నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్‌ | Actor Prabhakar about Trolling on Chandrahas Gunji Gunji Song | Sakshi
Sakshi News home page

Prabhakar: నా పెంపకంపై విమర్శలు.. నా భార్య, కూతురేం చేశారు?

Feb 7 2026 8:14 PM | Updated on Feb 7 2026 8:27 PM

Actor Prabhakar about Trolling on Chandrahas Gunji Gunji Song

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ చేసిన ఓ పని వల్ల తీవ్ర విమర్శలపాలయ్యాడు. ప్రమోషన్స్‌ కోసం ఓ పాట పాడటం.. అందులో అసభ్య పదాలు ఉండటంతో హీరోను విమర్శించనివాళ్లు లేరు. ఓపక్క ట్రోలింగ్‌ జరుగుతుండగానే అతడి సినిమా బరాబర్‌ ప్రేమిస్తా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

స్పందించిన ప్రభాకర్‌
ఈ క్రమంలో ఈ వివాదంపై నటుడు ప్రభాకర్‌ స్పందించాడు. తన కొడుకు చేసింది తప్పేనని అంగీకరించాడు.  అందుకు క్షమాపణలు తెలియజేశాడు. ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గత నాలుగురోజులుగా విపరీతంగా వైరలవుతున్న విషయం.. మా బాబు చంద్రహాస్‌ వాడిన బూతు పదాలు- దానిపై విశ్లేషణలు, అభిప్రాయాలు, వాళ్లు తిరిగి బూతులు అనడాలు.

తప్పని చెప్పా..
నేనైనా, నా కొడుకైనా, ఎవరైనా సరే పబ్లిక్‌గా బూతులు మాట్లాడటమనేది తప్పు. దాన్ని నేను ఎంకరేజ్‌ చేయను. ఆరోజు నేను ఫంక్షన్‌లో సగం పాటయ్యాక అక్కడికి వెళ్లాను. పాట అయిపోగానే బాబును పక్కకు పిలిచి నాన్నా, ఇలాంటి పదాలు పబ్లిక్‌గా వాడకూడదు అని చెప్పాను. వాడు కూడా సరేనని, ఇంకోసారి పునరావృతం చేయనన్నాడు. అయితే ఆ పాట వీడియో క్లిప్పింగ్స్‌ను ముక్కలుగా కట్‌ చేసి వైరల్‌ చేశారు. 

అది పెద్ద తప్పు
తప్పు చేసినవాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు, కానీ, వినకూడని మాటల్ని ఇంకా ఎక్కువమందికి వినిపించి తప్పు చేస్తున్నారు. ఆ వీడియోలో రెండు, మూడు బూతులుంటే నా కుటుంబం మొత్తాన్ని వందల బూతులు తిడుతున్నారు. అది చేయకుండా ఉంటే బాగుండనిపించింది. ఆ ఈవెంట్‌లో నా భార్య, కూతురు లేరు. వాళ్లు చెన్నై షూటింగ్‌లో ఉన్నారు. ఆ విషయం తెలియకుండా చాలా మంది చాలామాటలన్నారు. అది చాలా పెద్ద తప్పు. 

పెంపకంపై విమర్శలు
ఏదైనా తెలుసుకుని మాట్లాడండి. నన్ను కూడా నానామాటలన్నారు. పెంచడం రాదా? పద్ధతి తెలీదా? అని విమర్శించారు. నా పెంపకం, నేర్పించిన సంస్కారం.. ఈ ఒక్క పాటతో డిసైడ్‌ చేయకూడదు. నా బిడ్డ టాలెంట్‌ చూడండి. బరాబర్‌ ప్రేమిస్తా సినిమా చూసినవాళ్లు చంద్రహాస్‌ అద్భుతంగా చేశాడంటున్నారు. ఎంతో మెచ్యురిటీ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అంటున్నారు.

ఇబ్బందిపపడితే క్షమించండి
తప్పుని నేను సమర్థించట్లేదు. తప్పుని ఎత్తిచూపే పనిలో పడి మనం ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో! సమాజానికి హాని చేస్తున్నామేమో! నేను ఒకటే చెప్పదల్చుకున్నా.. మా అబ్బాయి ప్రవర్తన, మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపపడితే క్షమించండి. ఆరోజు ఫంక్షన్‌కు నాపై ప్రేమతో వచ్చిన జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్‌, జయంత్‌ సి. పరంజి గారిని మన్నించమని కోరుతున్నా.. నా ఫంక్షన్‌కు వచ్చినందుకు మీరు మాట పడాల్సి వచ్చింది. చివరగా.. నా బిడ్డ తప్పుల్ని ఎంచారు, ఒకసారి వాడి టాలెంట్‌నూ చూడండి అంటూ బరాబర్‌ ప్రేమిస్తా సినిమా చూడమని ప్రభాకర్‌ కోరాడు.

 

 

చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా: చంద్రహాస్‌

Advertisement
 
Advertisement
Advertisement