ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతిపై సీజే ధర్మాసనం అసహనం
ఇలాంటి వాటిని ఎంత మాత్రం సహించేది లేదన్న సీజే ధర్మాసనం
సింగిల్ జడ్జిపై ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టీకరణ
ఆరోపణలు చేస్తే సరిపోదని.. వాటిని నిరూపించి తీరాలన్న ధర్మాసనం
క్షమాపణ చెప్పిన ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది
అప్పీల్‌లో సింగిల్ జడ్జిపై చేసిన ఆరోపణలను తొలగిస్తామని నివేదన
దీనిపై ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రణతికి ధర్మాసనం ఆదేశం
సాక్షి, అమరావతి: న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్‌లో ఉపయోగించిన అభ్యంతరకర పదజాలంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఆరోపణలు చేయడం మాత్రమే కాదని.. వాటిని ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉందని తేల్చి చెప్పింది. దీంతో ప్రణతి తరఫు న్యాయవాది క్షమాపణ చెప్పడంతో పాటు, ఆ వ్యాఖ్యలను అప్పీల్ నుంచి తొలగిస్తామని కోర్టుకు విన్నవించారు.
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి అప్పీల్ దాఖలు చేశారు. ఆ అప్పీల్‌లో సింగిల్ జడ్జిపై అభ్యంతరకరమైన భాష ఉపయోగించారు. ప్రణతి తన అప్పీల్‌లో సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన... ‘అక్రమం, బుర్ర ఉపయోగించకపోవడం, పక్షపాతం, అసందర్భం, అనుచితం, మందబుద్ది, దురుద్దేశాలు’ వంటి పదాలను ధర్మాసనం చదివి వినిపించింది.
పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణ రావు కోర్టును క్షమాపణ కోరారు. అప్పీల్ నుంచి వాటిని తొలగిస్తామని చెప్పారు. అలా అయితే సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన అభ్యంతకర పదజాలాన్ని తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రణతిని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అటు భార్య.. భర్త.. ఇటు ఏసీబీ విచారణ...
కాకినాడలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రజా ప్రయోజనాల నిమిత్తం కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు కొంత భూమిని బహుమానంగా ఇచ్చింది. ఈ భూమి విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతూ హైకోర్టుకొచ్చారు. దీనిపై స్పందించిన కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్, ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతున్న భూమి తమదేనని, దానిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ మాట మార్చింది. ఆ భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది కూడా ఆశ్చర్యకరంగా ఆ భూమిపై తాము జోక్యం చేసుకోమని కోర్టుకు వివరించారు. అయితే దీనిని జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తోసిపుచ్చింది.
ఆ భూముల విషయంలో జోక్యం చేసుకోబోమంటూ కోర్టుకు చెప్పాలని తాము ఎన్నడూ తమ న్యాయవాదికి చెప్పలేదని తెలిపింది. వీటన్నింటితో పాటు ఈ కేసులో గతంలో ప్రైవేటు వ్యక్తుల తరఫున హాజరైన ప్రణతి ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ప్రభుత్వం తరఫున హాజరు కావడం, అలాగే ఆ ప్రైవేటు వ్యక్తుల తరఫున ప్రస్తుతం ప్రణతి భర్త రాహుల్ చౌదరి హాజరుకావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్, పలు అను మానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ గత నెల 28న ఉత్తర్వులిచ్చారు.
ఏసీబీ విచారణపై ధర్మాసనం ముందు ప్రణతి అప్పీల్...
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్‌జీపీ సింగమనేని ప్రణతి గురువారం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల వల్ల తన కెరీర్ తీవ్ర ప్రభావితమవుతుందని, అందువల్ల వాటిని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ప్రణతి తన అప్పీల్‌లో ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్‌పై గత నెల 31న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రణతిపై సింగిల్ జడ్జి వ్యక్తం చేసిన ప్రతికూల అభిప్రా యాలను, అలాగే ఆమెపై ఏసీబీ విచారణను తదుపరి విచారణ వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రణతి సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు...
తాజాగా సోమవారం ప్రణతి దాఖలు చేసిన అప్పీల్ మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్ స్పందిస్తూ, ప్రణతి తన అప్పీల్‌లో సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ ఏ పేరాల్లో వ్యక్తిగత ఆరోపణలున్నాయో చెప్పారు. దీంతో ధర్మాసనం ఆ పేరాలను పరిశీలించింది. అనంతరం వాటిని చదివి వినిపించింది. సింగిల్ జడ్జిను ఉద్దేశించి అప్పీల్‌లో ఉపయోగించిన పదజాలాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వాటిని అప్పీల్ నుంచి తొలగిస్తామని ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు చెప్పడంతో, ఆ మేర అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది.


