లైంగికదాడి బాధితులను తప్పుపట్టే ధోరణి వద్దు! | Stop victim-shaming in gender violence cases | Sakshi
Sakshi News home page

లైంగికదాడి బాధితులను తప్పుపట్టే ధోరణి వద్దు!

Oct 28 2026 6:38 AM | Updated on Oct 28 2026 6:38 AM

Stop victim-shaming in gender violence cases

పోలీసు అధికారుల్లో సున్నితత్వం పెంచాలి

ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను పటిష్టం చేయాలి 

కేంద్రంలోని పది శాఖలు, రాష్ట్రాల సీఎస్‌లకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ మార్గదర్శకాలు 

రెండు నెలల్లో అమలుపై నివేదికలు సమరి్పంచాలని సూచన

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయించే లైంగిక దాడి బాధితులతో సున్నితంగా మెలిగేలా పోలీసులకు అవగాహన కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సూచించింది. బాధితులనుద్దేశిస్తూ నైతిక తీర్పులు ఇవ్వడం, బాధితులనే తప్పుపట్టడం వంటి ధోరణులకు స్వస్తి చెప్పాలని, వారితో సానుభూతితో వ్యవహరించాలని కోరింది. ఈ మేరకు పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించడంతోపాటు, ప్రామాణిక నిబంధనలను రూపొందించాలంది. మహిళలపై నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పెట్రోలింగ్‌ నిర్వహించాలని కోరింది. 

పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ నెల 23వ తేదీన ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. మహిళల భద్రతకు సంబంధించిన ఈ అంశాలపై వెంటనే స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వంలోని పది శాఖలతోపాటు రైల్వే బోర్డు ఛైర్మన్‌కు, ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య అధికారులకు సూచించింది.  

అవగాహనకు ప్రచారం ముఖ్యం 
మహిళల భద్రతకు సంబంధించి వ్యక్తుల ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావం చూపే సామాజిక దృక్పథాలను, ఆలోచనా విధానాలను మార్చడమూ కీలకమేనని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. లైంగిక వేధింపులు అంటే ఏమిటి? అలాంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేయాలి? అనే విషయాలపై అవగాహన లోపించడమే మహిళల భద్రతకు సంబంధించి ప్రధాన సమస్య అని ఆ అడ్వైజరీలో తెలిపింది. లైంగిక వేధింపుల కిందకు ఏయే అంశాలు వస్తాయి? వాటిపై మహిళలకున్న చట్టపరమైన హక్కులు, అత్యవసర నంబర్లు, ఫిర్యాదు చేయడానికి ’సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ ఎలక్ట్రానిక్‌ బాక్స్‌’ (షీ–బాక్స్‌) పోర్టల్‌ వంటి అందుబాటులో ఉన్న వ్యవస్థల గురించిన సమాచారాన్ని బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో పోస్టర్లు, కరపత్రాలు, తదితరాల ద్వారా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 16, 109 పోలీస్‌ స్టేషన్లకుగాను 14, 658 పోలీస్‌ స్టేషన్లలో మహిళల కోసం హెల్ప్‌ డెస్‌్కలున్నాయని వివరించింది. బాధిత మహిళలకు సాయ పడేందుకు వీలుగా ఇతర పోలీస్‌స్టేషన్లలోనూ ఈ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కోరింది.  

ఆందోళనకరంగా మహిళల భద్రత 
మహిళల హక్కుల పరిరక్షణకు దేశంలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో వారి భద్రత ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. 2026 సెపె్టంబరులో మహిళా కార్మిక భాగస్వామ్యం 34.6 శాతంగా నమోదైనట్లు తాజా సర్వే వెల్లడించిందని తెలిపింది. అదే సమయంలో, తాజా జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించిన 4.4 లక్షల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఈ గణాంకాలు మహిళల భద్రత కోసం నిరంతర, సమన్వయపూర్వక చర్యలు అవసరమని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. మహిళలకు రాజ్యాంగం కల్పించిన న్యాయం, సమాన అవకాశాల హక్కులను పరిరక్షించడంలో భద్రత కీలకమని కమిషన్‌ అభిప్రాయపడింది. మహిళలు ఉద్యోగ రంగంలో పూర్తిస్థాయిలో భాగస్వాములు కావడానికి, తమ సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి సురక్షితమైన పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలు అవసరమని పేర్కొంది.

మౌలిక సదుపాయాలు కీలకం 
పని ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. వేధింపులు లేదా ప్రమాదకర పరిస్థితులను గమనించినప్పుడు ఇతరులు బాధితులకు సాయపడేలా ప్రోత్సహించాలంది. పోలీసుల పాత్రను బలోపేతం చేయడంతోపాటు బాధితులకు సహాయ సహకారాలు అందించడం ముఖ్యమైన అంశమని తెలిపింది. మహిళలపై సైబర్‌ నేరాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని కోరింది. వీటిని అమలు చేయాల్సిన కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మహిళా, శిశు అభివృద్ధి, విద్య, హోం వ్యవహారాలు, సమాచార, ప్రసార, కార్మిక, ఉపాధి, కార్పొరేట్‌ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారులు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలు ఉన్నాయి. వీటితోపాటు రైల్వే బోర్డుకు కూడా మార్గదర్శకాలను పంపించింది. సంబంధిత అధికారులందరూ ఈ సిఫారసులను అమలు చేసి, తీసుకున్న చర్యల వివరాలతో కూడిన యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ (ఏటీఆర్‌)ను రెండు నెలల్లోగా సమరి్పంచాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరింది. ఆ మేరకు మహిళల భద్రతకు సంబంధించిన చర్యల పురోగతిపై సమీక్ష జరిపి, అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement