బేబీ సినిమాతో టాలీవుడ్‌లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత ఎస్‌కేఎన్ (SKN).. సినిమా వేదికలపై తను చేసే వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో ఉంటారు. అయితే, తాజాగా ఆయన ఒక కుటుంబాన్ని ఆదుకున్నారు. సినీ హీరో మహేష్ బాబు అభిమాని రాజేష్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం చనిపోయారు. ఇదే విషయాన్ని చెబుతూ రమేష్ నాయక్ అనే నెటిజన్ వివరాలతో సహా ట్వీట్ చేశాడు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎస్‌కేఎన్ కంట ఆ పోస్ట్ పడింది. దీంతో ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు.
ఒక అభిమానిగా ఇంకొక అభిమాని ఎమోషన్‌ను తాను అర్థం చేసుకోగలుగుతానని ఎస్‌కేఎన్ అన్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన రాజేష్ ఇంటికి వెళ్లిన ఆయన ఆ కుటుంబానికి రూ. 2లక్షలు సాయిం చేశారు. రాజేష్‌కు 10 సంవత్సరాల కుమారుడు, ఆరు సంవత్సరాలు కూతురు ఉండటంతో వారి చదువుల కోసం ఈ డబ్బు ఉపయోగించాలని కోరారు. రాజేష్ ఇంటికి వెళ్లి అతని కుమారుడికి రెండు లక్షల చెక్‌ను ఎస్‌కేఎన్ అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఎస్‌కేఎన్‌ను అభినందిస్తూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.


