హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. రాజమౌళి నిజంగా నాస్తికుడు అయితే డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదించారని, దేవుళ్లు అంటే నమ్మకం లేనప్పుడు ఆ సినిమాలు తీయడం ఎందుకుని రాజాసింగ్ ప్రశ్నించారు. గతంలో దేవుళ్లపై రాజమౌళి ఇష్టారీతిన కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసమే ఆలా మాట్లాడారా.. అనే దానిపై క్లారిటీ ఇచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తామని హెచ్చరించారు రాజాసింగ్.
కాగా, మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కోసం పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వారణాసి కోసం మహేష్ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నాడని విజయేంద్రప్రసాద్ చెప్పారు.
అయితే, వారణాసి గ్లింప్స్ విడియో రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. 'నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన (హనుమంతుడు) ఉంటే ఇదేనా నడిపించేది..?' అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయని నెటిజన్లు ఫైర్ అయ్యారు. తాజాగా దీనిపై రాజాసింగ్ సైతం స్పందించడంతో రాజమౌళి వ్యాఖ్యల ఎపిసోడ్ ఎంతవరకూ పోతుందో చూడాలి.


