జూన్‌లో వడదెబ్బతో అభ్యర్థి మృతి.. తాజాగా ఆర్టీసీలో జాబ్..
కరీంనగర్ రూరల్: నెల రోజుల క్రితం వడదెబ్బతో మృతిచెందిన యువకుడికి ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం రావడంతో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. కరీంనగర్ జిల్లా దుర్శేడ్‌కు చెందిన ఊర రఘు(33) బొమ్మకల్‌లోని ఓ ప్రైవేట్‌స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. భార్య రజిత, ఇద్దరు కూతుళ్లున్నారు. మూడు నెలలక్రితం ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న రఘు, డ్రైవింగ్ పరీక్షలకు హాజరయ్యాడు. జూన్ 11న మందులపల్లెలో క్రికెట్ ఆడుతూ ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రెండు రోజుల క్రితం ఆర్టీసీ సంస్థ ప్రకటించిన డ్రైవర్ పరీక్ష ఫలితాల్లో రఘు ఉత్తీర్ణత సాధించాడు. బుధవారం ఆర్టీసీ అధికారులు పంపించిన జాబితాను అందుకున్న రజిత ఇద్దరు కూతుళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. రఘు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేయాలని కార్పొరేటర్ భూపతి రవీందర్ కోరారు. రఘు భార్యకు ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు.


