రాష్ట్ర కేబినెట్ విస్తరణపై అధిష్టానం దృష్టి
కర్ణాటకలో ఈ ప్రక్రియ ముగియడంతో గాంధీభవన్ వర్గాల్లో చర్చ
ఏ క్షణంలోనైనా హైకమాండ్ నుంచి కబురు!
ఖాళీగా ఉన్న రెండు బెర్తుల భర్తీ.. శాఖల మార్పునకు కూడా చాన్స్
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక తెలంగాణపై దృష్టి పెట్టనుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దడంలో భాగంగా అధికార మార్పిడి, మంత్రివర్గ విస్తరణ ప్రక్రియలు హైకమాండ్ చేపట్టింది. కర్ణాటకలో దశల వారీగా ఈ కార్యక్రమం పూర్తి చేసింది. ఇక రాష్ట్రం వంతే అనే అభిప్రాయం పార్టీవర్గాలు, ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెడతారని, అందులో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ ఫైలుకు ఈ నెలలో కదలిక వస్తుందని అంటున్నారు. అధిష్టానం నుంచి ఏ క్షణమైనా కబురు రావచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
కేబినెట్ బెర్తుపై ఎమ్మెల్యేల ఆశలు
ఈ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. విస్తరణకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావడం, పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్తుపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఎన్నికల మంత్రివర్గం కూర్పుపై అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేయనుంది. అయితే ఇటీవలæ పార్టీ ముఖ్య నేతలు, టీపీసీసీ సమన్వయ కమిటీతో అధిష్టానం భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాలేదు. కానీ కర్ణాటక ఎపిసోడ్ పూర్తయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే తెలంగాణపై హైకమాండ్ దృష్టి పెడుతుందని అంటున్నారు.


