వెండి ధరలు రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్న వేళ ప్రముఖ ఆర్థిక రచయిత, ఇన్వెస్ట్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి వెండిపై తన అంచనాను వెల్లడించారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాబర్ట్ కియోసాకి తన ఫేస్‌బుక్ పోస్టులో వెండి భవిష్యత్ ధరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఔన్సు వెండి ధర 3 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేశానని, ప్రస్తుతం ధరలు రికార్డు స్థాయిల్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ వెండిని కొనుగోలు చేస్తున్నానని తెలిపారు.
కియోసాకి తన పోస్టులో వెండి సరఫరా, డిమాండ్ మధ్య పెరుగుతున్న అంతరాన్ని ప్రస్తావించారు. ప్రపంచ జనాభాలో దాదాపు 40 శాతాన్ని కలిగి ఉన్న మూడు ప్రభుత్వాలు ఒకే లోహాన్ని భారీగా నిల్వ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ఆభరణాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలు, భద్రత కోసం నిల్వ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వాదనకు ఆయన పోస్టులో ప్రభుత్వాల పేర్లను వెల్లడించలేదు.
బంగారాన్ని ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు నిల్వ చేస్తుంటే.. వెండిలో మాత్రం పారిశ్రామిక వినియోగం భారీగా ఉందని కియోసాకి వివరించారు. స్మార్ట్‌ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, రక్షణ రంగ పరికరాలు సహా అనేక ఉత్పత్తుల్లో వెండి వినియోగమవుతుందని, ఈ వినియోగం కారణంగా అందుబాటులో ఉన్న సరఫరాపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. సరఫరా పరిమితంగా ఉండటం, డిమాండ్ ఏటా పెరుగుతుండటం భవిష్యత్‌లో వెండి ధరలకు మద్దతు ఇవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను 30 ఏళ్లుగా ఈ ధోరణిని గమనిస్తున్నానని కియోసాకి పేర్కొన్నారు. ఔన్సు వెండి ధర 3 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ తర్వాత 13 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కూడా తాను వెండిపై అంచనాలు చెప్పానని, అప్పట్లో చాలామంది తనను విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడు ప్రభుత్వాలు వెండిని నిల్వ చేయడం ద్వారా తాను చెబుతున్న ధోరణిని బలపరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇక వెండి ధర భవిష్యత్‌లో ఔన్స్‌కు 200 డాలర్లకు చేరుతుందంటూ ఈ పోస్టుకు అనుబంధంగా షేర్ చేసిన వీడియోలో వివరించారు.


