breaking news
Senior advocate CV Mohan Reddy
-
ఇది రాజకీయశక్తుల కుట్ర!
సాక్షి, అమరావతి: భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తులున్నాయని ఆ కంపెనీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ఎలాగైనా ఆపేయాలన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి తొలగింపునకు గురైన కార్మికులను ఉసిగొల్పుతున్నాయని ఆయన వివరించారు. సిమెంట్ ఫ్యాకర్టీని నమ్ముకుని 1,300 కుటుంబాలు బతుకుతున్నాయని, ఓ 10 మంది తీరు వల్ల వారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. రాజకీయ శక్తుల కుతంత్రాలతో గత ఐదు రోజులుగా లైమ్‌స్టోన్ తవ్వకాలు, సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయాయన్నారు.తద్వారా కంపెనీకి రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన హైకోర్టుకు చెప్పారు. లైమ్‌స్టోన్ తవ్వకాల వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చే పరిస్థితులు లేవని, లోపలికి వెళ్లే గేటు ముందు టెంట్ వేసి కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా వారే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారతీ సిమెంట్స్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందని, అన్ని అనుమతులు పొంది, అన్ని రకాలు పన్నులు చెల్లిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మోహన్‌రెడ్డి వివరించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమ విధి నిర్వహణలో విఫలయ్యారు..భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల బాధ్యతన్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అయితే పోలీసులు తమ విధులను నిర్వర్తించడంలో దారుణంగా విఫలయ్యారని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ సైతం మౌనంగా ఉన్నారన్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 350 కుటుంబాలు తాము నిర్మీంచిన క్వార్టర్స్‌లో ఉంటున్నాయన్నారు. వారందరికీ కూడా రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని చెప్పారు. ముడిసరుకు లైమ్‌స్టోన్ లోపలికి వెళితే, సిమెంట్ బయటకు వస్తుందని, ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. 10మంది ఆందోళన చేస్తున్నారు... అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళుతున్నాయన్నారు. తొలగింపుకు గురైన 10 మంది ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే మేమెందుకు కోర్టుకొస్తాం.. ఈ సమయంలో సీవీ మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, అన్నీ సక్రమంగా ఉంటే తామెందుకు కోర్టుకు వస్తామని ప్రశ్నించారు. సక్రమంగా ఉంటే వ్యయప్రయాసల కోర్చి ఈ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేస్తామని, కోర్టును ఎందుకు ఇబ్బంది పెడుతామన్నారు. తొలగింపునకు గురైన కార్మీకుల తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదులుగా చేరతామని, అందుకు అనుమతించాలని కోరారు. సాధారణ ఉద్యోగికి వీరారెడ్డిని పెట్టుకునేంత స్థోమత ఉంటుందా? ఇందుకు సీవీ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము తమ వ్యాజ్యంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి అదేశాలు కోరడం లేదన్నారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి అమరావతి వరకు వచ్చి వీరారెడ్డి వంటి సీనియర్ న్యాయవాదిని పెట్టుకునే స్థోమత ఉందంటే వారి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తీర్పును రిజర్వ్ చేశారు -
సంప్రదాయమా..? చట్ట నిబంధనలా..?
* పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని ‘హెబియస్’ రూపంలో సవాలు చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ * అయితే ఇది 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయమన్న సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి * దీంతో హెబియస్ కార్పస్ రూపంలోనా.. రిట్ పిటిషన్ రూపంలోనా... అనేది తేల్చాలని హైకోర్టు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఏ వ్యక్తినైనా పోలీసులు ముందస్తు నిర్బంధ చట్టం(పీడీ యాక్ట్) కింద నిర్బంధిస్తే దానిని అక్రమ నిర్బంధంగా పేర్కొంటూ అతన్ని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడం యాభై ఏళ్ల నుంచి హైకోర్టులో వస్తున్న సంప్రదాయం.. పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని సవాలుచేస్తూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడానికి వీల్లేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న సమయంలో జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా మౌఖికంగా జారీచేసిన ఆదేశం.. గత 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న కీలక విషయాన్ని తేల్చాలని హైకోర్టు తాజాగా నిర్ణయించింది. దీనిపై లోతైన విచారణ జరపనున్నట్టు పేర్కొంది. తమ భర్తలను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించి కడప కేంద్ర కారాగారంలో ఉంచారని, వారిని వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ నెల్లూరుకు చెందిన జి.అర్చన, చిత్తూరుకు చెందిన బి.హిమబిందు వేర్వేరుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్లు వేశారు. ఇవి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం విచారణకొచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ల భర్తలైన జి.రామనాథరెడ్డి, నాగేంద్రనాయక్లను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించారని నివేదించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. పీడీ యాక్ట్‌కు సంబంధించిన కేసులను ఇలా హెబియస్ కార్పస్ రూపంలో దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. వాటిని రిట్ పిటిషన్ రూపంలో సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసుకోవాలని, ఇదే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఏజీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. బాంబే హైకోర్టు కూడా ఈ విషయాన్ని చెప్పిందని వ్యాఖ్యానించింది. దీనికి మోహన్‌రెడ్డి అడ్డుచెబుతూ.. గత 50 ఏళ్లుగా ఉమ్మడి హైకోర్టులో పీడీ కేసుల్లో నిర్బంధాన్ని హెబియస్ కార్పస్ రూపంలోనే సవాలు చేస్తూ వస్తున్నామని, అదిక్కడ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. పీడీ కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయకూడదని రాజ్యాంగంలోగానీ, చట్ట నిబంధనల్లోగానీ, సుప్రీంకోర్టు తీర్పుల్లోగానీ ఎక్కడా లేదని, ఏజీకి సైతం ఈ విషయం స్పష్టంగా తెలుసని వివరించారు. సంప్రదాయం కొనసాగుతున్న మాట వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. దీంతో ధర్మాసనం, అయితే సంప్రదాయాన్ని కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న విషయంపై లోతైన విచారణ చేపడతామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా, పరోక్షంగా వెలువరించిన తీర్పులేవైనా ఉంటే, వాటిని తమ ముందుంచాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.


