ఇది రాజకీయశక్తుల కుట్ర! | Political conspiracy against Bharathi Cements: Senior Counsel CV Mohan Reddy Tells AP High Court | Sakshi
Sakshi News home page

ఇది రాజకీయశక్తుల కుట్ర!

Aug 11 2026 4:45 AM | Updated on Aug 11 2026 4:45 AM

Political conspiracy against Bharathi Cements: Senior Counsel CV Mohan Reddy Tells AP High Court

భారతీ సిమెంట్స్‌ సంక్షోభం వెనుక రాజకీయ శక్తుల కుతంత్రాలు

తొలగింపునకు గురైన కార్మీకులను వెనకుండి ఉసిగొల్పుతున్నాయి 

10 మంది వల్ల 1300 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి.. సంస్థ 

కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు.. ఉత్పత్తి నిలిచిపోయింది 

దీంతో కంపెనీకి రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం 

కళ్లెదుటే అంతా జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు 

ఉత్పత్తి సజావుగా సాగేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వండి 

హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి  

అక్కడ అంతా బాగుందన్నప్రభుత్వ న్యాయవాది జయంతి 

వాదనలు విన్న హైకోర్టు.. తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టికరణ  

సాక్షి, అమరావతి: భారతీ సిమెంట్స్‌ సంక్షోభం వెనుక రాజకీయ శక్తులున్నాయని ఆ కంపెనీ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. భారతీ సిమెంట్స్‌ ఉత్పత్తిని ఎలాగైనా ఆపేయాలన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి తొలగింపునకు గురైన కార్మికులను ఉసిగొల్పుతున్నాయని ఆయన వివరించారు. సిమెంట్‌ ఫ్యాకర్టీని నమ్ముకుని 1,300 కుటుంబాలు బతుకుతున్నాయని, ఓ 10 మంది తీరు వల్ల వారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. రాజకీయ శక్తుల కుతంత్రాలతో గత ఐదు రోజులుగా లైమ్‌స్టోన్‌ తవ్వకాలు, సిమెంట్‌ ఉత్పత్తి నిలిచిపోయాయన్నారు.

తద్వారా కంపెనీకి రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన హైకోర్టుకు చెప్పారు. లైమ్‌స్టోన్‌ తవ్వకాల వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చే పరిస్థితులు లేవని, లోపలికి వెళ్లే గేటు ముందు టెంట్‌ వేసి కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా వారే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారతీ సిమెంట్స్‌ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందని, అన్ని అనుమతులు పొంది, అన్ని రకాలు పన్నులు చెల్లిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మోహన్‌రెడ్డి వివరించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

పోలీసులు తమ విధి నిర్వహణలో విఫలయ్యారు..
భారతి సిమెంట్‌ కంపెనీ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాంట్‌ కార్యకలాపాలతో పాటు మైనింగ్‌ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్‌ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్‌ మహేశ్వరరావు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల బాధ్యతన్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అయితే పోలీసులు తమ విధులను నిర్వర్తించడంలో దారుణంగా విఫలయ్యారని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్‌ సైతం మౌనంగా ఉన్నారన్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 350 కుటుంబాలు తాము నిర్మీంచిన క్వార్టర్స్‌లో ఉంటున్నాయన్నారు. వారందరికీ కూడా రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని చెప్పారు. ముడిసరుకు లైమ్‌స్టోన్‌ లోపలికి వెళితే, సిమెంట్‌ బయటకు వస్తుందని, ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ప్లాంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.  

10మంది ఆందోళన చేస్తున్నారు... 
అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళుతున్నాయన్నారు. తొలగింపుకు గురైన 10 మంది ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు.  

అన్నీ సక్రమంగా ఉంటే మేమెందుకు కోర్టుకొస్తాం.. 
ఈ సమయంలో సీవీ మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, అన్నీ సక్రమంగా ఉంటే తామెందుకు కోర్టుకు వస్తామని ప్రశ్నించారు. సక్రమంగా ఉంటే వ్యయప్రయాసల కోర్చి ఈ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేస్తామని, కోర్టును ఎందుకు ఇబ్బంది పెడుతామన్నారు. తొలగింపునకు గురైన కార్మీకుల తరఫున సీనియర్‌ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదులుగా చేరతామని, అందుకు అనుమతించాలని కోరారు.  

సాధారణ ఉద్యోగికి వీరారెడ్డిని పెట్టుకునేంత స్థోమత ఉంటుందా? 
ఇందుకు సీవీ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము తమ వ్యాజ్యంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి అదేశాలు కోరడం లేదన్నారు. ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగికి అమరావతి వరకు వచ్చి వీరారెడ్డి వంటి సీనియర్‌ న్యాయవాదిని పెట్టుకునే స్థోమత ఉందంటే వారి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తీర్పును రిజర్వ్‌ చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement