పాక్ జాతీయ అసెంబ్లీలో తీర్మానం
ఇస్లామాబాద్: దక్షిణాసియాలో శాశ్వత శాంతి, భద్రత, స్థిరత్వం వంటివి కశ్మీర్ వివాద పరిష్కారంతో ముడిపడి ఉన్నాయని పాకిస్తాన్ స్పష్టంచేసింది. ఈ మేరకు పాక్ జాతీయ అసెంబ్లీలో మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించారు. కశ్మీర్ వ్యవహారాల మంత్రి అమీర్ ముఖామ్, కశ్మీర్‌పై పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ రాణా ముహమ్మద్ ఖాసిం నూన్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ అచంచలమైన నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతును మరోసారి ప్రకటించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో పాకిస్తాన్ వెల్లడించింది.
కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాలను అమలు చేసేందుకు అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిని పాకిస్తాన్ కోరింది. కశ్మీర్ వివాదానికి న్యాయపరమైన, శాంతియుత పరిష్కారం లభించకుండా దక్షిణాసియాలో శాశ్వత శాంతి, స్థిరత్వం సాధించలేమని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి షరీఫ్ ఈ మేరకు సందేశం ఇచ్చారు. కాశ్మీరీ ప్రజలకు నైతిక, దౌత్యపరమైన, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. మరోవైపు జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు తమలో అంతర్భాగమని, వాటిని వేరు చేయలేమని భారత్ స్పష్టం చేసింది.


