సంతలో కాల్పులు.. 62 మంది మృతి
మరో 52 మందికి గాయాలు
భయంతో వేలాదిమంది గ్రామస్తుల పరారీ
అబుజా: నైజీరియా ఈశాన్య ప్రాంతంలో సాయుధ నేరగాళ్ల ముఠా సామాన్యుల రక్తం కళ్ల జూసింది. బందిపోట్లుగా స్థానికులు పిలిచే ఈ ముఠా ఓ గ్రామంలో జరుగుతున్న వారసంతపై పడి ఏకంగా 62 మందిని చంపేసింది. వీరు జరిపిన కాల్పుల్లో మరో 52 మంది గాయాలపాలయ్యారు. టరాబా రాష్ట్రంలోని కరిం–లమిడో పరిధిలోని బిన్నారిలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుందని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారి లడన్ అయుబా చెప్పారు. బిన్నారి పక్కనే ఉన్న నదిలోనూ 15 వరకు మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. దుండగులను చూసి పారిపోయే క్రమంలో నీళ్లలో మునిగి వీరు చనిపోయారన్నారు.
ఈ ప్రాంతంలో మృతదేహాలు ఇంకా బయటపడుతున్నందున మరణాలు మరింతగా పెరిగే అవకాశముందని వివరించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నైజీరియా డైరెక్టర్ ఇసా సనుసి ఈ దారుణంపై వివరిస్తూ.. మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు వార సంత జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. అక్కడున్న సామాన్యులపైకి ఆ దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. వారు పక్కనే ఉన్న బెన్యు నదిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రజలను నది వైపునకు తరుముకుంటూ వెళ్లారు. ప్రాణాలు కాపాడుకునేందుకు, తప్పించుకోవడానికి కొందరు నదిలోకి దూకారు.
కొందరు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు’అని చెప్పారు. అనంతరం దుండగులు ప్రజల ఇళ్లను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారన్నారు. భయాందోళనకు గురైన వేలాది మంది ఊళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. నైజీరియా ఉత్తర ప్రాంతంలో సామాన్య ప్రజలపై బందిపోట్ల దాడులు సర్వసాధారణం. దుండగులు పెద్ద సంఖ్యలో ప్రజలను కిడ్నాప్ చేసి, డిమాండ్ చేసినంత డబ్బు ఇచ్చాక వదిలి వేస్తుంటారు. ఈ నేరగాళ్ల ముఠాలు అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కూడా నడుపుతుంటాయి. వీరికి తోడు బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ వంటి గ్రూపులు కూడా ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్నాయి.


