'బాహుబలి: ది ఎపిక్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియాను ఊపేసిన బాహుబలి ప్రాంఛైజ్ రెండు సినిమాలు పదేళ్ల తర్వాత ఒక్కటిగా 'బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్- ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు సంచలన విజయం సాధించాయి. అయితే, బాహుబలి ది ఎపిక్ పేరుతో 3 గంటల 40 నిమిషాల నిడివితో మరోసారి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.
'బాహుబలి: ది ఎపిక్' నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్టిక్స్ (NETFLIX) తన లిస్ట్‌లో చేర్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సత్తా చాటింది. ఏకంగా రూ. 55 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రీరిలీజ్ చిత్రాలలో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కథేంటి..?
బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్‌తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు.


