‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘12ఎ రైల్వే కాలనీ’ డిఫరెంట్ జోనర్ సినిమా. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. శ్రీనివాసాగారు, నరేశ్‌గారు, డైరెక్టర్, రచయితలు నమ్మడం వల్లే నేను చేయగలిగాను. ఈ మూవీ ఔట్‌పుట్ చూశాక వారందరూ సంతోషంగా ఉన్నారు’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo ) తెలిపారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’(12A Railway Colony). పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘మొదటిసారి ‘12ఏ రైల్వే కాలనీ’ లాంటి థ్రిల్లర్ మూవీకి సంగీతం ఇవ్వడం కొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి జానర్‌లోనూ నేను సినిమా చేయగలను అనే నమ్మకాన్ని ఈ ప్రాజెక్టు ఇచ్చింది. నరేశ్‌గారికి గతంలో గుర్తుండిపోయే పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో రెండు మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ గురించి ఆలోచించను. నేను ఆ జోనర్‌లో లేను. నన్ను నమ్మి సినిమా ఇస్తే ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను.
ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూశాను. రవితేజగారు స్టేజ్‌పై ఉన్నప్పుడు ఒకలా, నరేశ్‌గారు స్టేజ్‌పై ఉన్నప్పుడు మరోలా మాట్లాడానని కామెంట్లు పెట్టారు. సంగీత దర్శకుడిగా నాకు మొదట అవకాశం ఇచ్చింది నరేశ్‌గారు... ఆగిపోయిన నా కెరీర్‌కి పునర్జన్మ ఇచ్చింది రవితేజగారు. ఇదే విషయాన్ని నేను చెప్పాను. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక విమర్శలు చేశారు. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, డెకాయిట్, టైసన్ నాయుడు, భోగి, ఫంకీ’ వంటి సినిమాలకి సంగీతం అందిస్తున్నాను’’ అని చెప్పారు.


