గోదావరికి జలకళతో వేగం పుంజుకున్న వరి సాగు
కృష్ణా నీటి కోసం రైతుల ఎదురుచూపు
ఇప్పటికి 30 లక్షల ఎకరాల్లో పూర్తయిన వరి సాగు
ఇదే ఒరవడి కొనసాగితే 50 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో సీజన్ వరి సాగు వేగం పుంజుకుంది. గోదావరికి జలకళ సంతరించుకోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రాజెక్టులు, కాలువల ద్వారా సమృద్ధిగా నీరు అందుబాటులోకి వచ్చి రైతులు పెద్దఎత్తున వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు కొద్ది రోజులుగా యుద్ధప్రాతిపదికన నాట్లు పూర్తి చేస్తున్నారు. వ్యవసాయశాఖ తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు నమోదైంది. అయితే గత నాలుగు రోజుల్లోనే సుమారు మూడు లక్షల ఎకరాల్లో నాట్లు వేసినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి జలాలు సమృద్ధిగా అందుతుండటంతో రైతులు ఆలస్యం చేయకుండా నాట్లు పూర్తి చేస్తున్నారు. శ్రీరాంసాగర్, కాళేశ్వరం, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, కాకతీయ కాలువల ఆయకట్టు ప్రాంతాల్లో, చెరువులు, కుంటల కింద వరి సాగు వేగంగా సాగుతోంది. వర్షాలు కూడా అనుకూలంగా ఉండటంతో పొలాల్లో నీటి కొరత లేకుండా సాగు జరుగుతోంది. మరోవైపు కృష్ణా పరీవాహక దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం వరి సాగు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు.
నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులు ఇంకా సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదిలోకి నీటి ప్రవాహం పెరిగి ప్రాజెక్టుల్లోకి చేరుతున్నా, అది ఆలస్యంగా రావడంతో ప్రస్తుతం నాట్లకు పూర్తిగా అనుకూల పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు.
50 లక్షల ఎకరాలకు చేరే అవకాశం
వ్యవసాయశాఖ సాధారణ విస్తీర్ణం ప్రకారం రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు 65.96 లక్షల ఎకరాలు. గత ఏడాది ఇదే సమయానికంటే ఈసారి నాట్లు వేగంగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వేగం మరో రెండు నుంచి మూడు వారాలు కొనసాగితే వరి సాగు 50 లక్షల ఎకరాల స్థాయిని చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆగస్టు మొదటి పక్షంలో వరి నాట్లు అత్యంత కీలక దశకు చేరనున్నాయి. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న వేగం కొనసాగడంతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా కృష్ణా జలాలు పూర్తిస్థాయిలో అందితే రాష్ట్రవ్యాప్తంగా వరి సాగు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

పత్తిదే ఇంకా అగ్రస్థానం
వానాకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 92,86,726 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే రెండున్నర లక్షల ఎకరాలు అధికమే. ఇందులో అత్యధికంగా పత్తి 46,89,258 ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత వరి 29,32,884 ఎకరాలు, మొక్కజొన్న 5,01,508 ఎకరాలు, కందులు 4,68,975 ఎకరాలు, సోయాబీన్ 3,68,797 ఎకరాలు, శనగలు 74,671 ఎకరాలు, మినుములు 18,531 ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తం ఆహార ధాన్యాలు 40.24 లక్షల ఎకరాలు, నూనెగింజల పంటలు 3.74 లక్షల ఎకరాలు, వాణిజ్య పంటలు 47.27 లక్షల ఎకరాల్లో నమోదయ్యాయి.


