ఔషధ కంపెనీలు అందించే బహుమతులు, నగదు ప్రయోజనాలు, ఆతిథ్యం వంటి ప్రోత్సాహకాలు వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లను ప్రభావితం చేస్తున్నాయా? ఇటువంటి అనైతిక మార్కెటింగ్ పద్ధతులను నియంత్రించేందుకు మరింత సమర్థవంతమైన చట్టబద్ధ వ్యవస్థ అవసరమా? అనే కీలక ప్రశ్నలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.
వైద్యుల స్వతంత్ర నిర్ణయాలపై ప్రభావం
ఫార్మా సంస్థల మార్కెటింగ్ విధానాలు ప్రజారోగ్యం, ఔషధాల ధరలు, వైద్యుల స్వతంత్ర నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ సుప్రీంకోర్టు వైద్యుల ప్రిస్క్రిప్షన్లు ఫార్మా కంపెనీల నుంచి లభించే ప్రయోజనాలతో ప్రభావితమయ్యే అవకాశాన్ని ఎత్తి చూపింది. ఇది తీవ్రమైన ప్రజా ప్రయోజన సమస్యగా పేర్కొంది. ఇలాంటి ప్రయోజనాల వ్యయం చివరికి ఔషధ ధరల్లోకి చేరి రోగులపై భారం పెంచే ప్రమాదం ఉందని కూడా కోర్టు రికార్డుల్లో ప్రస్తావించింది.
యూసీపీఎంపీకి చట్టబద్ధతపై చర్చ
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యూనిఫాం కోడ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (యూసీపీఎంపీ), 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఔషధ కంపెనీలు వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు బహుమతులు, నగదు ప్రయోజనాలు, ఆతిథ్యం అందించడాన్ని నిషేధించింది. ఫార్మా కంపెనీలు తమ ఉద్యోగులు, మెడికల్ రిప్రజెంటేటివ్‌ల చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉల్లంఘనలపై ఫిర్యాదుల స్వీకరణ, విచారణ కూడా ఉంటుంది.
అయితే యూసీపీఎంపీ ప్రస్తుతం మార్గదర్శకాల ఆధారిత వ్యవస్థగానే ఉంది. దీనికి చట్టబద్ధత తేవాలనే చర్చ సాగుతోంది. కొత్త కమిటీ పరిశీలన ద్వారా నియంత్రణలో ఉన్న లోపాలు, అమలు సామర్థ్యం, బాధ్యత నిర్ధారణ వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: తులం బంగారం కొంటే ఎంత ఖర్చు? నేటి గోల్డ్ రేట్లు!


