‘కాంగ్రెస్ పాలనలో ఫేక్ ఎన్‌వోసీలు’ | BRS RS Praveen Kumar Slams Telangana Sarkar | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్ పాలనలో ఫేక్ ఎన్‌వోసీలు’

Aug 5 2026 10:21 PM | Updated on Aug 5 2026 10:21 PM

BRS RS Praveen Kumar Slams Telangana Sarkar
  • రేవంత్ రెడ్డి 18 గంటల రివ్యూలో ఏం చేస్తున్నారు
  • కాలేజీ అనుమతి కోసం హైడ్రా కమీషనర్ సంతకం ఫోర్జరీ
  • అక్రమంగా జూనియర్ కాలేజీలకు అనుమతులు.

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ సొంత శాఖలో అవినీతి జరిగి, ఫోర్జరీ చేసి అక్రమంగా అనుమతులు తీసుకున్నా అధికారులు కనిపెట్టడం లేదని, ముఖ్యమంత్రి 18 గంటల రివ్యూ ఏమైందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి  సొంత విద్యా శాఖలోనే  జూనియర్ కాలేజి యాజమాన్యాలు ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసం హైడ్రా కమీషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి,అక్రమంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల నుండి అనుమతులు పొందారని, పోలీసులు, విద్యాశాఖ అధికారులు మరియు హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరిలో ఫైర్ ఎన్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న జూనియర్ కాలేజీలు హైడ్రా కమీషనర్ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటర్మీడియట్ బోర్డు నుండి అనుమతులు పొందితే అధికారులెవరూ కనిపెట్టలేకపోవడం దారుణమన్నారు. హైడ్రా అధికారులు లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలనలో అధికారులు మరియు కాలేజీ యాజమాన్యాలు అవినీతి అక్రమాలను పెంచి పోసిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ, హోం శాఖ, మరియు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల్లో జరిగే అవినీతిని, ఫోర్జరీలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారన్నారు.

క్షుద్రపూజలు,తాంత్రిక పూజల గురించి స్క్రిప్ట్ రాసిచ్చే బదులు ఫోర్జరీ,అవినీతికి పాల్పడే వారిని దొరకబట్టమని స్క్రిప్ట్ ఇవ్వాలని సూచించారు. ఎంతసేపు పోలీసులు కేసిఆర్ కేటి ఆర్ హరీష్ రావు ఇతర బిఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టారని ఆరా తీయడం కాకుండా,అవినీతి అక్రమ అనుమతులపై చర్యలు తీసుకోమని ఆదేశించాలని హితవు పలికారు.

ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ, సరైన అనుమతులు లేకుండా, కాలేజీలు నిర్వహిస్తే, ఏదైనా ప్రమాదం జరిగి విద్యార్థులకు ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు,హైడ్రా, పోలీసులు మరియు ఫోర్జరీ మరియు అవినీతి అక్రమాల్లో ప్రమేయం ఉన్న అందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఏం చేస్తారో అయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement