రూ.25 లక్షల జీతం.. రూ.50 లక్షలకు పెంపు! అయినా టెన్షన్.. | Techie Salary Doubles To ₹50 Lakh After Layoffs, But Job Security Becomes A Concern, Know Why This Techie Is Still Worried | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షల జీతం.. రూ.50 లక్షలకు పెంపు! అయినా టెన్షన్..

Aug 9 2026 2:10 PM | Updated on Aug 9 2026 3:49 PM

Company Doubles Salary 50 LPA Techie Still Worried Losing Job

భారీ జీతం పెంపు వస్తే ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఓ టెక్ ఉద్యోగికి మాత్రం 100 శాతం జీతం పెరిగినా సంతోషం కంటే ఉద్యోగ భద్రతపై భయమే ఎక్కువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ‘ఎక్స్‌’ పోస్టు ప్రకారం.. ఓ ఉద్యోగి వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెరిగింది. అయితే, ఈ పెంపు కంపెనీలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుల తర్వాత రావడం చర్చనీయాంశంగా మారింది.

వైరల్ పోస్టు ప్రకారం.. కంపెనీలో సాధారణంగా జూన్‌లో ఉద్యోగుల పనితీరు మదింపు, జీతాల పెంపు ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొత్తం 150 మంది ఉద్యోగుల్లో 50 మందిని కంపెనీ తొలగించినట్లు పోస్టులో పేర్కొన్నారు. దీంతో మిగిలిన ఉద్యోగులు తమకు ఇంక ఎలాంటి జీతాల పెంపు ఉండదని భావించారట. ‘‘కనీసం ఉద్యోగం మిగిలింది.. అదే చాలు’’ అనే పరిస్థితికి వచ్చారని పోస్టు పేర్కొంది.

అయితే, అదే సమయంలో ఓ ఉద్యోగికి మాత్రం ఊహించని ఈమెయిల్ వచ్చింది. ప్రమోషన్‌తో పాటు ఏకంగా 100 శాతం జీతం పెంపు ప్రకటించినట్లు పోస్టులో ఉంది. దీంతో అతని వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది.

ఈ భారీ పెంపునకు కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఉద్యోగి వారాంతంలో స్వయంగా రూపొందించిన ఓ చిన్న AI చాట్‌బాట్ ఆ సంస్థకు గణనీయమైన విలువను తీసుకొచ్చినట్లు వైరల్ పోస్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అతని సామర్థ్యాన్ని కంపెనీ గుర్తించి భారీగా పరిహారం పెంచినట్లు చెబుతోంది. అయితే, మేనేజర్ ఈ పెంపు సంస్థలోనే అత్యధికమైన వాటిలో ఒకటని చెప్పడంతో పాటు, తన జీతం గురించి ఇతర ఉద్యోగులతో మాట్లాడవద్దని సూచించినట్లు పోస్టులో ఉంది.

అయితే ఇక్కడే ఉద్యోగికి ఆందోళన మొదలైంది. ఇప్పటికే కంపెనీ 50 మందిని తొలగించిన పరిస్థితిలో తన జీతం రెట్టింపు కావడం భవిష్యత్తులో తన ఉద్యోగానికి ప్రమాదంగా మారుతుందా? మరోసారి తొలగింపులు జరిగితే అధిక ప్యాకేజీ కారణంగా కొత్త ఉద్యోగం దొరకడం కష్టమవుతుందా? అనే సందేహాలు అతడిని వెంటాడుతున్నట్లు పోస్టు తెలిపింది.

ముఖ్యంగా సిస్టమ్ డిజైన్ వంటి అంశాల్లో తనకు నైపుణ్యం ఉన్నప్పటికీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ (DSA) అంటే తనకు ఇష్టం లేదని, అదే సమయంలో రూ.50 లక్షల ప్యాకేజీ స్థాయి ఉద్యోగాలకు మారాలంటే ఇంటర్వ్యూల్లో డీఎస్‌ఏ నైపుణ్యాలు అవసరమవుతాయా అనే ఆందోళన కూడా అతడికి ఉందట.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగి ప్రస్తుత కంపెనీని వదిలి వెళ్లాలని అసలు కోరుకోవడం లేదు. తన మేనేజర్ అద్భుతమైన వ్యక్తి అని, మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌తో పాటు తన ఉద్యోగాన్ని నిజంగా ఇష్టపడుతున్నానని చెప్పినట్లు పోస్టులో ఉంది. అందుకే అతని అసలు ప్రశ్న ‘ఇప్పుడే ఉద్యోగం మారాలా?’ అనేది కాదు.. ‘రేపు ఉద్యోగం పోతే మరో అవకాశానికి నేను సిద్ధంగా ఉన్నానా?’ అనేదే.

ఈ కథనంపై సోషల్ మీడియాలోనూ భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంపును గొప్ప అవకాశంగా అభివర్ణించగా, మరికొందరు ఉద్యోగ భద్రత, నైపుణ్యాల అప్‌డేట్, అత్యవసర పొదుపులపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇదిలా ఉంటే, 2026లో టెక్ ఉద్యోగ మార్కెట్‌లో అధిక వేతనాలపై ఆకర్షణతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రూ.25 లక్షల ఉద్యోగాన్ని వదిలి విదేశాల్లో మాస్టర్స్ చేసిన ఓ భారతీయ టెకీ.. తిరిగి వచ్చాక వందలాది దరఖాస్తులు చేసినా కేవలం కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే వచ్చాయని, రూ.40–50 లక్షల ప్యాకేజీ ఆశించిన చోట రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్లు మాత్రమే లభించాయని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement