భారత 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) లో భాగంగా, 19వ ఫిల్మ్ బజార్ గా కొత్త పేరుతో వేవ్స్ ఫిల్మ్ బజార్గా ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఇఫీ దేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవం. ఇది ప్రపంచదేశాల దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కథా రచయితలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.
ఆసియాలో అత్యంత ప్రముఖమైన ఫిల్మ్ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వేవ్స్ ఫిల్మ్ బజార్, చిత్రకారులను పెట్టుబడిదారులు, స్టూడియోలు, అంతర్జాతీయ భాగస్వాములు, ఫెస్టివల్ ప్రోగ్రామర్లతో కలుపుతూ ప్రత్యేక పరిశ్రమ వేదికగా సేవలు అందిస్తుంది.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కొరియా రిపబ్లిక్‌కు చెందిన జేవోన్ కిమ్, భారత ప్రభుత్వ సమాచార & ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు, దర్శకుడు గార్త్ డేవిస్, నటుడు అనుపమ్ ఖేర్, కేంద్ర సమాచార & ప్రసార శాఖకు చెందిన డా. ఎల్. మురుగన్, అదనపు కార్యదర్శి ప్రభాత్ కుమార్, వేవ్స్ బజార్ సలహాదారు జెరోమ్ పిలోఆర్డ్, నటుడు నందమూరి బాలకృష్ణ, ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్ హాజరయ్యారు.
వేవ్స్ బజార్ పేరిట ఈ ఏడాది విస్తరించిన కార్యక్రమాలు, అవకాశాల గురించిసంజయ్ జాజుమాట్లాడుతూ “ఈ సంవత్సరం వేవ్స్ ఫిల్మ్ బజార్ 300కి పైగా చిత్రాలతో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వబోతోంది. తొలిసారిగా యువ ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించేందుకు 20,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతిని కూడా ప్రకటిస్తున్నాం” అని తెలిపారు.
డా. ఎల్. మురుగన్ మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి గారు WAVES గురించి పేర్కొన్నట్లుగా, ఉత్పత్తి, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీత రంగాల్లో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. WAVES ఫిల్మ్ బజార్ థియేటర్ల నుండి ప్రపంచ నిర్మాతల వరకు ఉన్న అంతరాన్ని తగ్గించి యువ ప్రతిభలకు వేదికగా నిలుస్తుంది” అన్నారు.
ఈ వేడుకలో కొరియన్ అతిథి జేవోన్ కిమ్ “వందే మాతరం” గానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులు అందరూ లేచి కలిసి పాడిన ఈ ఘట్టం కార్యక్రమానికి ప్రత్యేకమైన ఉత్సాహాన్ని అందించింది.
అంతర్జాతీయ పాల్గొనుదల, కొత్త గ్రాంట్ వ్యవస్థలు, బలమైన పరిశ్రమ వేదికలతో వేవ్స్ ఫిల్మ్ బజార్ IFFIని ప్రపంచ సినీ సహకారం మరియు సృజనాత్మక మార్పిడికి కీలక కేంద్రంగా నిలుపుతోంది.


