మంత్రులు వర్సెస్‌ పీసీసీఎఫ్‌! | Cancellation of deputations for up to 25 officers and staff members across various levels | Sakshi
Sakshi News home page

మంత్రులు వర్సెస్‌ పీసీసీఎఫ్‌!

Aug 6 2026 4:16 AM | Updated on Aug 6 2026 4:16 AM

Cancellation of deputations for up to 25 officers and staff members across various levels

వివిధ స్థాయిల్లోని 25 మంది దాకా అధికారులు, సిబ్బంది డిప్యుటేషన్ల రద్దు

వీటిని కొనసాగించాలని కోరుతున్నా పీసీసీఎఫ్‌ పట్టించుకోవడం లేదంటున్న మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: అటవీశాఖకు చెందిన 25 మంది దాకా అధికారులు, సిబ్బంది డిప్యుటేషన్ల్ల రద్దు అంశం కొందరు మంత్రులు వర్సెస్‌ పీసీసీఎఫ్‌ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. వీటిలో కొన్ని డిప్యుటేషన్లను కొనసాగించాలని మంత్రులు తుమ్మల, జూపల్లి, శ్రీధర్‌బాబు, పొన్నం, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు డా.చిక్కుడు వంశీకృష్ణ, డా.సంజయ్‌ కోరి నా పీసీసీఎఫ్‌ వెనక్కి తగ్గలేదు. అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ సైతం ఈ డిప్యుటేషన్లను ఎలా రద్దు చేస్తారంటూ పీసీసీఎఫ్‌ను ప్రశ్నించినా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని తెలుస్తుంది.

అటవీశాఖ నూతన ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్‌)గా వినయ్‌కుమార్‌... గత జూన్‌ 30న బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందున్న పీసీసీఎఫ్‌ సువర్ణ ఆమోదించిన డిప్యుటేషన్లను రద్దు చేశారు. దీంతో ఈ అంశం అటు అరణ్యభవన్‌లో, ఇటు ప్రభుత్వవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. డిప్యు టేషన్లు రద్దు అయిన వారిలో క్షేత్రస్థాయిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మొదలుకొని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు ఇలా వివిధ స్థాయిల్లోని వారున్నారు. 

అటవీ శాఖ మంత్రి చెప్పినా..: స్థానిక పరిస్థితులు, కుటుంబ అవసరాల రీత్యా తమను మరో చోటకు లేదా మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపించాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలను కోరుతూ అధికారులు, ఉద్యోగులు వినతిపత్రాలు సమర్పించడం సాధారణంగా జరిగేదే. ఈ దరఖాస్తులపై ప్రజాప్రతినిధులు స్పందిస్తూ...ఆయా అధికారులు, ఉద్యోగులు కోరుకున్నట్టుగా డిప్యుటేషన్‌ పంపించాలని సిఫార్సు చేస్తూ లేఖలు పంపుతారు. ఇలాంటి వాటికి ఆమోదం లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ డిప్యుటేషన్లు రద్దు కావడం మంత్రుల కోపానికి కారణమైంది. 

ఇటీవల బాధ్యతలు చేపట్టిన వినయ్‌కుమార్‌ ఏకపక్షంగా వాటిని మధ్యలోనే రద్దు చేయడంతో తమ సిఫార్సులకు విలువ లేకుండా పోయిందని వారు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు మంత్రి సురేఖ దృష్టికి రావడంతో రద్దు చేసిన డిప్యుటేషన్లను పునరుద్ధరించి, మంత్రులు చేసిన సిఫార్సులను గౌరవించాలని సూచించినట్టు తెలిసింది. అయితే అటవీశాఖ మంత్రి చేసిన సూచనలను కూడా పెడచెవిన పెట్టడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మరోవైపు తన సమీప బంధువు కూడా బాధి తుడు కావడంతో ఓ మంత్రి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం మంత్రులు–పీసీసీఎఫ్‌ మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదురుతున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement