గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా సంస్థకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు చెందిన డిజిటల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ‘బ్లింక్ డిజిటల్’ దాఖలు చేసిన దావాలో తనపై విచారణ జరిపే పరిధి భారత కోర్టులకు లేదంటూ మెటా వేసిన మధ్యంతర దరఖాస్తును హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణ భారతీయ న్యాయస్థానాల పరిధిలోనికే వస్తుందని స్పష్టం చేస్తూ బ్లింక్ డిజిటల్ కోరిన తాత్కాలిక ఉపశమనంపై విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
వివాదం నేపథ్యం
బ్లింక్ డిజిటల్ వ్యాపార ప్రకటనల ఖాతాలను (యాడ్ అకౌంట్స్) మెటా ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఉన్నపళంగా రద్దు చేయడంతో ఈ వివాదం మొదలైంది. దీనివల్ల తమ క్లయింట్ల ప్రకటనలు నిలిచిపోయి తీవ్ర ఆర్థిక, వ్యాపార నష్టం వాటిల్లిందని ఏజెన్సీ పేర్కొంది. ఖాతాలను పునరుద్ధరించాలని కోరడంతో పాటు నిలిచిపోయిన సేవల కారణంగా కలిగిన నష్టానికిగానూ మెటా నుంచి రూ.1,158 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని బ్లింక్ డిజిటల్ దావా వేసింది.
పరిధి సవాల్‌ను తోసిపుచ్చిన కోర్టు
ఈ విచారణ సమయంలో మెటా యాజమాన్యం తమ యూజర్ నిబంధనల ప్రకారం వివాదాలు అమెరికాలోని (కాలిఫోర్నియా) న్యాయస్థానాల పరిధిలోనే తేలాలని, భారత కోర్టులకు ఈ దావాపై విచారణ పరిధి లేదని(జురిస్‌డిక్షన్) వాదించింది. అయితే, భారతదేశంలో భారీగా వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ టెక్ కంపెనీలు స్థానిక వ్యాపారాలకు ముందస్తు సమాచారం లేకుండా సేవలు నిలిపివేస్తే, ఇక్కడి కోర్టులను ఆశ్రయించే హక్కు బాధితులకు ఉంటుందని బ్లింక్ డిజిటల్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న బాంబే హైకోర్టు, మెటా వేసిన జురిస్‌డిక్షన్ సవాలు పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు పరిధి అంశంపై స్పష్టత రావడంతో ఇప్పుడు బ్లింక్ డిజిటల్ అకౌంట్ల పునరుద్ధరణ, తాత్కాలిక ఉపశమనానికి సంబంధించిన ప్రధాన పిటిషన్‌పై నవంబర్ 2న హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరపనుంది.
ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. బంగారం ధరల దడ


