ఓల్డ్‌ మంక్‌కు భారీ షాక్‌.. వందల కోట్ల నష్టం | Rum Label Row: Old Monk Faces 500 Crore Rupees Setback | Sakshi
Sakshi News home page

ఓల్డ్‌ మంక్‌కు భారీ షాక్‌.. వందల కోట్ల నష్టం

Oct 13 2026 7:37 AM | Updated on Oct 13 2026 7:45 AM

Rum Label Row: Old Monk Faces 500 Crore Rupees Setback

మందుబాబుల్లో ఎంతో క్రేజ్‌ ఉన్న ఓల్డ్‌ మంక్‌ రమ్‌ ఇప్పుడు భారీ చిక్కుల్లో పడింది. దశాబ్దాలుగా భారతీయ మద్యం ప్రియులకు సుపరిచితమైన ఈ బ్రాండ్‌ లేబుల్‌పై వివాదం తలెత్తింది. ఉత్పత్తిని ‘రమ్‌’ అని కాకుండా ‘రమ్‌ తరహా మద్యం’ (Rum-like) అని పేర్కొనాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ–FSSAI) పట్టుబడుతోంది. ఈ మార్పునకు అంగీకరిస్తేనే అమ్మకాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

అయితే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్పులపై ఓల్డ్‌ మంక్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అలా చేయడం మూలంగా తయారీ సంస్థకు ఈ మధ్యకాలంలోనే రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.350 కోట్ల ఎక్సైజ్‌ ఆదాయం కోల్పోయిందని సంస్థ తరఫు న్యాయవాది బాంబే హైకోర్టుకు తాజాగా నివేదించారు. అంతేకాదు సుమారు 300 మంది కార్మికులకు జీవనోపాధి దూరమైందని వాదించారు.

అసలు వివాదం ఏమిటి?
రమ్‌ తయారీలో ఉపయోగించే ఆల్కహాల్‌ స్వరూపం, అదనంగా కలిపే ఫ్లేవర్లు, లేబులింగ్‌ నిబంధనలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో ఓల్డ్‌ మంక్‌ వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా ఉత్పత్తిని ‘రమ్‌’గా పిలవొచ్చా, ‘రమ్‌ లైక్‌’ అని పేర్కొనాలా అన్నదే ఇప్పుడు అసలు సమస్య. ఈ వివాదం కారణంగా.. ఓల్డ్‌ మంక్‌ తయారీ సంస్థ మోహన్‌ రాకీ స్ప్రింగ్‌వాటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ థానే జిల్లాలోని యూనిట్‌ నుంచి మహారాష్ట్రలో అమ్మకాలు కొనసాగించలేకపోతోంది. అందుకే ఈ ఆంక్షలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభిప్రాయం ప్రకారం.. రమ్‌ రుచిని అందించే కృత్రిమ/ప్రకృతిలో లభించే పదార్థాలకు సమానమైన ఫ్లేవర్లను జోడించిన మద్యాన్ని సాధారణ రమ్‌గా విక్రయించకూడదు. అలా చేయడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉత్పత్తి స్వభావాన్ని లేబుల్‌పై స్పష్టంగా పేర్కొనాలని నియంత్రణ సంస్థ వాదిస్తోంది. మరోవైపు, లేబుల్‌లో మార్పులు చేసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ తమ ప్రతిపాదనలకు ఆమోదం లభించలేదని కంపెనీ చెబుతోంది.

ఏడేళ్ల రమ్‌.. లేబుల్‌పైనా అభ్యంతరాలు!
ఓల్డ్‌ మంక్‌ లేబుళ్లపై ఉన్న ఏడేళ్ల కాలపు (7 years old blended), very old vatted వంటి పదాలపైనా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేబులింగ్‌ లేదని పేర్కొంది. దీంతో తయారీ సంస్థ వివాదాస్పద వయసు సూచనలను తొలగించి, ఉత్పత్తిలో అదనంగా ఫ్లేవర్‌ కలిపిన విషయాన్ని స్పష్టంగా చూపించేలా కొత్త లేబుళ్లను సమర్పించేందుకు అంగీకరించింది.

అయితే, సవరించిన లేబుళ్లకు కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి లభించకపోవడంతో వివాదం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో కేసును తుది విచారణకు స్వీకరించాలని కంపెనీ బాంబే హైకోర్టును కోరింది. తక్షణ ఉపశమనం కల్పించాలని కోరినా దక్కలేదు. చీఫ్‌ జస్టిస్‌ ఎంసీ త్రిపాఠి, న్యాయమూర్తి అద్వైత్‌ సేథ్నా ధర్మాసనం అక్టోబర్‌ 23న తుది విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

ఓల్డ్‌ మంక్‌ ఎలా పుట్టింది?
ఓల్డ్‌ మంక్‌ చరిత్రకు 1855లోనే బీజం పడింది. బ్రిటిష్‌ వ్యాపారవేత్త ఎడ్వర్డ్‌ డయ్యర్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో బ్రూవరీని ఏర్పాటు చేశారు. కొంతకాలానికి హెచ్‌జీ మెకిన్‌ సంస్థతో కలిసి డయ్యర్‌ మెకిన్‌ అండ్‌ కో.గా వ్యాపారాన్ని విస్తరించారు. 1935లో బర్మా బ్రిటిష్‌ ఇండియా నుంచి విడిపోయిన నేపథ్యంలో సంస్థ పేరు డయ్యర్‌ మెకిన్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌గా మారింది.

తర్వాత భారతీయ పారిశ్రామికవేత్త కపిల్‌ మోహన్‌ నేతృత్వంలో సంస్థ యాజమాన్యం మారింది. 1966–1980 మధ్య మోహన్‌ మెకిన్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌గా కొనసాగిన సంస్థ.. అనంతరం మోహన్‌ మెకిన్‌ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ఈ సంస్థ నుంచే భారతీయ మద్యం మార్కెట్లో ఓల్డ్‌ మంక్‌ బ్రాండ్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 1954లో మార్కెట్లోకి వచ్చిన ఓల్డ్‌ మంక్‌.. తన ప్రత్యేకమైన డార్క్‌ రమ్‌ రుచి, గుర్తుపట్టగలిగే సీసా రూపంతో క్రమంగా అభిమానులను సంపాదించుకుంది. భారీ ప్రకటనల కంటే వినియోగదారుల ఆదరణతోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బ్రాండ్‌గా నిలిచింది.

ప్రత్యేక అభిమానులు
ఓల్డ్‌ మంక్‌ ప్రత్యేకతల్లో ప్రధానమైనది దాని మార్కెటింగ్‌ విధానం. భారీ ప్రకటనల ప్రచారంపై ఆధారపడకుండా, వినియోగదారుల నోటి మాట ద్వారానే బ్రాండ్‌ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా భారత సాయుధ దళాల క్యాంటీన్లలో దీనికి లభించిన ఆదరణ బ్రాండ్‌ ఎదుగుదలకు తోడ్పడింది. ఒక తరం నుంచి మరో తరానికి పరిచయమవుతూ వచ్చిన ఈ బ్రాండ్‌.. పాత స్నేహాలు, కాలేజీ రోజులు, సైనికుల జ్ఞాపకాలతో ముడిపడిపోయింది. విలక్షణమైన సీసా, స్థిరమైన రుచి, అందుబాటు ధరలు కూడా దాని అభిమాన వర్గాన్ని పెంచాయి. విదేశీ బ్రాండ్ల ప్రవేశం, మారుతున్న వినియోగదారుల అభిరుచుల మధ్య పోటీ పెరిగినా ఓల్డ్‌ మంక్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంది.

మరి ఇప్పుడో..?
ఒకప్పుడు రమ్‌ అంటే ఓల్డ్‌ మంక్‌ అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్‌.. కాలక్రమంలో మారుతున్న వినియోగదారుల అభిరుచులు, విస్కీ–బీర్‌ వంటి పానీయాల పోటీ, దూకుడైన మార్కెటింగ్‌లో వెనుకబడటం, పంపిణీ సమస్యలతో తన మార్కెట్‌ ఆధిపత్యాన్ని కోల్పోయింది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో మళ్లీ అమ్మకాలు పుంజుకోవడం, కొత్త రుచులతో మార్కెట్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

అయితే ప్రస్తుతం వివాదం మహారాష్ట్రలో అమ్మకాలకే పరిమితమైందని తయారీ సంస్థ చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి అమ్మకాలు కొనసాగుతున్నాయని కోర్టుకు తెలిపింది. అయితే, లేబుల్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరాలు, కంపెనీ ప్రతిపాదనలు, వాటిపై న్యాయస్థానం తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో కీలకం కానున్నాయి. మొత్తానికి, ఏడు దశాబ్దాల చరిత్ర ఉన్న ఓల్డ్‌ మంక్‌కు ఇప్పుడు రుచి, అభిమానుల ఆదరణతో కాకుండా.. ఉత్పత్తి స్వరూపం, లేబులింగ్‌ నిబంధనలతో ముడిపడిన న్యాయపరమైన సవాలు ఎదురవుతోంది. మహారాష్ట్రలో అమ్మకాలు ఎప్పుడు పునరుద్ధరిస్తారు? కంపెనీ లేబుల్‌ మార్చాల్సి వస్తుందా? లేదంటే న్యాయస్థానం మరో మార్గం చూపుతుందా? అన్నది తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి: అది వేరే టాపిక్‌.. నాకేం సంబంధం?: సీజేఐ సూర్యకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement