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. పాంచ్‌ మినార్‌ పదం కిట్టు జీవితాన్ని ఎలా మార్చేసిందనేది తెరపై చూడాల్సిందే. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. 

ఇక ద్వితియార్థంలో కథనం పరుగులు తీస్తుంది. తన ప్రాణాలతో పాటు డబ్బుని కూడా రక్షించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. చిన్న చిన్న టిస్టులు థ్రిలింగ్‌ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఎలాంటి వల్గారిటీ, రక్తపాతం లేకుండా ఫ్యామిలీ అందరూ కలసి హాయిగా నవ్వుకుని చూసే క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ పాంచ్‌ మినార్‌.

ఎవరెలా చేశారంటే...
కిట్టు పాత్రలో రాజ్‌ తరుణ్‌ చక్కగా నటించాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే..ఇందులో రాజ్‌ తరుణ్‌ చాలా హుషారుగా కనిపించాడు. ఆయన పాత్ర సమస్యల్లో ఇరుకున్న ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వుతాడు. ఖ్యాతి పాత్రకి రాశిసింగ్‌ న్యాయం చేసింది. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న సీఐగా నితిన్‌ ప్రసన్న చక్కగా నటించాడు. కామెడీ విలన్‌గా అజయ్‌ ఘోష్‌ తనదైన శైలీలో నటించి మెప్పించాడు. సుదర్శన్‌, లక్ష్మణ్‌లు పంచ్‌ డైలాగ్స్‌లో నవ్వులు పూయించారు. మరోవైపు హీరో తండ్రిగా బ్రహ్మాజీ తెరపై కనిపించేది కాసేపే అయినా..బాగా నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర నటించారు. 
సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ చాలా షార్ప్‌గా ఉంది.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement