పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లే | Rajya Sabha: Raj Bhushan Choudhary Gives Reply on Polavaram Reservoir | Sakshi
Sakshi News home page

పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లే

Aug 11 2026 5:19 AM | Updated on Aug 11 2026 5:19 AM

Rajya Sabha: Raj Bhushan Choudhary Gives Reply on Polavaram Reservoir

ఆ మేరకు ప్రాజెక్టు పూర్తికి అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరించాం

రాజ్యసభలో ఎంపీ కృష్ణయ్య ప్రశ్నకు జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి సమాధానం

సాక్షి, అమరావతి: పోలవరం రిజర్వాయర్‌ కానే కాదు... బ్యారేజ్‌ మాత్రమేనని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాదు.. కనిష్ట  నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మాత్రమే ఇస్తామని పునరు­ద్ఘాటించింది. ఆ మేరకు ప్రాజెక్టు పూర్తికి 2023 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ కేంద్రం కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్కొంది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తిచేయడానికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. రాజ్యసభలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి ఈ మేరకు సోమవారం సమాధానం ఇచ్చా­రు.

పోలవరం పనుల కోసం గత ఐదేళ్లలో 2021–­22 నుంచి 2025–26 వరకూ రూ.12,620.53 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేశామని చెప్పారు. స్పిల్‌ వేలో మట్టి పనులు 96.87, కాంక్రీట్‌ పనులు 98.84, స్టీల్‌ పనులు 92.95 శాతం.. ఈసీఆర్‌ఎఫ్‌(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం), జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే పనుల్లో మట్టి పనులు 75.76, కాంక్రీట్‌ పనులు 81.99, స్టీల్‌ పనులు 81.31 శాతం– కుడి, ఎడమ కాలువ పనుల్లో మట్టి పనులు 98.96, కాంక్రీట్‌ పనులు 88.44, స్టీల్‌ పనులు 55.68 శాతం పూర్తయ్యాయన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటి నిల్వకు వీలుగా ప్రాజెక్టులో ముంపునకు గుర య్యే గ్రామాల్లో ఇప్పటికే 17,892 నిర్వాసిత కుటుంబాలకు రూ.1,373.01 కోట్లు పరిహారం చెల్లించామని, పునరావాసం కల్పించడానికి రూ.1,581.08 కో ట్లు వ్యయం చేశామన్నారు. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్దేశించిందని, గడువు మరో ఏడాది పొడిగించామన్నారు.

వరదల సమయంలో 1.98 లక్షల ఎకరాలకే .. 
పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు.. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. కనీస నీటిమట్టం 41.15 మీటర్లు.. కనీస నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం నీటి మట్టాన్ని కనీస స్థాయికే పరిమితం చేస్తే.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు అదీ గోదావరి వరద రోజుల్లో మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుందని అధికారులే స్పష్టం చేస్తున్నారు. ఇక కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించడానికి, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లందించటానికి అవకాశమే ఉండదని తేల్చి చెబుతున్నారు.

ఎడమ గట్టుపై 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్‌ కేంద్రంలోనూ గోదావరికి వరద వచ్చే రోజుల్లోనే అరకొరగా విద్యుదుత్పత్తికి అవ కాశం ఉంటుందంటున్నారు. అంటే– పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశారన్నది సుస్పష్టం.   45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.25వేల కోట్లకుపైగా అవసరం. అంటే.. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకతప్పదు.

38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పోలవరాన్ని చేపట్టిన వైఎస్సార్‌...
అదే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు వేగవంతం చేసిన నాటి సీఎం వైఎస్‌ జగన్‌.. 
గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి ఇచి్చన మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), అటవీ పర్యావరణం సహా అన్ని అనుమతులు సాధించి.. 45.72 మీటర్ల గరిష్ట నీటి మట్టం, 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2005లో జలయ/æ్ఞంలో భాగంగా పోలవరం నిర్మాణాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకూ సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు వెరసి 38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పోలవరాన్ని చేపట్టి పనులు వేగవంతం చేశారు. అనంతరం కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్‌ 11 నాటికే 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్‌ వేను వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పూర్తి చేసింది. 

45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు తాజా ధరల మేరకు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. కానీ.. 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌లో పోలవరం నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదిస్తే.. ఆ కేబినెట్‌లో సభ్యుడిగా ఉన్న టీడీపీ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ఇక దానిపై చంద్రబాబు సర్కార్‌ నోరు మెదపలేదు. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రానికి జీవనాడి పోలవరానికి చంద్రబాబు సర్కార్‌ ఉరేసిందంటూ సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement