మద్యం బాటిళ్లకు లేబుళ్ల సరఫరా బాధ్యత 13 ఏళ్లుగా ఒకే సంస్థకు..
తొలి ఐదేళ్లు టెండర్ ప్రకారం.. ఆ తర్వాత ఏటా ‘నామినేషనే’
మూడు సంస్థల కన్సార్షియందే ఇప్పటికీ హవా
పేరుకు పలుమార్లు టెండర్ నోటిఫికేషన్.. ఫైళ్లు ముందుకు.. మళ్లీ వెనక్కి
అవగాహన, ఆమ్యామ్యాలే కారణమనే ఆరోపణలు
తాజాగా 2024లో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్..ఇప్పటికీ ఖరారు కాని వైనం
లేబుళ్ల టెండర్ దక్కించుకునేందుకు కీలక నేత సహకారంతో ఓ మీడియా అధిపతి చేసిన ప్రయత్నాలు విఫలం
బీర్ బాటిళ్లకు లేబుల్స్ సరఫరా చేసే బాధ్యత కూడా ఇవ్వాలని కోరుతున్న పాత కంపెనీ
మద్యం బాటిళ్లకే ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లకు గాను రూ.5 కోట్ల వరకు చెల్లిస్తున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నామినేషన్..ఒకటీ రెండుసార్లు కాదు..ఏకంగా 8 సార్లు. ఇదే పద్ధతిలో ఒకే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన టెండర్ ఒప్పందమే ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా, ప్రభుత్వాలు మారినా సంస్థ (కన్సార్షియం) మాత్రం మారలేదు. రాష్ట్రంలో మద్యం బాటిళ్లపై అతికించే లేబుళ్ల సరఫరా కాంట్రాక్టును అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే సంస్థకు నామినేషన్ పద్ధతిపై కట్టబెడుతున్నారు. హాలోగ్రామ్‌లుగా పిలిచే ఈ లేబుళ్ల సరఫరా బాధ్యతను కొత్త సంస్థకు కట్టబెట్టేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రయత్నాలు జరుగుతున్నా..అవి పేరుకు మాత్రమేనని, లోలోపల ఎప్పటికప్పుడు ‘సర్దుబాట్లు’ కొనసాగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఎన్నిసార్లు సంబంధిత ఫైలు కదిలినా అది కార్యరూపం దాల్చక పోవడం, తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసి రెండేళ్లవుతున్నా పాత సంస్థకే టెండర్ కొనసాగుతుండటం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కాగా ఇదే సంస్థ కొత్తగా మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడానికి కూడా ఈ ‘సర్దుబాటే’ కారణమని, పాత సంస్థను మార్చే హడావుడి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతోందని, ఈ లేబుళ్లకు సంబంధించిన ఏ ఫైలూ ముందుకు కదలడం లేదని ఎక్సైజ్ వర్గాలే అంటుండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు, సదరు సంస్థ ఇచ్చే ఆమ్యామ్యాలు..వెరసి ఈ నామినేషన్ తంతు ఏళ్ల తరబడి కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సదరు సంస్థకు ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లకు గాను రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తుండటం గమనార్హం.
టెండర్ గడువు ఎప్పుడో ముగిసినా..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2013లో యూఫ్లెక్స్, శ్రీటెక్, సీ–టెల్ అనే మూడు సంస్థల కన్సార్షియంకు హాలోగ్రామ్‌ల టెండర్ ఖరారయ్యింది. 2018లోనే ఈ టెండర్ గడువు ముగిసింది. 2013 నుంచి 2018 వరకు ఐదేళ్ల పాటు టెండర్ ప్రకారం లేబుళ్ల సరఫరా జరగ్గా, ఆ తర్వాత నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు గడువును పొడిగిస్తూ వస్తున్నారు. 2018 నుంచి గడువు ముగిసినప్పుడల్లా కొత్త టెండర్ నోటిఫికేషన్ కోసం ఫైలు కదలడం, ప్రభుత్వ పెద్దలతో సదరు కన్సార్షియం ‘అవగాహన’కు రావడం, ఫైలు వెనక్కి తిరిగి రావడం, మళ్లీ అదే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం పరిపాటిగా మారిపోయింది. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం వహించగా, మాజీ ఎంపీ వ్యవహారం నడిపారనే ఆరోపణలున్నాయి.
ఇప్పుడూ అదే తీరు..
‘సర్దుబాటు’ తంతు కొనసాగిందనే విషయం తెలుసుకున్న ప్రస్తుత కీలక మంత్రి అగ్గిమీద గుగ్గిలం అయి వెంటనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అది తాజా ‘సర్దుబాటు’ జరిగే వరకు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి యధాతథమేనని ఎక్సైజ్ వర్గాల సమాచారం. అయితే హాలోగ్రామ్‌ల సరఫరా కోసం తూతూ మంత్రంగా 2024లో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు హాలోగ్రామ్‌లు సరఫరా చేసే ఆసక్తి ఉన్న సంస్థలు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు 23 సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. ఈ బిడ్‌లు దాఖలై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అది ఫైనల్ కాలేదు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటన్నది బహిరంగ రహస్యమేనని అంటున్నారు. ఇదే సమయంలో ఈ మద్యం లేబుళ్ల సరఫరా టెండర్ దక్కించుకునేందుకు తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న ఓ మీడియా అధిపతి ప్రయత్నం చేశాడని సమాచారం. కాగా ప్రస్తుత ప్రభుత్వంలో ఓ కీలక నేత సహకారంతో హాలోగ్రామ్‌ల సరఫరా టెండర్ కోసం ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న సంస్థతోనే ‘సర్దుబాటు’ జరగడంతో ఆ మీడియా అధిపతి తన ప్రయత్నాల నుంచి తప్పుకున్నారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది.
రిజ్వీ విఫల యత్నాలు
ఇదంతా జరుగుతుండగానే అప్పట్లో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రిజ్వీ..ఈ లేబుళ్ల కాంట్రాక్టు ప్రభుత్వ రంగ సంస్థకు కట్టబెట్టాలని యోచించారు. ఈ మేరకు సెక్యూరిటీ సర్టిఫికెట్లు ముద్రించే నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌ను సంప్రదించారు. ఆ సంస్థకు ఉన్న సాంకేతిక నైపుణ్యం, ఎంత ధరకు హాలోగ్రామ్‌లు సరఫరా చేయగలరనే వివరాలను సేకరించారు. ఈ మేరకు నాసిక్ ముద్రణాలయానికి టెండర్‌ను ఇచ్చే ఫైలును కదిలించారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఫైలుకు మోక్షం కలగలేదు. పాత సంస్థ ఆధ్వర్యంలోనే ఇప్పటికీ హాలోగ్రామ్‌లు సరఫరా అవుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే.. ప్రస్తుతం లిక్కర్ (ఐఎంఎల్) బాటిళ్లకు మాత్రమే హాలోగ్రామ్‌లు సరఫరా చేస్తున్న సదరు పాత సంస్థ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. మద్యం సీసాలతో పాటు బీర్ బాటిళ్లకు కూడా తామే హాలోగ్రామ్‌లు ఇస్తామని, అది కూడా నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వంపై ‘అన్ని రకాలుగా’ ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి రేపోమాపో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తొలినాళ్లలోనే అవినీతి మరకలు!
మద్యం సీసా మూతపై అడ్డంగా అతికించి ఉండే లేబుల్‌నే హాలోగ్రామ్ అంటారు. దీన్ని హాలోగ్రాఫిక్ ఎక్సైజ్ అధెసివ్ లేబుల్ (హెచ్‌ఈఏల్ లేబుల్) అని కూడా పిలుస్తారు. తెలంగాణలో ఈ హాలోగ్రామ్‌లను హెడోనిక్ పాత్ ఫైండర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) విధానంలో తయారు చేస్తున్నారు. అంటే ఒక మద్యం బాటిల్‌ను ఏ కంపెనీ తయారు చేసింది? తయారైన బాటిల్ ఏ డిపోకు వచ్చింది? అక్కడి నుంచి ఏ షాప్‌కు వెళ్లింది? ఏ సైజ్‌లో ఉందనే వివరాలు ఈ లేబుల్‌పై ఉంటాయి. ఈ విధానం ద్వారా ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో కూర్చుని రాష్ట్రంలో సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్ పంపిణీ వ్యవస్థను ట్రాక్ చేయవచ్చు. ఈ లేబుల్స్‌ను సరఫరా చేసేందుకు 2013లో (ఉమ్మడి రాష్ట్రంలో) టెండర్ ఖరారు చేశారు. మూడు సంస్థల కన్సార్షియం ఈ టెండర్‌ను దక్కించుకుంది.
వాస్తవానికి అప్పట్లోనే ఈ టెండర్ ఖరారు ప్రక్రియకు అవినీతి మరకలు అంటాయి. ఆ అవినీతి మరకలు తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా కొనసాగుతూనే ఉన్నాయని, పాత సంస్థకే గత ఎనిమిదేళ్లుగా నామినేషన్ పద్ధతిలో టెండర్ కొనసాగిస్తున్నారంటే ఆమ్యామ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో కుదుర్చుకున్న టెండర్ అగ్రిమెంట్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ టెండర్ దక్కించుకున్న కన్సార్షియంలోని మూడు సంస్థలు రెండు రాష్ట్రాల బాధ్యతలను అనధికారికంగా పంచుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లేబుళ్ల సరఫరా బాధ్యతలు యూఫ్లెక్స్ చూస్తుండగా, ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారం, సాఫ్ట్‌వేర్ నిర్వహణను సీ–టెల్ అనే సంస్థ చూస్తున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం 33 పైసలకు పెరిగిన ఒక లేబుల్ రేటు
ప్రస్తుతం ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లను సదరు సంస్థ బేవరేజెస్ కార్పొరేషన్‌కు అందిస్తోంది. టెండర్ దక్కించుకున్న సమయంలో ఒక లేబుల్‌ను 22 పైసలకు సరఫరా చేస్తామని ఒప్పందం కుదరగా, అది క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ప్రతి లేబుల్ సరఫరా రేటు 33 పైసలకు చేరింది. అంటే ప్రతినెలా రూ.5 కోట్లు, సంవత్సరానికి సుమారు రూ.60 కోట్ల విలువైన లేబుళ్లను ఈ సంస్థ సరఫరా చేస్తోందన్నమాట. మరి ఇందులో అసలు ఖర్చయ్యేది ఎంతో.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు, అధికారులకు సమర్పించే ఆమ్యామ్యాలు ఎన్నో అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలీ కాంట్రాక్టును ఇలా నామినేషన్ పద్ధతిన ఇంకెన్ని సంవత్సరాలు పొడిగిస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.


