విజయవాడ: విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 కార్యక్రమంలో భాగంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో వాక్‌థాన్ నిర్వహించారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల సందర్భంగా “సత్యనిష్ఠతో సమృద్ధి – Probity for Prosperity” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ వాక్‌థాన్‌లో ప్రాంతీయ కార్యాలయ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి నిర్మూలన వంటి అంశాలపై అవగాహన కల్పించే సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.
వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల్లో నిజాయితీ, న్యాయం, పారదర్శకత వంటి విలువలను పాటించాల్సిన ఆవశ్యకతపై ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేలా అత్యున్నత నైతిక ప్రమాణాలు, సమగ్రతను పాటిస్తామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.


