కన్నపిల్లలనే చంపిన తల్లి.. అమెరికా ఘోరం వెనుక ఉన్న ఆ ‘మానసిక జబ్బు’ ఏంటి? | The trial of Lindsay Clancy is currently underway in a US court | Sakshi
Sakshi News home page

కన్నపిల్లలనే చంపిన తల్లి.. అమెరికా ఘోరం వెనుక ఉన్న ఆ ‘మానసిక జబ్బు’ ఏంటి?

Aug 12 2026 5:15 AM | Updated on Aug 12 2026 5:15 AM

The trial of Lindsay Clancy is currently underway in a US court

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కేసుగా భావిస్తున్న లిండ్సే క్లాన్సీ (32) హత్య విచారణ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనవరి 2023లో తన ముగ్గురు పిల్లలను (8 నెలల కాలన్, 5 ఏళ్ల కోరా, 3 ఏళ్ల డాసన్) హత్య చేసిన కేసులో క్లాన్సీ కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ కేసు కేవలం ఒక నేర విచారణగా మాత్రమే కాకుండా, ఒక తల్లి పదేపదే సహాయం కోరినప్పటికీ  వైద్యులు ఆమె మానసిక స్థితిని గుర్తించడంలో ఎలా విఫలమైందనే ప్రధాన ప్రశ్నను తెరపైకి తెచ్చింది.

కోర్టు విచారణలో క్లాన్సీకి మద్దతుగా ఆమె మామ క్రిస్టోఫర్ క్లాన్సీ, అలాగే ఆమె బాల్య స్నేహితులు సాక్షాలను వెల్లడించారు. స్కూల్‌ టీచర్‌. పిల్లలను అమితంగా ప్రేమించే ఆదర్శ తల్లి. అయితే, పైకి సాధారణంగా కనిపించినప్పటికీ, క్లాన్సీ గత కొద్దికాలంగా తీవ్ర నిద్రలేమి, తీవ్రమైన ఆందోళన, తిమ్మిరి, ఆత్మహత్య ఆలోచనలతో నరకం అనుభవించినట్లు తెలిసింది. తనకు తాను 'జాంబీ'లా అనిపిస్తోందని ఆమె తన ఫ్యామిలీ థెరపిస్ట్‌ ఎదుట మొరపెట్టుకున్నారు.  

13 రకాల మందులు.. ప్రసవానంతర సైకోసిస్‌ను గుర్తించని వైద్యులు
హత్యలకు ముందు క్లాన్సీ వైద్య సహాయం కోరినప్పటికీ, వైద్యులు ఆమెకు ఏకంగా 13 రకాల మానసిక వైద్య ఔషధాలను (సైకియాట్రిక్ డ్రగ్స్) సూచించారు. క్లాన్సీకి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ అలియా గుడ్‌హార్ట్, డాక్టర్ జెన్నిఫర్ టఫ్ట్స్ కోర్టులో సాక్ష్యమిస్తూ.. తాము క్లాన్సీ ఆరోగ్య సమస్యను తీవ్రంగా పరిగణించలేదని, ఉన్మాద లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో క్లాన్సీ పరిస్థితిని సరిగ్గా గుర్తించడంలో వైద్యులు విఫలమయ్యారని, ఆమెకు అవసరానికి మించి మందులు ఇచ్చి అసలు సమస్యను పక్కదారి పట్టించారని డిఫెన్స్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై క్లాన్సీ కుటుంబం ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది.

వైద్యుల వైఫల్యమేనా?
ప్రసవానంతరం వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలపై ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ నికోల్ కుమి కోర్టుకు వివరిస్తూ.. ప్రసవానంతర కాలంలో తల్లులకు నిద్ర పట్టకపోవడం తీవ్రమైన మానసిక సంక్షోభానికి మొదటి హెచ్చరిక సంకేతం. ప్రసవానంతర సైకోసిస్ బారిన పడిన వ్యక్తులు కొన్ని సమయాల్లో బయటకు సాధారణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ వారి అంతరంగంలో తీవ్రమైన భ్రమలు నడుస్తుంటాయి. ఆమె ఇంట్లోనూ, వైద్యుల ఎదుట తన అనారోగ్య సమస్యల్ని నయం చేయాలని మొరపెట్టుకుంది. కానీ ఆమెకు కేవలం మందులు, సరిదిద్దలేని సలహాలు మాత్రమే లభించాయి’ అని వివరించారు.

కోర్టులో వాదోపవాదాలు
పిల్లల ప్రాణాలు తీసిన అనంతరం క్లాన్సీ తన మణికట్టు, మెడ కోసుకుని రెండో అంతస్తు కిటికీ నుండి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ఆమె నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. పిల్లలను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని, ఆత్మహత్యాయత్నం ఆమె ఉద్దేశపూర్వక చర్యకు నిదర్శనమని ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు.

 తీవ్రమైన ప్రసవానంతర సైకోసిస్ వల్ల క్లాన్సీ వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయారని, కాబట్టి ఆమెను నేరపూరిత బాధ్యురాలిగా పరిగణించలేమని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ విచారణ, మానసిక ఆరోగ్య సంక్షోభం మరియు కొత్త తల్లుల పట్ల వైద్య వ్యవస్థ వ్యవహరించాల్సిన తీరుపై అమెరికా సమాజంలో సరికొత్త చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement