సోషల్ మీడియా దిగ్గజాల మధ్య పోటీ మరో మలుపు తిరిగింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా.. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ప్రకటనలపై ఆంక్షలు విధించింది. అమెరికా, కెనడా, ఈజిప్ట్, ఇండోనేషియా, జపాన్, థాయ్‌లాండ్, వియత్నాం సహా ఏడు దేశాల్లో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ పరిణామం డిజిటల్ ప్రకటనల రంగంలో పోటీ ఏ స్థాయికి చేరిందో స్పష్టం చేస్తోంది.
ప్రచార వేదిక ఎందుకు?
మెటా తెలిపిన వివరాల ప్రకారం.. బైట్‌డ్యాన్స్ నేరుగా ఇచ్చే ప్రకటనలతోపాటు, టిక్‌టాక్ లేదా ఇతర బైట్‌డ్యాన్స్ సర్వీసుల్లోకి యూజర్లను తిప్పుకునే థర్డ్‌పార్టీ ప్రకటనలపైనా నిషేధం వర్తిస్తుంది. ప్రత్యర్థి సంస్థలకు తమ వేదికలపై ప్రచార సేవలు అందించాల్సిన అవసరం లేదన్నది మెటా వాదన. తమ యాప్‌ల నుంచి వినియోగదారులను మళ్లించే పోటీదారుకు ప్రకటనల ద్వారా సహకరించబోమని స్పష్టం చేసింది. ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల అనుభవం ఆధారంగా పోటీపడతామని పేర్కొంది.
భద్రతా అంశమూ కీలకమే!
ఈ నిర్ణయం కేవలం వ్యాపార ప్రయోజనాలకే పరిమితం కాలేదు. సామాజిక మాధ్యమాల్లో యువత భద్రతపై పెరుగుతున్న ఒత్తిడీ దీనికి కారణమైంది. అమెరికాలో రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా మైనర్లు సోషల్ మీడియా వినియోగంపై సమయ పరిమితులు, రాత్రివేళ యాప్‌ల వినియోగ నియంత్రణలు వంటి చర్యలకు మెటా అంగీకరించింది. టిక్‌టాక్, యూట్యూబ్ కూడా ఇలాంటి చర్యలు చేపట్టాలని మెటా కోరుతోంది. ఇదిలా ఉండగా, టిక్‌టాక్ కూడా తన ప్లాట్‌ఫామ్స్‌ల్లో ఇతర సామాజిక మాధ్యమాల లింకులపై పరిమితులు విధించినట్లు సమాచారం. మెటా చేపట్టిన తాజా చర్యపై టిక్‌టాక్, బైట్‌డ్యాన్స్ నుంచి తక్షణ స్పందన వెలువడలేదు.
ఇదీ చదవండి: గిఫ్ట్ ఇస్తే వైద్యులు మందులు మారుస్తారా?


