గగనతలంలో ఘోరం.. 32 మంది దుర్మరణం | Nigeria Military Plane Crash: No Survivors in Tragic Air Disaster | Sakshi
Sakshi News home page

నైజీరియా గగనతలంలో ఘోరం.. 32 మంది దుర్మరణం

Oct 6 2026 7:24 AM | Updated on Oct 6 2026 7:24 AM

Nigeria Military Plane Crash: No Survivors in Tragic Air Disaster

నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న సైనిక విమానం ఒకటి కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో 32 మంది అక్కడికక్కడే మరణించారు. ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు స్వయంగా ప్రకటించారు. నైజీరియాలో ఇటీవలి సంవత్సరాల్లో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఇది ఒకటిగా పేర్కొన్నారాయన.

నైజీరియా వైమానిక దళానికి చెందిన ఏటీఆర్‌-42 విమానం సాధారణ మిషన్‌లో భాగంగా సోమవారం బెనిన్‌ సిటీ నుంచి లాగోస్‌కు సైనిక విమానం వెళ్తోంది. ఉదయం 8:13 గంటలకు (జీఎంటీ) విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లకు సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత విమానం కోసం భారీ స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరకు ఒండో రాష్ట్రంలోని తీర ప్రాంత పట్టణం ఇగ్బోకొడా సమీపంలో విమానం శకలాలను గుర్తించారు. 

సహాయక, గాలింపు బృందాలు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీసే చర్యలు చేపట్టాయి. స్థానికులు పడవల్లో వెళ్లి విమాన శకలాలను గుర్తించేందుకు సహాయక బృందాలకు సాయం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ సజీవంగా బయటపడలేదని నైజీరియా విమానయాన శాఖ మంత్రి ఫెస్టస్‌ కేయామో వెల్లడించారు.

ప్రత్యక్ష సాక్షి అకింటె టోలువలాసే తన కళ్ల ముందే విమానం కూలిందని చెప్పాడు. ఘటనా స్థలంలో కొందరి వ్యక్తిగత వస్తువులు, మృతదేహాల అవశేషాలు కనిపించాయన్నాడు.  విమానం చిత్తడి నేలలో కూలిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని.. అందుకే తాము అధికారులకు సాయం చేశామని చెప్పాడు.

విమానం ఎందుకు కుప్పకూలిందన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు వైమానిక దళాన్ని ఆదేశించారు.

‘‘ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు వెంటనే దర్యాప్తు ప్రారంభించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’ అని అధ్యక్షుడు టినుబు పేర్కొన్నారు.

ప్రమాదానికి ముందు విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విమానం కూలిపోవడానికి ముందు పైలట్‌ నుంచి ఏమైనా అత్యవసర సందేశం వచ్చిందా? అనే అంశాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించనున్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా 9 వేల అడుగుల కిందకు విమానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement