breaking news
Old Monk
-
రా 'రమ్మ'oటే పోతున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : 'ఓల్డ్ మాంక్ రమ్' పేరు వినగానే గ'మ్మత్తు'గా ఒళ్లు పులకరించిపోతుందీ మందుబాబులకు. భారత సైనికాధికారుల నుంచి వీధిలోని సామన్యుడి వరకు తారతమ్యం లేకుండా తెగ తాగిన బ్రాండ్ ఓల్డ్ మాంక్. కొందరు ముద్దుగా 'వృద్ధ సన్యాసి' అని పిలుచుకునేవారు. రా 'రమ్మ'oటూ పిలుస్తే రానా? అని మహాకవి శ్రీశ్రీ తనదైన శైలిలో ఫన్ చేశారు. ఓల్డ్ మాంక్ ప్రేమికులకు, అభిమానులకు ఫేస్బుక్లో ఏకంగా ఓ పేజీ ఉందంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఆ పేజీ పేరు 'కామ్రేడ్స్'. అంటే, కౌన్సిల్ ఆఫ్ ఓల్డ్ మాంక్ రమ్ ఆడిక్టెట్ డ్రింకర్స్ అండ్ ఎక్సెట్రిక్స్. గజియాబాద్ ప్రధాన కార్యాలయంగా ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ మేకిన్ దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ తన పూర్వవైభవాన్ని కోల్పోతూ క్రమక్రమంగా మార్కెట్లో తన విక్రయ వాటాను కోల్పోతూ వస్తోంది. యూరోమనిటర్ సంస్థ అంచనాల ప్రకారం 2005 నుంచి ఇప్పటి వరకు ఈ బ్రాండ్ మార్కెట్ పది శాతం పడిపోగా, ప్రస్తుతం రమ్ మార్కెట్లో ఐదు శాతానికి పరిమితం అయింది. రమ్ విధేయులు దీనికి దూరమవడం, విదేశీ బ్రాండ్ల కోసం ఎగబ్రాకడం వల్ల ఓల్డ్ మాంక్ అమ్మకాలు పడిపోలేదు. దేశవ్యాప్తంగా రమ్ము తాగేవారి సంఖ్య తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో ఇతర మద్యాల అమ్మకాలు సరాసరి సగటున ఏటా ఆరు శాతం పెరుగుతుండగా, బీర్లు ఎనిమిది శాతం పెరుగుతుండగా, రమ్ము మార్కెట్ ఏటా 0. 2 శాతం తగ్గుతూ వస్తోంది. 2014లో రమ్ మార్కెట్ 38.70 కోట్ల లీటర్లు ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అంతకుముందు సంవత్సరం అమ్ముడుపోయిన సరకు కన్నా ఇది 1.5 శాతం తక్కువ. అప్పటి నుంచి మార్కెట్లో ప్రతికూల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 2019 వరకు ఈ ప్రతికూల ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేశాయి. అప్పటి వరకు ఓల్డ్ మాంక్ బ్రాండ్ మార్కెట్లో బతకడం కష్టమని మార్కెట్ వర్గాలు భావించాయి. ఈ లోగా అనారోగ్యంతో బాధ పడుతున్న బ్రాండ్ యజమాని మోహన్ మేకిన్ మరణించడం మరో దెబ్బ. భారత్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాదాయ వర్గాలే ఎక్కువగా ఓల్డ్ మాంక్‌ను ప్రేమించేవారు. ఈలోగా మార్కెట్లోకి జానీ వాకర్, బ్లెండర్స్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ, రాయల్ స్టాగ్ లాంటి ఆకర్షణీయమైన బ్రాండులు రావడం, మధ్యాదాయ వర్గాల ఆదాయం కూడా పెరగడం వల్ల వారు ఈ విస్కీ బ్రాండుల వైపు మొగ్గు చూపారని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది కొంత వరకు మాత్రమే నిజం కావచ్చు. ఎందుకంటే 24 ఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన యునైటెడ్ స్పిరిట్స్ ఆధ్వర్యంలోని మ్యాక్‌డొవెల్ రమ్ ఏటా 5 శాతం వద్ధిని సాధిస్తూ.. రమ్ మార్కెట్లో 40 శాతాన్ని ఆక్రమించుకుంది. ఓల్డ్ మాంక్ కన్నా 20 శాతం తక్కువ ధరకే బ్రాండ్‌ను విక్రయించడం వివిధ క్యాటగిరీల్లో విక్రయించడం వల్ల మ్యాక్‌డొవెల్ విజయం సాధించిందని చెప్పవచ్చు. మధ్యలో ప్రస్తుత బ్రాండ్‌ను వదిలేసి ప్రీమియం బ్రాండ్‌కు వెళ్లడం వల్ల ఓల్డ్మాంక్కు నష్టం జరిగిందనే వారూ ఉన్నారు. ఏదేమైనా భారత ప్రభుత్వ సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వాటాలు ఉండడం వల్ల మళ్లీ కోలుకుంటుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. -
‘ఓల్డ్ మంక్’ మోహన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ లిక్కర్ వ్యాపారి కపిల్ మోహన్ ఇక లేరు. గుండెపోటుతో శనివారం ఆయన మృతి చెందగా.. ఆ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లోని మోహన్ నగర్ లోని ఇంట్లో ఆయన మృతి చెందినట్లు సమాచారం. మోహన్ మేకిన్ లిమిటెడ్ పేరుతో 1954లో ఓల్డ్ మాంక్ రమ్ సంస్థను ఆయన నెలకొల్పారు. ఓల్డ్ మాంక్‌తో పాటు సోలాన్ నెం.1, గోల్డెన్ ఈగల్ వంటి మరో రెండు బ్రాండులను కూడా ఆయన సృష్టించారు. ‘డార్క్ రమ్’గా ఓల్డ్ మంక్ అమ్మకాలు కొన్నేళ్లపాటు జోరుగా సాగాయి. స్వతహాగా ఎలాంటి మద్యం తీసుకోని కపిల్ మోహన్ లిక్కర్ కింగ్‌గా ప్రాచుర్యం పొందినప్పటికీ.. చక్కెర, వస్త్ర పరిశ్రమలను కూడా విజయవంతంగా ముందుకు నడిపించారు. వ్యాపార రంగంలో మోహన్ కృషికి గాను కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన అనారోగ్యం బారిన పడటంతో వ్యాపారాన్ని బంధవులకు అప్పగించేశారు. గత కొంత కాలంగా ఓల్డ్ మంక్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కంపెనీ చరిత్ర... ఎడ్వర్డ్ డయ్యర్ 1855లో కసౌలిలో తన పేరు మీద బ్రెవెరీ సంస్థను ఏర్పాటు చేశారు. కొంత కాలం తర్వాత మరో లిక్కర్ సంస్థ హెచ్‌జీ మెకిన్తో చేతులు కలిపి డయ్యర్ మెకిన్ అండ్ కో. లిమిటెడ్‌గా దేశవ్యాప్తంగా వ్యాపారం చేయటం ప్రారంభించాయి. 1935లో బర్మా ఉప ఖండం నుంచి విడిపోగా.. డయ్యర్ మెకిన్ బ్రెవెరిస్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. కపిల్ మోహన్ ఆ కంపెనీని హస్తగతం చేసుకున్నాక అది మోహన్ మోకిన్ బ్రేవరీస్ లిమిటెడ్(1966-80 మధ్య)గా మారిపోయింది. ఆ తర్వాత కొంత కాలానికే దాని పేరు మోహన్ మెకిన్ లిమిటెడ్‌గా మార్చేశారు. Legendary Entrepreneur, Chairman and MD of Mohan Meakin Ltd, Padmashree Brig. Dr. Kapil Mohan VSM (Rtd) passes away at Mohan Nagar. He was the man behind the success of famous brands like Old Monk, Solan No. 1, Golden Eagle! Rest in peace. Deepest condolences to the family! pic.twitter.com/Bzpox1DZzP — Pulkit Malhotra (@malhotrapulkit4) 7 January 2018