ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. ఎప్పుడు 'నో' చెప్పాలి? | Five Investing Lessons From Warren Buffett | Sakshi
Sakshi News home page

ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. ఎప్పుడు 'నో' చెప్పాలి?

Jun 2 2026 3:11 PM | Updated on Jun 2 2026 3:43 PM

Five Investing Lessons From Warren Buffett

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు ఎవరు? అంటే.. తప్పకుండా దీనికి సమాధానం 'వారెన్ బఫెట్' అనే చెబుతారు. ఆర్ధిక సంక్షోభం సమయంలో కూడా నష్టాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే ఈయన.. ఇప్పటికీ ఎంతోమందికి మార్గదర్శం. ఇన్వెస్టర్‌గా బఫెట్ సాధించిన విజయాల కంటే.. ఎప్పుడు నో చెప్పాలో తెలిస్తే తప్పకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన బలంగా విశ్వసిస్తారు.

తాను పూర్తిగా అర్థం చేసుకోలేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టకూడదని వారెన్ బఫెట్ చెబుతారు. ఈ క్రమశిక్షణే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆయనను నష్టాల నుంచి కాపాడింది.

2008 సెప్టెంబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. దిగ్గజ సంస్థలు సైతం దివాలా అంచుకు చేరుకున్నాయి. ఆ సమయంలో ఏఐజీ, లెహ్మాన్ బ్రదర్స్ సంస్థలు ఆర్థిక సహాయం కోసం బఫెట్‌ను సంప్రదించాయి. అయితే బఫెట్ ఆ సంస్థల ఆర్థిక పరిస్థితిని, వ్యాపార నమూనాను, రిస్కులను పూర్తిగా పరిశీలించిన తరువాత సహాయం చేయడానికి నిరాకరించారు. ఆ తరువాత లెహ్మాన్ బ్రదర్స్ సంస్థ దివాలా తీసింది.

ఒకవేళా బఫెట్ ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఉంటే.. ఆయన కూడా ఆ నష్టాల్లో భాగస్వామి కావాల్సి వచ్చేది. ముందుగానే ఆలోచించి ఇన్వెస్ట్ చేయడానికి నిరాకరించారు. దీన్ని బట్టి చూస్తే  బఫెట్ తీసుకున్న నిర్ణయాలు ఎంత సరైనవో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

బఫెట్ నుంచి పెట్టుబడిదారులు నేర్చుకోవాల్సిన ఐదు పాఠాలు

అర్థం అయ్యే వ్యాపారాల్లోనే పెట్టుబడి పెట్టాలి: ఏ వ్యాపారం ఎలా డబ్బు సంపాదిస్తుందో, దాని భవిష్యత్తు ఏమిటో, దాని రిస్కులు ఏమిటో అర్థం కాకపోతే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టకూడదు. కేవలం ఇతరులు కొనుగోలు చేస్తున్నారని లేదా షేర్ ధర పెరుగుతోందని పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం.

లిక్విడిటీ (నగదు లభ్యత) చాలా ముఖ్యం: కొన్ని కంపెనీలు లాభదాయకంగా కనిపించినా.. తక్షణ అవసరాలకు సరిపడా నగదు లేకపోతే సమస్యల్లో పడవచ్చు. అందువల్ల పెట్టుబడిదారులు కంపెనీ నగదు నిల్వలు, అప్పుల స్థాయి, చెల్లింపుల సామర్థ్యాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.

సంక్షోభంలో ఉంటే జాగ్రత్త అవసరం: కొన్నిసార్లు ఒక కంపెనీ సమస్య మొత్తం రంగానికే వ్యాపిస్తుంది. దీనిని కాంటేజియన్ ఎఫెక్ట్ అంటారు. ఒక కంపెనీ కుప్పకూలితే.. అదే రంగంలోని ఇతర కంపెనీలు కూడా ప్రభావితమవుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం.

నమ్మకం ప్రధానం: ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ప్రజల నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఒకసారి పెట్టుబడిదారులు లేదా వినియోగదారులు నమ్మకం కోల్పోతే ఆ సంస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది. అందువల్ల పారదర్శకత, నిజాయితీ, మంచి యాజమాన్యం ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి.

బలమైన కంపెనీలకే మూలధనం: ఆర్థికంగా బలమైన కంపెనీలు కష్టకాలంలో కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాయి. బ్యాంకులు, పెట్టుబడిదారులు, మార్కెట్ వాటికి సహకరించడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే దీర్ఘకాలికంగా సంపద సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వారెన్ బఫెట్ ప్రకారం.. ప్రతి అవకాశాన్ని అందుకోవడం కంటే, సరైన అవకాశాన్ని మాత్రమే ఎంచుకోవడం పెట్టుబడిలో విజయం సాధించే మార్గం. కొన్నిసార్లు 'నో' అని చెప్పడం కూడా మంచి పెట్టుబడి నిర్ణయమే అవుతుంది. ''స్పష్టత, క్రమశిక్షణ, ప్రాథమిక విశ్లేషణ, సహనం'' ఇవే విజయవంతమైన పెట్టుబడిదారుడి అసలైన ఆయుధాలు.

ఇదీ చదవండి: రూ.72 లక్షల జాబ్ ఆఫర్.. అందుకే రిజెక్ట్ చేసాడు!

Advertisement
 
Advertisement
Advertisement